పుచ్చకాయ ప్రాణాంతకమా?
x

పుచ్చకాయ ప్రాణాంతకమా?

ముంబై విషాదం వెనుక అసలు కారణాలపై అనుమానాలు..


Click the Play button to hear this message in audio format

ముంబైలో ఇటీవల జరిగిన విషాద ఘటన ఆహార భద్రతపై సందేహాలను లేవనెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. ఒక కార్యక్రమానికి హాజరయిన వారంతా రాత్రి చికెన్ బిర్యానీ తిన్నాక పుచ్చకాయ కూడా తిన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు నిలువలేదు.

ఈ ఘటనపై వైద్య నిపుణులు జాగ్రత్తగా స్పందిస్తున్నారు. “కేవలం పుచ్చకాయ తినంత మాత్రనా ప్రాణపాయం ఉండదు. పుచ్చకాయ కలుషితమై ఉండాలి. పండ్లు ఎర్రగా ఉండేందుకు కృత్రిమ రంగులు, తీపి పెంచే రసాయనాలు కలపడం వల్ల అయినా ఉండాలి,” అని ఒక సీనియర్ వైద్యుడు తెలిపారు.

అధిక నీటి శాతం ఉండటంతో వేసవిలో పుచ్చకాయను తినమని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇది ప్రమాదకరంగా మారే అవకాశముంది. పండును కోయడానికి ముందు దాని తొక్కను శుభ్రంగా కడగకపోతే, బయట ఉన్న బ్యాక్టీరియా లోపలికి చేరవచ్చు. ముఖ్యంగా సాల్మొనెల్లా, లిస్టేరియా, ఇ. కోలి వంటి సూక్ష్మజీవులు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. “పుచ్చకాయలో నీరు, చక్కెర అధికంగా ఉండటం వల్ల, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది బలహీనమైన వ్యక్తుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది,” అని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా హెచ్చరించారు.

రసాయనాల ముప్పు కూడా..

కొన్ని సందర్భాల్లో పండ్లలో కృత్రిమ రంగులు, తీపి పెంచే రసాయనాలు కలపడం కూడా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇవి శరీరానికి హానికరంగా మారవచ్చు. “కర్బూజాలు వంటి పండ్లను విడిగా తినాలి. ఇతర ఆహారాలతో కలిపితే జీర్ణ సమస్యలు రావచ్చు,” అని డైటీషియన్ ప్రియాంక సమంత సూచించారు.

నిల్వ విధానం కీలకం..

పుచ్చకాయను కోసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫ్రిజ్‌లో కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి స్థాయి ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉంది.

ముంబై ఘటన ఒక హెచ్చరికగా భావించాలి. సాధారణంగా సురక్షితంగా భావించే ఆహార పదార్థాలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. ఆహారాన్ని శుభ్రంగా ఉంచడం, సరైన విధంగా నిల్వ చేయడం కూడా అవసరం.

Read More
Next Story