అల్లంత దూరాన భోగాపురం విమానాశ్ర‌యం..!
x
భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు

అల్లంత దూరాన భోగాపురం విమానాశ్ర‌యం..!

భోగాపురం ఎయిర్‌పోర్టు విమానాల‌ రాక‌పోక‌లు సాగించ‌డానికి రెడీ. దీంతో నాలుగున్న‌ర ద‌శాబ్దాల విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో పౌర విమానాల‌కు బ్రేకులు వేసింది.

విమాన ప్ర‌యాణికుల విన్న‌పాలు విన‌కుండానే భోగాపురం విమానాశ్ర‌యం విమానాల రాక‌పోక‌ల‌కు సిద్ధ‌మ‌యింది. విశాఖ మ‌హా న‌గ‌రానికి దాదాపు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే ఇక‌పై నిత్యం ప్ర‌హ‌స‌నం కానుంది. అన్ని దారులూ బాగుంటేనే ట్రాఫిక్ క‌ష్టాల‌ను అధిగ‌మించి గ‌మ్యానికి చేరుకోవ‌డం ఓ పెద్ద స‌వాలుగా ఉన్న త‌రుణంలో స‌రైన దారీ తెన్నూ లేకుండా తాంబూలాలిచ్చేశాం.. ఇక త‌న్నుకు చావండి.. అన్న‌ట్టుగా ఉంది ప్ర‌భుత్వ పెద్ద‌లు తీరు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసినా అక్క‌డ‌కు వెళ్లే రోడ్ల‌ను పూర్తి కాక‌పోవ‌డం, పైగా 50 కిలోమీట‌ర్ల ఆవ‌ల విమానాశ్ర‌యాన్ని ఉన్న ఫ‌ళంగా చేరుకునే ప‌రిస్థితి త‌లెత్త‌డం, ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులో ఉన్న విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులోకి అడుగు పెట్టే వీలు లేక‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌తో విమాన ప్ర‌యాణికుల్లో అల‌జ‌డి రేగుతోంది. అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా క‌డుపులో స‌ల్ల క‌ద‌ల‌కుండా వైజాగ్ ఎయిర్‌పోర్టుకు రాక‌పోక‌లు సాగించిన వారంతా ఇప్పుడు తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నారు.


భోగాపురం ఎయిర్‌పోర్టుకు న‌డ‌వ‌నున్న ఎరో ఎక్స్‌ప్రెస్ బ‌స్సులు

సోమ‌వారం నుంచే `భోగాపురం` అందుబాటులోకి..

భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు గ్రీన్‌ఫీల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్పోర్టును ఈనెల ఒక‌టిన ప్రధాని న‌రేంద్ర మోదీ అట్ట‌హాసంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్ప‌టికి ఈ విమానాశ్ర‌యం పూర్తి స్థాయి స‌న్న‌ద్ధ‌త‌లో లేదు. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం నుంచి ఈ విమానాశ్ర‌యానికి వెళ్ల‌డానికి స‌రైన దారులు లేక‌పోవ‌డం, ఉన్నది ఏకైక జాతీయ ర‌హ‌దారి మాత్ర‌మే కావ‌డంతో భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానించే ఏడు మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే అందులో నాలుగైదు మాత్ర‌మే పూర్త‌య్యాయి. మిగిలిన రోడ్ల ప‌నులు న‌త్త‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇంత‌లో ఏదో కొంప‌లు మునిగి పోతున్న‌ట్టు.. ఈ నెల 17 నుంచి ఈ ఎయిర్పోర్టు నుంచి విమానాలు ఎగ‌ర‌డానికి ముహూర్తం పెట్టారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత విశాఖ‌ప‌ట్నం ఎయిర్పోర్టుకు మంగ‌ళం పాడేశారు. ఆదివారం అర్థ‌రాత్రి వ‌ర‌కే ఈ విమానాశ్ర‌యంలో విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తిస్తారు. ఆపై ఒక్క పౌర విమానాన్ని కూడా వాల‌నీయ‌రు. దీంతో సోమ‌వారం ఉద‌యం నుంచి ఇక విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యానికి బ‌దులు భోగాపురం ఎయిర్పోర్టుకే వెళ్లాల‌న్న మాట‌.

