టిప్‌ టాప్‌గా వచ్చి.. 35 తులాల గోల్డ్‌ కొట్టేసి..
x
బస్సులోకి ఎక్కుతున్న మహిళా దొంగలు (తెలుపు, ఆలివ్‌ గ్రీన్‌ డ్రెస్‌)

టిప్‌ టాప్‌గా వచ్చి.. 35 తులాల గోల్డ్‌ కొట్టేసి..

విశాఖలో బస్సు ఎక్కుతున్నట్టుగా నటిస్తూ ప్రయాణికురాలి బ్యాగు నుంచి 35 తులాల బంగారాన్ని దొంగిలించారు ఇద్దరు కి‘లేడీలు!

బస్సులో మనతో పాటు ఎక్కే మహిళల్లోనే దొంగలుంటారని ఎవరూ ఊహించరు. సాటి మహిళలే కదా? అని అనుకుంటారు. కానీ విశాఖలో కొందరు మహిళా చోర శిఖామణులు చోరీలకు సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. బస్సులు, బస్టాండ్ల వంటి రద్దీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నత కుటుంబాలకు చెందిన వారిగా నమ్మిస్తున్నారు. అదను చూసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. విశాఖపట్నం ద్వారకా బస్‌ స్టేషన్‌లో జరిగిన ఈ చోరీ ఘటన ఇప్పడు విశాఖ వాసులనే కాదు.. బస్సుల్లో ప్రయాణించే మహిళలను బెంబేలెత్తిస్తోంది.


చోరీ అనంతరం పరారవుతున్న మహిళలు

విశాఖ బస్టాండులో ఏం జరిగిందంటే?
విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీనివాసరావు, అతని భార్య స్పందనలు బంధువుల ఇంట్లో బారసాల కోసం రావులపాలెం వెళ్లేందుకు ద్వారకా బస్‌ స్టేషన్‌కు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు చేరకున్నారు. రాత్రి 9.23 గంటలకు వారు వెళ్లే బస్సు రావడంతో బస్సెక్కారు. ఆదివారం జరిగే బారసాల కార్యక్రమంలో వేసుకునేందుకు స్పందన 35 తులాల బంగారు ఆభరణాలను ఒక బాక్సులో వేసుకుని హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుని బస్సు ఎక్కారు. ముందు భర్త శ్రీనివాసరావు బస్సులోకి వెళ్లగా స్పందన ఆయన వెనక వెళ్లారు. స్పందన వెనకనే పంజాబీ డ్రెస్‌లు వెసుకున్న ఇద్దరు మహిళలను బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. వారిలో తెల్లని డ్రెస్‌ వేసుకున్న మహిళ స్పందనను నెట్టుకుంటూ బస్సెక్కింది. ఆర్మీ రంగు దుస్తులు వేసుకున్న మరో మహిళ కిందనే ఉండిపోయి పరిసరాలను గమనిస్తూ ఉంది. కాసేపటి తర్వాత స్పందనతో బస్సులోకి వెళ్లిన మహిళ కిందకు దిగి అక్కడే వేచి ఉన్న సహచరురాలితో కలిసి వడివడిగా అక్కడ నుంచి పరారయ్యింది. ఇంతలో తన బంగారు ఆభరణాలు తస్కరణకు గురైన సంగతి గమనించిన స్పందన లబోదిబోమంటూ బస్సు దిగి వచ్చింది. భర్త శ్రీనివాసరావుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బ్యాగులో ఉంచిన 35 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్టు ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

విశాఖలోని ద్వారకా బస్‌ స్టేషన్‌

టిప్‌ టాప్‌ దుస్తులతో..
విశాఖ ద్వారకా బస్‌ స్టేషన్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళల చిత్రాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు వాటిని పరిశీలించారు. చోరీకి పాల్పడ్డ మహిళలు ధరించిన దుస్తులను బట్టి ఎగువ మధ్య తరగతి/ఉన్నత శ్రేణి కుటుంబాలకు చెందిన వారుగా ఉన్నారు. వారి భుజాలకు అందమైన హ్యాండ్‌ బ్యాగులు కూడా ఉన్నాయి. వీరి వేషధారణ, వస్త్రధారణను బట్టి వారు దొంగలని ఎవరూ అనుమానించరు. ఇలాంటి వ్యూహంతోనే ఈ మహిళా చోరులు ఖరీదైన దుస్తులతో టిప్‌ టాప్‌గా కనిపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతున్నారు.
నిత్యం రద్దీగా ద్వారకా బస్‌ స్టేషన్‌..
విశాఖలో ప్రధాన బస్టాండ్‌ ద్వారకా బస్‌ స్టేషనే. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల్లో అధికశాతం ఇక్కడకే వస్తాయి. అందువల్ల నిత్యం ఈ బస్‌ స్టేషన్‌ ప్రయాణికులు, బస్సుల రాకపోకలతో ఎంతో రద్దీగా ఉంటుంది. అలాంటి బస్టాండును మహిళా దొంగలు తమకు అనువైనదిగా ఎంచుకున్నారు. తరచూ ఈ బస్‌ స్టేషన్‌లో చిన్న చిన్న చోరీలు, జేబు దొంగతనాలు వంటివి జరుగుతున్నాయి. అందువల్ల ఇన్నాళ్లూ ఎవరూ చోరీలను అంత సీరియస్‌గా తీసుకోలేదు. తాజాగా మహిళ బ్యాగు నుంచి 35 తులాల బంగారు ఆభరణాలను తస్కరించడంతో ఇప్పుడు ఈ బస్టాండుపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇన్నాళ్లూ మగ జేబు దొంగలపైనే ఎక్కువగా నిఘా పెట్టిన విశాఖ పోలీసులు ఇప్పుడు లేడీ కిలేడీలపై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు.
బంగారం ధర ఆకాశాన్నంటడంతో..
బంగారం ధర ఆకాశాన్నంటడంతో ఇప్పుడు ఆడ, మగ తేడా లేకుండా దొంగతనాలకు తెగబడుతున్నారు. 10 గ్రాముల గోల్డ్‌ రూ.లక్షన్నరకు పైగా చేరుకుంది. దీంతో ఇప్పుడు తులం బంగారం చోరీ చేస్తే కష్టపడకుండా లక్షాధికారులవుతారు. అందువల్లే బంగారం దొంగతనాలకు పాల్పడే చోరుల సంఖ్య పెరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.
Read More
Next Story