అమరావతిలో అసలు చిక్కంతా ఆ రెండు గ్రామాల్లోనేనా?
x

అమరావతిలో అసలు చిక్కంతా ఆ రెండు గ్రామాల్లోనేనా?

పట్టుబడుతున్న రైతులు.. వ్యూహం మారుస్తున్న సీఆర్‌డీఏ


ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, రహదారుల గ్రిడ్‌ను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) అహర్నిశలు శ్రమిస్తోంది. అయితే, అంతా అనుకున్నట్లు సాగుతున్నా.. రాజధాని నడిబొడ్డున కొన్ని ప్రాజెక్టుల విస్తరణకు మాత్రం బ్రేకులు పడుతున్నాయి. దీనికి కారణం.. తొలి విడత భూసమీకరణ (LPS) సమయం నుంచి ఇప్పటివరకు కొందరు రైతులు భూములు ఇవ్వకపోవడమే. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మొత్తం భూముల్లో సింహభాగం కేవలం రెండు గ్రామాల్లోనే ఉండటంతో.. ఇప్పుడు అమరావతిలో అసలు చిక్కంతా ఆ రెండు గ్రామాల్లోనే అనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుంచి వారికి సరైన హామీలు రాకపోవడంతో రైతులు వెనకడుగు వేస్తున్నారనే చర్చ కూడా ఉంది.