పౌర విమానాలు నిలిచిపోనున్న విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు

విలువైన స‌మ‌య‌మంతా దారిలోనే హ‌రీ!

ప్ర‌స్తుతం ఉన్న ట్రాఫిక్‌తో విశాఖ న‌గ‌రం నుంచి భోగాపురం వెళ్ల‌డానికి దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. చెక్ ఇన్ కోసం మ‌రో రెండు గంట‌లు ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. అంటే ప్ర‌యాణ స‌మ‌యానికి క‌నీసం నాలుగు గంట‌ల ముందే ఇళ్లు/ ఆపీసుల నుంచి బ‌య‌ల్లేరాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉద‌యం 6 గంట‌ల ఫ్లైట్‌కు ప్ర‌యాణం ఉంటే తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ముందే స్టార్ట్ అవ్వాలి. అంటే మ‌రో గంటో, గంట‌న్న‌రో ముందుగా స‌న్నద్ధత కావాలి. దీన్ని బ‌ట్టి ఉద‌యం విమానంలో వెళ్లే వారు ముందు రాత్రి జాగారం చేయాల్సిన ప‌రిస్థితి దాపురిస్తుంది. అదే సాయంత్రం/ రాత్రి ప్ర‌యాణానికైతే మ‌ధ్యాహ్న‌మే బ‌య‌ల్దేరాలి. ఇలా గంట‌, గంట‌న్న‌ర విమాన ప్ర‌యాణానికి ఆరు గంట‌ల స‌మ‌యం తీసుకుంఉంది. దీనిని బ‌ట్టి త‌మ విలువైన స‌మ‌య‌మంతా హ‌రించి పోయే ప్ర‌మాదం ఉందన్న ఆందోళ‌న విమాన ప్ర‌యాణికుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు బైబై చెబుతున్న ప్ర‌యాణికులు

క‌నెక్టివిటీ రోడ్ల సంగ‌తి స‌రేస‌రి.. లాంజిలేవి?

భోగాపురం విమానాశ్ర‌యాన్ని గ‌డువుకంటే ఆరు నెల‌లు ముందుగానే పూర్తి చేసిన‌ట్టు గొప్ప‌లు చెప్ప‌కుంటున్న కూట‌మి ప్ర‌భుత్వం.. అక్క‌డ‌కు వెళ్లేందుకు క‌నెక్టివిటీ రోడ్లను స‌కాలంలో పూర్తి చేయ‌డంపై శ్ర‌ద్ధ చూప‌లేదు. కొన్ని రోడ్ల‌కు త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌ర‌మే పూర్తి చేయ‌డంపై కూడా దృస్టి సారించ‌లేదు. దీంతో ఎయిర్పోర్టు పూర్త‌యి ప్రారంభోత్స‌వం జ‌రిగినా, రాక‌పోక‌లు ప్రారంభ‌మ‌వుతున్నా ఈ రోడ్లు పూర్తి కాని దుస్థితి దాపురించింది. మ‌రోవ‌వైపు భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్ర‌యాణికుల కోసం జీఎమ్మార్ సంస్థ విశాఖ న‌గ‌రంలో తొమ్మిది చోట్ల ల‌గ్జ‌రీ ఏసీ లాంజిల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు మూడు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టికీ ఒక్క లాంజి ప‌ని కూడా మొద‌లు పెట్ట‌లేదు. అవి ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.

భోగాపురం ఎయిర్పోర్టుకు 20 ఈ- బ‌స్సులు..

మ‌రోవైపు విశాఖ న‌గ‌రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లే విమాన ప్ర‌యాణికుల కోసం ఆర్టీసీ 20 ఈ-బ‌స్సుల (ఏసీ స‌ర్వీసుల‌) ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌స్సుల‌కు ఏరో ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు పెట్టారు. ఉద‌యం 4.30 గంట‌ల నుంచి రాత్రి 10.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌తి అర గంట‌కు ఒక స‌ర్వీసు చొప్పున న‌డ‌ప‌నుంది. వీటిని గాజువాక, సింథియా, రైల్వేస్టేష‌న్‌, ద్వారకా బ‌స్ కాంప్లెక్స్‌, వుడా పార్కు, మారిక‌వ‌ల‌స‌ల‌ మీదుగా ఒక రూటు, గాజువాక‌, ఎన్ ఏ డీ జంక్ష‌న్‌, గురుద్వారా, మ‌ధుర‌వాడ‌, ఆనంద‌పురంల మీదుగా మ‌రొక రూటును ఫిక్స్ చేశారు. టిక్కెట్టు ధ‌ర‌ను గాజువాక నుంచి రూ.400, విశాఖ నుంచి రూ.300 గా నిర్ణ‌యించారు. ఇవి నిర్దేశించిన ప్ర‌దేశాల్లో త‌ప్ప ఇత‌ర స్టాప్‌ల్లో ఆగ‌వు. సాధార‌ణ ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకోరు.

