
సుగంధ రత్నం… క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్
తూర్పు కనుమల జలపాతాల్లో కనిపించిన అరుదైన మొక్క.
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం సమీపంలోని కంబకం కొండల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన అరుదైన మొక్క… క్రోటన్ ఉబ్బలమడు గెన్సిస్. ఆకుల నుంచి వెదజల్లే అద్భుతమైన సుగంధ పరిమళం దీని ప్రత్యేకత. ఈ సువాసనే ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. ఫలితంగా ఆయన ఈ కొత్త జాతికి ఉబ్బలమడుగు పేరుతోనే నామకరణం చేశారు.
యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ మొక్క సాధారణ క్రోటన్ జాతుల్లోనూ విలక్షణంగా నిలుస్తోంది. ఆకులను తాకినా, నలిపినా తక్షణం వెలువడే సుగంధం దీని గుర్తింపు. ఈ పరిమళం సాధారణ పువ్వుల సువాసనలా కాకుండా ప్రకృతి సహజమైన, మనసును హత్తుకునే రకం. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పి.వి. చలపతిరావు నేతృత్వంలోని పరిశోధనా బృందం తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర సర్వేల్లో ఈ మొక్కను గుర్తించింది.
ఉబ్బల మడుగు మొక్కతో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శాస్త్రీయంగా ఏమి తేలింది?
పరిశోధకులు దీన్ని సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus)తో పోల్చి పరిశీలించారు. రెండూ సుగంధ గుణం కలిగినవే. అయినా ఉబ్బలమడుగెన్సిస్‌లో నిర్మాణం (morphology), ఆకుల ఆకారం, పునరుత్పత్తి లక్షణాలు స్పష్టంగా భిన్నంగా ఉన్నాయి. ఈ తేడాలే దీన్ని కొత్త జాతిగా నిర్ధారించాయి. ఆకుల్లోని సుగంధ తైలాలు (essential oils) దీని ప్రత్యేకతకు కారణం అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ సుగంధ రత్నం అత్యంత పరిమిత ప్రాంతంలోనే కనిపిస్తోంది. ఉబ్బలమడుగు జలపాతం పరిసరాలు, కంబకం కొండలు మాత్రమే దీని సహజ ఆవాసం. ఇలా చిన్న ప్రాంతంలోనే పరిమితమై ఉండటం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు కారణంగా పరిశోధకులు దీన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా గుర్తించారు.
పరిశోధకులు ఏమంటున్నారు?
‘‘ఈ మొక్క ఆకుల నుంచి వెలువడే సుగంధం మామూలు కాదు. అది దీని గుర్తింపు. అదే సమయంలో అతి పరిమిత వ్యాప్తి దీన్ని అత్యంత సున్నితమైన జాతిగా మార్చింది. తూర్పు కనుమల జీవ వైవిధ్యం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుని ఉందని ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది’’ అని పరిశోధనా బృందం సభ్యులు చెబుతున్నారు.
ఈ కొత్త జాతి ఆవిష్కరణ తూర్పు కనుమల అపార సహజ సంపదను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనలు, సంరక్షణ చర్యలు అవసరమని గుర్తు చేస్తోంది. సుగంధం వెదజల్లే ఈ చిన్న మొక్క… తూర్పు కనుమల పర్యావరణ వైభవానికి మరో సాక్ష్యం.

