భోగాపురం విమానాశ్ర‌యం.. ఓ పెద్ద గంద‌ర‌గోళం!
x
భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు

భోగాపురం విమానాశ్ర‌యం.. ఓ పెద్ద గంద‌ర‌గోళం!

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారుల‌కు మోక్షం లేక‌పోవ‌డమే కాదు.. ఆ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వంపైనా విమాన ప్ర‌యాణికుల్లో తీవ్ర గంద‌ర‌గోళానికి దారితీస్తోంది.

భోగాపురంలో కొత్త‌గా నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం పేరు ఇప్పుడు స‌ర్వ‌త్రా మార్మోగుతోంది. ఈ విమానాశ్ర‌యం ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? ఎప్ప‌ట్నుంచి క‌మ‌ర్షియ‌ల్ ఆప‌రేష‌న్లు మొద‌ల‌వుతాయి? విమాన ప్ర‌యాణికులు ఆ ఎయిర్‌పోర్టుకు చేరుకోవ‌డానికి నిర్మిస్తున్న‌ క‌నెక్టివిటీ రోడ్ల ప‌రిస్థితి ఏమిటి? వంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రి ద‌గ్గ‌రా స‌రైన స‌మాధానాలు లేవు. భోగాపురానికి దారేది? అని ఎవ‌రైనా అడిగితే అమాత్యుల‌కు, కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధులు ఎక్క‌డా లేనంత కోపం త‌న్నుకు వ‌చ్చేస్తోంది. వారి ద‌గ్గ‌ర కూడా స‌రైన స‌మాధానం లేక అడిగిన వారిపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఎదురు దాడికి దిగుతున్నారు.


భోగాపురం ఎయిర్‌పోర్టు

ఎయిర్‌పోర్టు ప్రారంభం ఎప్పుడు?
భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం దాదాపు పూర్తి కావ‌చ్చింది. తొలుత ఈ విమానాశ్ర‌యాన్ని జులై 5న (ఆదివారం) ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రారంభిస్తార‌ని , ఆపై జులై 8 నుంచి విమాన స‌ర్వీసులు మొద‌ల‌వుతాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందుక‌నుగుణంగానే సింగ‌పూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సంస్థ త‌న విమాన స‌ర్వీసుల‌ను 8వ తేదీ నుంచే ప్రారంభిస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. అంతేకాదు.. విమాన ప్ర‌యాణికులు అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది కూడా. దీంతో జులై 8 లోపు ఈ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. ఆ త‌ర్వాత మ‌రికొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేశాయి. అయితే ఈ ఎయిర్‌పోర్టు జులై 5న కాకుండా వాయిదా ప‌డింద‌న్న స‌మాచారం మూడు రోజుల క్రితం మీడియాకు ఉప్పందింది. దానికి ఫ‌లానా కార‌ణ‌మ‌ని వెల్ల‌డి కాక‌పోయినా త‌లోర‌కంగా మీడియాలో చ‌ర్చ‌లు, క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ నెల‌ 11 వ‌ర‌కు ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో ఉంటున్నందున ముందుగా ప్ర‌చారం జ‌రిగిన‌ట్టు 5న జ‌ర‌గాల్సిన ప్రారంభోత్స‌వం వాయిదా ప‌డిన‌ట్టు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఈ విమానాశ్ర‌యాన్ని ప్ర‌ధాని మ‌ళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తార‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఈనెల‌ మూడో వారంలో ప్రారంభోత్స‌వం ఉంటుందంటూ మీడియాలోను, సోష‌ల్ మీడియాలోనూ ఊద‌ర‌గొడుతున్నారు.

