అయోధ్య: రూ.7 కోట్ల విరాళాల ఆరోపణలు.. సిట్ దర్యాప్తుతో కొత్త మలుపు..
x

అయోధ్య: రూ.7 కోట్ల విరాళాల ఆరోపణలు.. సిట్ దర్యాప్తుతో కొత్త మలుపు..

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు


Click the Play button to hear this message in audio format

అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, తిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లు ఉన్నాయి.

సిట్ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు..

రామ మందిర విరాళాల్లో రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై జూన్ 14న ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.

ప్రాథమిక విచారణలో భద్రతా వ్యవస్థలో లోపాలు, ఉద్యోగుల ధృవీకరణలో నిర్లక్ష్యం, సీసీటీవీ పర్యవేక్షణలో లోపాలు, ఆలయం నుంచి ట్రస్ట్ కార్యాలయం, బ్యాంకులకు విరాళాల తరలింపులో విధానపరమైన తప్పిదాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

అంతేకాదు, భక్తులు సమర్పించిన బంగారం, వెండి, నగలు, ఇతర విలువైన వస్తువుల లెక్కింపు, నమోదు ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ రికార్డులను పరిశీలిస్తోంది.

యోగి ఆదిత్యనాథ్ స్పందన..

ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. దర్యాప్తు పేరుతో కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆలయ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారు మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయకుండా, తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్‌కు సమర్పించాలని సూచించారు.

కొనసాగుతోన్న దర్యాప్తు ..

ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తోందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కేసులో వాస్తవాలు ఏవైనా ఉంటే అవన్నీ వెలుగులోకి తీసుకువస్తామని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి నిజాలు ప్రజల ముందుకు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read More
Next Story