ఉండవల్లి, పెనుమాక.. సీఆర్‌డీఏకి పెద్ద సవాలు
రాజధాని పరిధిలోని 28 గ్రామాల్లో కలిపి ఇంకా 2,766 ఎకరాల భూమి ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉండగా.. అందులో దాదాపు 40% భూమి కేవలం రెండు గ్రామాల పరిధిలోనే పెండింగ్‌లో ఉంది. విఐపిల రాకపోకలు, ప్రధాన కనెక్టివిటీకి అత్యంత కీలకమైన ఉండవల్లిలో 741 ఎకరాలు, దాని పక్కనే ఉన్న పెనుమాకలో 378 ఎకరాలు ఇంకా సీఆర్‌డీఏ చేతికి రాలేదు. ఈ రెండు గ్రామాల పరిధిలోని 1,119 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. ఇవి కాకుండా నిడమర్రు (యూనిట్ 1, 2) పరిధిలో 432 ఎకరాలు, కురగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా భూములు పెండింగ్‌లో ఉండగా, మిగిలిన చాలా గ్రామాల్లో ఇవ్వాల్సిన భూమి కేవలం 20 ఎకరాల లోపే ఉంది.
హైవేలు, మౌలిక వసతులకు అడ్డంకిగా మారిన లింక్ రోడ్లు
ఈ రెండు గ్రామాల్లో భూములు పెండింగ్‌లో ఉండటం వల్ల రాజధానిని అనుసంధానించే ప్రధాన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, పవర్ గ్రిడ్ల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్కడక్కడా భూములు ఇవ్వని రైతుల పొలాలు ఉండటంతో రహదారుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతోంది. ఈ చిక్కుముడిని విప్పేందుకే సీఆర్‌డీఏ ఇప్పుడు తన పంథాను మార్చింది. ఎక్కడెక్కడైతే అత్యవసరంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలో, ఆయా ప్రాంతాల కోసం విడివిడిగా భూసేకరణ (Land Acquisition) చట్టం కింద నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే 720 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి ఏకంగా 74 విడివిడి ప్రకటనలను అధికారులు విడుదల చేశారు.
భూసమీకరణ (LPS) వర్సెస్ భూసేకరణ (LA): రైతులకు చివరి అవకాశం
ఒకపక్క కఠినమైన భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తూనే, మరోపక్క రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ అధికారులు రాయబారాలు నడుపుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహిస్తూ.. భూసేకరణ చట్టం ద్వారా వెళ్తే ప్రభుత్వం ఇచ్చే వన్-టైమ్ పరిహారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కిందకు వస్తే భవిష్యత్తులో కోట్ల విలువ చేసే రిటర్నబుల్ ప్లాట్లు, ఏటా కౌలు దక్కుతాయి అని అధికారులు లాభనష్టాలను కళ్లకు కడుతున్నారు. భూసేకరణ తుది అవార్డు జారీ అయ్యేంత వరకు రైతులకు ల్యాండ్ పూలింగ్ కిందకు మారే లాస్ట్ చాన్స్ ఇస్తున్నారు. ఈ వ్యూహం ఫలించి ఇటీవల ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లోని కొందరు రైతులు మరో 30 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.
54,000 ఎకరాల మహా యజ్ఞంలో ముగింపు అంకం
అమరావతి భవిష్యత్తు విస్తరణ, ఎయిర్‌పోర్ట్, స్పోర్ట్స్ సిటీల కోసం రెండో విడతలో 7 గ్రామాల నుంచి సేకరిస్తున్న 16,666 ఎకరాల్లో ఇప్పటికే 4,000 ఎకరాల వరకు రైతులు సమ్మతి తెలిపారు. అలాగే 8,000 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చింది. గతంలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల నుంచి 29,000 మంది రైతులు సుమారు 34,281 ఎకరాల సారవంతమైన జిరాయితీ (జరీబు) భూములను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు మిగిలిపోయిన ఈ రెండు గ్రామాల (ఉండవల్లి, పెనుమాక) చిక్కుముడి కూడా వీడితే.. అమరావతి నిర్మాణంలో భూసేకరణ అనే పెద్ద అంకం పూర్తిగా ముగిసినట్లే అవుతుంది. ప్రభుత్వం చూపిస్తున్న ప్లాట్ల ఆఫర్లకు లొంగి రైతులు ల్యాండ్ పూలింగ్‌ వైపు వస్తారా, లేదా భూసేకరణ చట్టం ద్వారానే ముందుకెళ్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
ప్లాట్ల కేటాయింపుల్లో జాప్యంతో రాజధాని రైతుల ఇబ్బందులు
అమరావతి కోసం నాడు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చిన 29 వేల మంది రాజధాని రైతుల ప్రయాణం పూలబాట ఏమీ కాదు. గత పదేళ్లుగా మారిన ప్రభుత్వాలు, రాజకీయ చదరంగం, సుదీర్ఘ న్యాయపోరాటాల మధ్య వారి జీవితాలు తీవ్ర అనిశ్చితిలోకి నెట్టబడ్డాయి. ల్యాండ్ పూలింగ్ (LPS) కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించాల్సిన కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్ల అభివృద్ధి పనులు గత ఐదేళ్లలో పూర్తిగా నిలిచిపోవడం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. ఎంతో సారవంతమైన మూడు పంటలు పండే జరీబు భూములను త్యాగం చేసిన రైతులకు.. కౌలు డబ్బులు సకాలంలో అందక, మరోవైపు కేటాయించిన ప్లాట్లలో ఎలాంటి మౌలిక వసతులు (రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్) లేక అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాజధాని వస్తుందనే ఆశతో వ్యవసాయాన్ని వదులుకున్న యువతకు ఉపాధి లేక, అటు భూమి లేక, ఇటు ప్లాట్ల విలువ పెరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, సరిహద్దుల గుర్తింపు కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం వారి దేహీ స్థితికి అద్దం పడుతోంది.
ఉండవల్లి, పెనుమాక రైతుల ఆవేదన: జీవనాధారం కోల్పోతామనే భయం
ఇక అసలు చిక్కు గా మారిన ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతుల పట్టుదల వెనుక దశాబ్దాల నాటి ఆవేదన, భవిష్యత్తు భయాలు దాగున్నాయి. ఈ రెండు గ్రామాల పరిధిలోని భూములు కృష్ణా నదికి అత్యంత సమీపంలో ఉండి, ఏడాది పొడవునా పచ్చని పంటలతో విలసిల్లే బహుసారవంతమైన తోట భూములు. తరతరాలుగా మాకు జీవనోపాధిని ఇస్తూ, రోజుకు వేల రూపాయల ఆదాయాన్ని అందించే పండ్ల తోటలు, కూరగాయల పొలాలను వదులుకుని.. భవిష్యత్తులో ఎప్పుడో వచ్చే ప్లాట్ల నమ్ముకుని ఎలా రోడ్డున పడాలి? అనేది ఈ రైతుల ప్రధాన ప్రశ్న. భూసమీకరణ కింద ఇచ్చే ప్లాట్ల కంటే తమ సొంత భూమి ద్వారా వచ్చే స్థిర ఆదాయమే తమకు భరోసా అని వారు నమ్ముతున్నారు. దానికి తోడు గతంలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన పక్క గ్రామాల రైతుల ఇబ్బందులను కళ్లారా చూసిన తర్వాత, తాము కూడా భూములు ఇస్తే అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న అపనమ్మకం వారిలో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వం చట్టాల పేరుతో బెదిరించకుండా, తమ భూములకు మార్కెట్ రేటు ప్రకారం సరైన పరిహారం ఇవ్వాలని లేదా తమ జీవనాధారానికి శాశ్వత గ్యారెంటీ చూపాలని ఈ రెండు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story