నిర్మాణంలో ఉన్న గంభీరం-ఎన్‌హెచ్‌-16 క‌నెక్టివిటీ రోడ్డు

అయోమ‌యం.. గంద‌ర‌గోళం..
భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌కుండా విమానాల రాక‌పోక‌ల‌కు ఆస్కారం ఉండ‌దు. మ‌రోప‌క్క కొన్ని విమానయాన సంస్థ‌లు జులై 8 నుంచి త‌మ స‌ర్వీసుల‌ను విశాఖ‌కు బ‌దులు భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచే న‌డుపుతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు జులై 9 నుంచి విశాఖ విమానాశ్ర‌యం నేవీ అధీనంలోకి వెళ్లిపోతుంద‌ని, ఇక‌పై అప్ప‌ట్నుంచి పౌర విమానాల రాక‌పోక‌లు నిలిచి పోతాయ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో విమాన ప్ర‌యాణికుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇలావుండ‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభ‌మ‌య్యాక వైజాగ్ విమానాశ్ర‌యం కూడా కొన‌సాగుతుంద‌ని ఇటీవ‌ల విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు సీఎం చంద్ర‌బాబు ముక్త‌స‌రిగా స‌మాధానం చెప్పారు.

బోయ‌పాలెం-మంగ‌మారిపేట క‌నెక్టివిటీ రోడ్డు

క‌నెక్టివిటీ రోడ్ల‌కు మోక్షం ఎప్పుడు?
విశాఖప‌ట్నం నుంచి భోగాపురానికి సుమారు 50 కి.మీల దూరం ఉంది. తీవ్ర‌మైన ట్రాఫిక్ వ‌ల్ల ఈ దూరం వెళ్లాలంటే క‌నీసం గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. గాజువాక నుంచి మ‌రో గంట‌, అన‌కాప‌ల్లి నుంచి అయితే మ‌రో గంట‌న్న‌ర తీసుకుంటుంది. విమాన స‌మ‌యానికి రెండు గంట‌ల ముందు చెకిన్ ఉంటుంది. న‌గ‌రం నుంచి ప్ర‌యాణానికి క‌నీసం మ‌రో రెండు గంట‌లు ప‌డుతుంది. అంటే ప్ర‌యాణ స‌మ‌యానికి నాలుగ్గంట‌లు ముందుగా బ‌య‌లు దేరాల‌న్న మాట‌. ఈ స‌మ‌యాన్ని త‌గ్గించడం కోసం విశాఖ న‌గ‌రం నుంచి వివిధ మార్గాల ద్వారా ఏడు క‌నెక్టివిటీ రోడ్ల నిర్మాణాన్ని చేప‌ట్టారు. వీటిలో రెండు మూడు మిన‌హా మిగ‌తావి పూర్తి కాలేదు. అవి అందుబాటులోకి రావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. క‌నెక్టివిటీ రోడ్లు అందుబాటులోకి రాకుండా ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తే ఎదుర‌య్యే ప్ర‌తికూల ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకునే ప్రారంభోత్స‌వాన్ని తాత్కాలికంగా వాయిదా వేశార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఇలా దారీతెన్నూ లేకుండా మ‌రికొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తే త‌మ‌కు అవ‌స్థ‌లు మొద‌ల‌వుతాయ‌న్న ఆందోళ‌న విమాన ప్ర‌యాణికుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. విశాఖ‌ప‌ట్నం/ భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విజ‌య‌వాడ 50 నిమిషాలు, హైద‌రాబాద్‌, చెన్నైల‌కు గంట‌, బెంగ‌ళూరుకు గంట‌న్న‌ర‌, ఢిల్లీకి రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అంటే ప్ర‌యాణ స‌మ‌యంకంటే ఎయిర్‌పోర్టుకు చేరుకోవ‌డానికే, అటు నుంచి ఒక‌టి నుంచి నాలుగు రెట్ల అధిక స‌మ‌యం తీసుకుంటుంద‌న్న మాట‌. కాగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు స‌రైన క‌నెక్టివిటీ లేద‌న్న విమ‌ర్శ‌ల‌పై ఈ ప్రాంత‌ కూట‌మి ప్ర‌భుత్వ మంత్రులు, ఎమ్మేల్యేలు మండిప‌డుతున్నారు. అవ‌న్నీ అవాస్త‌వాలంటూ కొట్టి పారేస్తున్నారు.

