
కుల వివాదం..నిరూపించాల్సిన బాధ్యత అధికారులదే
తండ్రి కులమే బిడ్డలకూ వర్తిస్తుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో అధికారుల అడ్డగోలు వాదనలకు హైకోర్టు గట్టి బ్రేక్ వేసింది. ఒక వ్యక్తి ఫలానా కులానికి చెందినవాడు కాదని చెప్పే హక్కు అధికారులకు ఉన్నా.. అది కేవలం అనుమానంతోనో, పాత రికార్డులతోనో చెబితే సరిపోదని, కాదని నిరూపించాల్సిన పూర్తి బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. తండ్రి కులమే బిడ్డలకు వస్తుంది అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, 20 ఏళ్లుగా ఒక వ్యక్తిని కోర్టుల చుట్టూ తిప్పిన అధికారుల తీరును తప్పుబడుతూ న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు, ఇప్పుడు కుల వివాదాల్లో ఉన్న వేలాది మందికి ఒక సంజీవనిలా మారింది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అట్లపాకాల రామకృష్ణ పూర్వీకులు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే కొండకాప (ఎస్టీ) కులస్తులు. రామకృష్ణ విద్యాభ్యాసం అంతా ఎస్టీ కోటాలోనే సాగింది. అయితే, ఆయన బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సమయంలో 1938 నాటి పాత భూ రికార్డులను సాకుగా చూపి, ఆయన కొండకాపు కాదు కాపు అని పేర్కొంటూ అధికారులు 2005లో కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేశారు. 2009లో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఈ ఉత్తర్వులను సమర్థించారు. దీనిపై రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు.
అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఈ కేసు విచారణలో అధికారుల వ్యవహారశైలిపై హైకోర్టు నిప్పులు చెరిగింది. కళ్లముందే పక్కా ఆధారాలున్నా, కావాలని కళ్లు మూసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. తండ్రి కులమే బిడ్డలకు వస్తుంది అనే కనీస ధర్మాన్ని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను అధికారులు గాలికొదిలేయడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపులని 1966 నాటి రికార్డులే కాకుండా, 2004లో సాక్షాత్తూ డిప్యూటీ కలెక్టరే ధ్రువీకరించినా.. అధికారులు మాత్రం ఎక్కడో 1938 నాటి పాత భూ రికార్డులను పట్టుకుని వేలాడటాన్ని కోర్టు ఎండగట్టింది. అసలు బాధితుడికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, తన గోడు చెప్పుకునే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా కుల ధ్రువీకరణను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తాయో ఈ కేసు నిదర్శనమని కోర్టు పేర్కొంది.
రామకృష్ణ ఎస్టీ కాదని గతంలో జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఎవరైనా వ్యక్తి తన కులానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు చూపినప్పుడు, అధికారులు దానిని కాదనాలంటే అందుకు తగ్గ బలమైన సాక్ష్యాలను అధికారులే వెలికితీయాలని, అది పిటిషనర్ బాధ్యత కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