వీపు విమానం మోత మోగాల్సిందే మ‌రి..!

విశాఖ‌ప‌ట్నం నుంచి భోగాపురం విమానాశ్ర‌యానికి వెళ్లాలంటే దాదాపు 50 కి.మీల దూరం ప్ర‌యాణించాలి. ట్యాక్సీ/ క్యాబ్‌ల్లో వెళ్లాలంటే ఫైవ్ సీట‌ర్‌కు రూ.2,500, సెవెన్ సీట‌ర్కు రూ.4,000 చొప్ప‌న చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే ఇంట‌ర్నేష‌న‌ల్ పాసింజ‌ర్‌కు రూ.1,255, వ‌చ్చే వారికి రూ.545, వెళ్లే దేశీయ ప్ర‌యాణికుల‌కు రూ.835, వ‌చ్చే వారికి రూ.355 చొప్పున యూజ‌ర్‌ డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజు చెల్లించాలి. ఇవ‌న్నీ టిక్కెట్టు చార్జీకి అద‌నం. టిక్కెట్టు తీసుకునేట‌ప్పుడే వీటిని క‌లిపి వ‌సూలు చేస్తారు. ఇక ఎయిర్‌పోర్టులోకి ప్ర‌వేశించే వాహ‌నాల‌కు ఎనిమిది నిమిషాల వ‌ర‌కు ఉచితం. 8-10 వ‌ర‌కు రూ.250, 10-15 నిమిషాల వ‌ర‌కు రూ.500, ఆపై వాహ‌నాన్ని లాక్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇలా ఇప్పుడు అల్లూరి సీతారామ‌రాజు ఎయిర్‌పోర్టు అంటేనే అమ్మో! అనే ప‌రిస్థితి నెల‌కొంది.

విశాఖ‌ప‌ట్నా`న్ని మింగేసిన `భోగాపురం`!

దాదాపు నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా పౌర విమాన సేవ‌ల‌ను అందిస్తున్న విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టును భోగాపురం ఎయిర్‌పోర్టు మింగేసింది. ఆదివారం అర్థ‌రాత్రి వ‌ర‌కే వైజాగ్ ఎయిర్‌పోర్టులో పౌర విమానాలు రాక‌పోక‌లు సాగిస్తాయి. ఆ త‌ర్వాత ఇక ఈ విమానాశ్ర‌యంలో పౌర విమానాల‌ను అనుమ‌తించ‌రు. వ‌చ్చే 30 ఏళ్ల పాటు విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో పౌర విమానాలు న‌డ‌ప‌కూడ‌ద‌ని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా క్లాజ్ పెట్టింది. ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన‌ ఈ ఎయిర్‌పోర్టు ఇక‌పై పూర్తిగా నేవీ విమానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానుంది. ఎప్పుడైనా అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌, వీవీఐపీల విమానాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉండ‌నుంది.

బాధాత‌ప్త హృద‌యాల‌తో..

విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంతో ఆదివారం అర్థ‌రాత్రితో త‌మ‌కు అనుబంధం తెగిపోతుండ‌డంతో ప‌లువురు విమాన ప్ర‌యాణికుల్లో దిగులు క‌నిపించింది. ఎన్నో ఏళ్లుగా ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాక‌పోక‌లు సాగించిన వారు ఈ విమానాశ్ర‌యంతో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఎయిర్‌పోర్టు నుంచి ఇదే త‌మ ఆఖ‌రి మ‌జిలీ అంటూ బాధాత‌ప్త హృద‌యాల‌తో విమానాశ్ర‌యాన్ని వీడారు. మ‌రికొంద‌రు బైబై వైజాగ్ ఎయిర్‌పోర్టు అంటూ అక్క‌డ నుంచి నిష్క్ర‌మించారు.
Read More
Next Story