కడప దస్తగిరి హత్య వెనుక పెద్ద కుట్రే ఉంది? ఈ 11 మంది ఎవరు?
x

కడప 'దస్తగిరి' హత్య వెనుక పెద్ద కుట్రే ఉంది? ఈ 11 మంది ఎవరు?

కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్య వెనుక పెద్ద కుట్రే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు


కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త, స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనెల 5వ తేదీ రాత్రి రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రధాన నిందితులు రాజా, రవి సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు కేవలం వ్యక్తిగత గొడవ మాత్రమే కాకుండా రాజకీయ కోణం కూడా ఉందన్న అనుమానాలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.

కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్దదస్తగిరి (53) స్థానికంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తూ పేరు ప్రతిష్టలు సంపాయించారు. రాజకీయంగా పలుకుబడి కూడా సంపాయించారు. ఈనెల 4వ తేదీ మారెమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే వద్ద ఆయన కుమారుడు వెంకటదస్తగిరి, అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన పెద్దదస్తగిరి అక్కడికి వెళ్లి గొడవను సర్దిచెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.

కానీ ఆ వివాదం అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు 5వ తేదీ రాత్రి వెంకటదస్తగిరి మారెమ్మ ఆలయం వద్ద నుంచి వెళ్తుండగా వెంకటేష్ కొందరు యువకులతో కలిసి అతడిని వెంటాడి దాడి చేశారు. ఈ దాడిలో సిద్దయ్య, మౌలాలమ్మ, కె. దస్తగిరి తీవ్రంగా గాయపడగా, పెద్దదస్తగిరి, అతని సోదరుడు చిన్న దస్తగిరిలకు స్వల్ప గాయాలయ్యాయి.
గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పెద్దదస్తగిరి, చిన్నదస్తగిరి అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడే ముందుగా పథకం ప్రకారం కాపుకాసి ఉన్న దుండగులు వారిద్దరినీ చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. పెద్దదస్తగిరి శరీరంపై పదికి పైగా కత్తిపోట్లు పడి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నదస్తగిరి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ హత్యతో కడపలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు అనంతర పరిణామాలు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ హత్య వెనుక కొందరు వైసీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, నిందితులు తప్పించుకునేందుకు కొందరు సహకరించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య అనంతరం తొమ్మిది మంది నిందితులు ఓ వాహనంలో పరారైనట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని నరేంద్ర అనే వ్యక్తి సమకూర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వాహనం, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు నిందితులు చేసిన ఫోన్ కాల్స్, పెద్దదస్తగిరి మొబైల్ డేటా కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.
భూదందాలు, భూవివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అన్నది కీలకంగా మారింది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
అయితే, ఘటన జరిగినప్పటి నుంచి నిందితుల అరెస్టులో ఆలస్యం జరిగిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో కొందరిపై చర్యలు తీసుకున్నప్పటికీ, అసలు దర్యాప్తులో అదే వేగం కనిపించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, చిన్న గొడవగా ప్రారంభమైన ఈ వివాదం పథకం ప్రకారం జరిగిన హత్యగా మారి, ఇప్పుడు రాజకీయ రంగు దాల్చడం కడపలో మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Read More
Next Story