అలిపిరిలో నోట్ల కట్టలు స్వాధీనం.. ఈ రాకెట్ వెనుక కథమిటి?
x

అలిపిరిలో నోట్ల కట్టలు స్వాధీనం.. ఈ రాకెట్ వెనుక కథమిటి?

చెన్నై వ్యాపారుల కమీషన్ తిర'కాసు' ఉందనే సందేహం


తిరుమలకు తీసుకుని వెళుతున్న భారీగా నగదుతో పాటు చెన్నైకి చెందిన వ్యక్తిని అలిపిరి తనిఖీ కేంద్రంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడం, పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ వ్యక్తితో పాటు నగదును అలిపిరి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం వెనుక చిల్లర కమీషన్ వ్యాపారం జరుగుతోందనే విషయం బయటపడింది. పెద్దమొత్తంలో చిల్లర తీసుకుని రూ. వందకు ఐదు రూపాయల కమీషన్ తీసుకోవడం వల్ల చెన్నైలోని వ్యాపారికి లాభం కలుగుతున్నదనే విషయం వెలుగు చూసింది.

తిరుమలకు వెళ్లే యాత్రికులు శ్రీవారి హుండీకి సమర్పించడానికి నగదు తీసుకుని వెళ్లడం సహజం. బంగారు కానుకలు కూడా సమర్పిస్తుంటారు. నగదు కూడా పది లక్షల వరకు పరిమితి ఉంటుందనేది టీటీడీ అధికారవర్గాల సమాచారం. అలిపిరి చెక్ పోస్టు వద్ద, లేదా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే వైకుంఠం-1,2 ద్వారాల వద్ద టిటిడి విజిలెన్స్, సిబ్బంది తనిఖీల్లో సెక్యూరిటీ సిబ్బంది గమనించినా, పట్టించుకోరు. ఆ మేరకు సెక్యూరిటీ సిబ్బందికి టీటీడీ అధికారులు అనాదిగా మౌఖిక ఆదేశాలు మాత్రమే అమలు చేస్తుంటారు.

అలిపిరి వద్ద ఏమిజరిగిందంటే..

తిరుమలకు వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పోస్టు వద్ద సెక్యూరిటీ సిబ్బంది సునిశితంగా తనిఖీ చేస్తుంటారు. యాత్రికులతో పాటు, వారి వెంట తెచ్చుకునే లగేజీ కూడా స్కానింగ్ చేసిన తరువాతే తిరుమలకు అనుమతిస్తారు. మంగళవారం చెన్నై నుంచి ఓ కారును తనిఖీ చేస్తుండగా, 65 లక్షల నగదు మూట ఉండడం గమనించారు. ఆ నగదు తీసుకుని వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని అలిపిరి ఏవీఎస్ఓ రమేశ్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ వ్యక్తి పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలిసింది.
"తిరుమలలో హుండీకి లభించే కానుకలు బ్యాంకు ద్వారా తీసుకునేందుకు వచ్చానని, ఇంకా రకరకాల సమాధానాలు ఇచ్చారని తెలిసింది"
దీంతో చెన్నై నుంచి రూ. 65 లక్షల నగదు కట్టలు తీసుకుని వచ్చిన వ్యక్తిని విచారణ కోసం అలిపిరి సివిల్ పోలీసులకు అప్పగించినట్లు టీటీడీ ఏవీఎస్ఓ రమేశ్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలే తేలే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఇదీ విషయం..

అలిపిరి వద్ద అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి ఫోన్ చేసిన పోలీసులు
"చెన్నై నుంచి దిలీప్ అనే వ్యక్తి రూ. 65 లక్షల నగదు తిరుమలకు పంపించారు" అనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. తిరుమలలో ఐదు, రెండు రూపాయల నాణేలు ఎస్బీఐ నుంచి తీసుకునేందుకు వచ్చాడని ప్రాధమికంగా గుర్తించారు. ఇక్కడ తీసుకునే నాణేలు చెన్నైకి తీసుకుని వెళ్లి, చిల్లర వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రాధమికంగా వెల్లడైంది. తిరుమలలో బ్యాంకు నుంచి తీసుకునే నాణేలు చెన్నైకి తరలిస్తారు. అందులో వంద రూపాయల నాణేలు వ్యాపారులకు ఇవ్వడానికి ఐదు రూపాయలు కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.
Read More
Next Story