
అన్నయ్యా ఒక్కసారి ’పాప‘ అని పిలవ్వా,చావు అంచుల్లో ఓ చెల్లి ఆఖరి కోరిక
దీనిని చదువుతుంటే కన్నీళ్లు ఆగవు
అది కేవలం కాగితంపై రాసిన అక్షరాలు కావు.. కన్నవారిని కాదని, ప్రేమించిన వాడే లోకమని వెళ్లిన ఒక కూతురు ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో అనుభవించిన నరకయాతనకు నిలువుటద్దం. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ నా జీవితమే ఒక గుణపాఠం అంటూ ఆ తల్లి రాసిన మరణ వాంగ్మూలం ఇప్పుడు గుండెల్ని పిండేస్తోంది. ఒక భర్తకు ఉండకూడని లక్షణాలన్నీ ఉన్న వ్యక్తితో నరకం అనుభవించానని, అప్పుల ఊబిలో కూరుకుపోయి బిడ్డలను పోషించలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ.. కడసారిగా తన అన్నయ్య నోటి నుండి ’పాప‘ అనే పిలుపు కోసం పరితపిస్తూ ఆమె ప్రాణాలు వదిలేసింది. ’మరో జన్మ ఉంటే తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటాను‘ అంటూ పశ్చాత్తాపంతో పద్మ రాసిన ఈ కన్నీటి కావ్యం, నేటి తరం యువతకు ఒక హెచ్చరిక, బాధ్యత లేని భర్తలకు ఒక చెంపపెట్టు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పద్మజ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తోంది. లేఖలో ఏమని రాసిందంటే..
పద్మ తన లేఖను ఒక హెచ్చరికతో మొదలుపెట్టింది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి నా జీవితమే ఒక గుణపాఠం అంటూ తను చేసిన తప్పును అంగీకరించింది. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదని ఏ లక్షణాలైతే కోరుకుంటుందో, తన భర్త శివశంకర్‌లో అవన్నీ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యత లేని భర్త, ఊరంతా అప్పులు, పనిచేయని తత్వం.. వీటన్నింటి మధ్య తను అనుభవించిన కష్టం వర్ణనాతీతమని వాపోయింది. భార్యాపిల్లలను పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అంటూ ఆమె సంధించిన ప్రశ్నసోషల్ మీడియాను కుదిపేస్తున్న అంశంగా మారింది.
నిన్ను అడిగే భార్య ఇక ఉండదు..హాయిగా ఉండు
తన భర్త శివశంకర్ పెట్టే చిత్రహింసలను భరించే ఓపిక లేక, తన చావు ద్వారానే అతనికి 'విముక్తి' కల్పిస్తున్నానని ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. నేను ఉంటే నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇక నేను ఉండను.. హాయిగా బతుకు అంటూ ఒక రకమైన వైరాగ్యంతో ఆమె రాసిన మాటలు ఆమె ఎంత మానసిక వేదనకు గురైందో చెబుతున్నాయి. ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, ఈసారైనా స్థిరపడ్డాక చేసుకో.. కానీ నా లాగా మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు అని కోరుకోవడం ఆమెలోని సంస్కారానికి నిదర్శనం.
అన్నయ్యా.. ఒక్కసారి ’పాప‘ అని పిలవవా
ఈ లేఖలో అత్యంత విషాదకరమైన ఘట్టం తన అన్నయ్యను ఉద్దేశించి రాసిన మాటలు. ఎనిమిదేళ్లుగా అన్నయ్యకు దూరమైన పద్మ, కనీసం చనిపోయే ముందైనా తన అన్నయ్య నోటి నుండి ’పాప‘ అనే పిలుపు వినాలని ఆశపడింది. నీ మీద ప్రేమ లేక కాదు అన్నా.. నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక నీకు దూరంగా ఉన్నాను. నీవు అడిగే ఏ ఒక్క ప్రశ్నకూ నా దగ్గర సమాధానం లేదు అని ఆమె రాసిన మాటలు కన్నవారిని కాదని వెళ్లే పిల్లలు తర్వాత ఎంతటి ఆత్మన్యూనతకు లోనవుతారో, ఎంతటి మానసిక వేదనతో కుండిపోతారో తెలియజేస్తున్నాయి.
మరో జన్మలో.. తల్లిదండ్రులు చూసిన సంబంధమే
పద్మ రాసిన లేఖలోని ప్రతి అక్షరం పశ్చాత్తాపంతో నిండిపోయినట్టుగా ఉంది. తను చేసిన పొరపాటుకు తన జీవితాన్ని తానే బలిపీఠంపై పెట్టుకున్నాననే వేదన ఆమె ప్రతి మాటలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక జన్మంటూ ఉంటే.. నా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటాను. పుట్టింటి వాళ్లతో కలిసి సంతోషంగా జీవిస్తాను అని దేవుడిని వేడుకోవడం ఆమె అనుభవించిన నరకానికి నిదర్శనం. ఈ మాటలు కేవలం ఒక ఆవేదన మాత్రమే కాదు. క్షణికావేశంలో కన్నవారిని కాదని వెళ్లే ఈ కాలపు యువతకు ఆమె ఇస్తున్న అత్యంత చేదు నిజం, ఒక బలమైన సందేశం. తనెలాగూ ఓడిపోయింది, కనీసం తన లేఖ చదివిన మరో ఆడపిల్ల అయినా ఇలాంటి తప్పు చేయకూడదని ఆమె ఆశపడింది. ఆఖరిగా.. కన్నీళ్లతో సారీ నాన్న.. నన్ను క్షమించండి అంటూ తండ్రికి క్షమాపణలు చెబుతూ, భారమైన గుండెతో తన జీవితాన్ని, తన పసిబిడ్డల ప్రాణాలను ఆ తల్లి గాలిలో కలిపేసింది.
ఆత్మహత్య పరిష్కారం కాదు: ప్రాణం విలువైంది
పద్మ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే కావచ్చు. ఆమె అనుభవించిన నరకం వర్ణనాతీతం కావచ్చు. కానీ, తనువు చాలించడం అనేది ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదు. పుట్టింటి వారు తనని ఏమంటారో అన్న భయం, చేసిన తప్పుకు కలిగిన ఆత్మన్యూనత ఆమెను మృత్యువు వైపు నడిపించాయి. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే.. కన్నవారి ప్రేమ ఎప్పుడూ కఠినంగా ఉండదు. తప్పు చేశావని కోప్పడినా, ప్రాణం మీదకు వస్తే అక్కున చేర్చుకునే మొదటి వ్యక్తులు తల్లిదండ్రులే. ఆమె తన అన్నయ్య పిలుపు కోసం ఎంతలా పరితపించిందో, ఆ అన్నయ్య కూడా తన చెల్లి కోసం అంతే వెతుకులాటలో ఉండి ఉండవచ్చు. మరణం తర్వాత ’పాప‘ అని పిలవడం కంటే, బ్రతికి ఉన్నప్పుడే ఆ అన్నయ్య చేతులు పట్టుకుని తన గోడు వెళ్లబోసుకుంటే పద్మ జీవితం మరోలా ఉండేదేమో.