వీఎంఆర్‌డీఏ నిర్మిస్తున్న భోగాపురం క‌నెక్టివిటీ రోడ్లు
రోడ్డు ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు కి.మీలు
చిప్పాడ - దివీస్ రోడ్డు 6.44
నేరెళ్ల‌వ‌ల‌స - కొత్త‌వ‌ల‌స వ‌యా దొర‌తోట 3.89
బోయ‌పాలెం-మంగ‌మారిపేట 3.10
గంభీరం - ఎన్ హెచ్‌-16 2.18
ప‌ర‌దేశిపాలెం - గంభీరం 1.45
శివ‌శ‌క్తిన‌గ‌ర్ - హ‌రిత ప్రాజెక్ట్స్ 1.77
అడ‌వివ‌రం - గండిగుండం హైవే 8.02

ప్ర‌యాణికుల‌కు వీపు విమానం మోతే!
విశాఖ న‌గ‌రంలోని వివిధ‌ ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ట్యాక్సీలో వెళ్ల‌డానికి రూ.2,500 నుంచి 4,000 బాడుగ చెల్లించాల్సి ఉంటుంది. ఇది విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌ల‌కు వెళ్లే వారి ఫ్లైట్ ఒక‌వైపు టిక్కెట్‌కు స‌మానం. సొంత కార్ల‌లో వెళ్లే వారికీ ఇంధ‌న ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుంది. అదే విశాఖ విమానాశ్ర‌యానికైతే నామ‌మాత్ర‌పు ఖ‌ర్చుతోనే వెళ్లి వ‌చ్చే వీలుంది. ట్యాక్సీ అద్దెలే వేల‌కు వేల భార‌మ‌వుతుంటే.. అది చాల‌ద‌న్న‌ట్టు వాటికి యూజ‌ర్స్ చార్జిలు తోడు కానున్నాయి. భోగాపురం విమానాశ్ర‌యం నుంచి వెళ్లే ఇంట‌ర్నేష‌న‌ల్ పాసింజ‌ర్ల‌కు రూ.1,255, వ‌చ్చే వారికి రూ.545, డొమెస్టిక్ (స్వ‌దేశీ) పాసింజ‌ర్ల‌కు రూ.835, వ‌చ్చే వారికి రూ.355 చొప్పున యూజ‌ర్ చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రాక‌పోక‌లు సాగించే వారి వీపు విమానం మోతెక్కించ‌నున్నాయి.
వెయిటింగ్‌ లాంజిలకు స‌న్నాహాలు..
విశాఖ నుంచి భోగాపురం వెళ్ల‌డానికి ట్రాఫిక్ ర‌ద్దీ, స‌మ‌యం, వ్య‌యం ఎక్కువ కానుండ‌డంతో ఏపీ ఎయిర్ ట్రావెల‌ర్స్ అసోసియేష‌న్ (అపాటా) ప్ర‌తినిధుల సూచ‌న‌తో తొమ్మిది చోట్ల‌ వెయిటింగ్ లాంజిలు ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. వీటిని తొలిద‌శ‌లో ఆటోన‌గ‌ర్‌, ఎన్ ఏ డీ జంక్ష‌న్‌, గురుద్వారా, వెంకేజీపాలెం, ఎండాడ‌ల్లో, మ‌లిద‌శ‌లో హ‌నుమంత‌వాక‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, వుడా పార్క్‌, రైల్వేస్టేష‌న్ల‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌రోవైపు ట్యాక్సీ చార్జీల భారాన్ని దృష్టిలో ఉంచుకుని న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 ఈ-బ‌స్సులు (ఏసీ) న‌డ‌పడానికి ఆర్టీసీ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. వీటి టిక్కెట్ ధ‌ర రూ.300-400 వ‌ర‌కు వ‌సూలు చేయ‌నున్నారు. `వారం రోజుల్లో ఈ-బ‌స్సులు వ‌స్తున్నాయి. వాటికి భోగాపురంలో చార్జింగ్ స్టేష‌న్లు అందుబాటులోకి తెస్తున్నాం. వెయిటింగ్ లాంజిలు నెల రోజుల్లో అందుబాటులోకి తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం` అని ఆర్టీసీ జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి బ‌లిజి అప్ప‌ల‌నాయుడు `ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`తో చెప్పారు.
Read More
Next Story