అడక్కుండానే వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ ఆర్సెలార్‌ మిట్టల్‌!
x
వేదికపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి తదితరులు

అడక్కుండానే వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ ఆర్సెలార్‌ మిట్టల్‌!

అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఏర్పాటు కానున్న ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.


విశాఖ ఉక్కును పోరాటాలు చేసి సాధించుకుంటే అంతకంటే పెద్దదైన ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ అడక్కుండానే వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఏమన్నారంటే?


ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ రెండు ప్లాంట్లూ దేశానికి తలమానికం..
’విశాఖ ఉక్కు, ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్లు ఈ రెండూ దేశ ఉక్కు రంగానికి తలమానికంగా నిలుస్తాయి. ఉక్కు రంగంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌. అలాంటిది ఇక్కడకు వస్తుంది. దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారం ఇది. 5645 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా లక్ష ఉద్యోగాలొస్తాయి. ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని శక్తిగా మారుతుంది. ప్రధాని మోదీ కేంద్రం సాయంతోనే ఇది సాకారం అయింది. ఈ ప్లాంటుకి భూములిచ్చిన రైతులకు శిర స్సు వంచి నమస్కారాలు. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటును రెండు దశల్లో పూర్తి చేస్తాం. 2028 డిసెంబరు నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 2031 జూన్‌కి తొలి బ్లాస్ట్‌ ఫర్నేస్, డిసెంబర్‌కి రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాంటుకి అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌ ఇస్తున్నాం. స్టీల్‌ ప్లాంట్‌కు కాదు.. స్టీల్‌ సిటీకి ఫౌండేషన్‌ వేశాం. ఈ స్టీల్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. ఈ ప్లాంటుకు అనుబంధంగా రూ.11,1192 కోట్ల వ్యయం, 50 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో 316 ఎకరాల్లో క్యాప్టివ్‌ పోర్టు వస్తుంది. దీని ద్వారా మరో ఆరు వేల మందికి ఉద్యోగాలొస్తాయి. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటుకు అంతా సహకరించాలి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భూసేకరణ చేసింది నేనే.

ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

20 నెలల్లో రూ.20.30 లక్షల కోట్ల పెట్టుబడులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాష్ట్రంలో రూ.20.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎన్నికలకంటే ముందు మాటిచ్చినట్టుగానే రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలన 20 నెలల్లోనే చేసి చూపించాం. నేను ఏ పని తలపెట్టినా బేషరతుగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇచ్చారు. మంత్రి లోకేష్‌ ప్రణాళికా బద్ధంగా పనిచేశారు. విశాఖలో గూగుల్, రిలయెన్స్‌ డేటా సెంటర్‌లు వస్తున్నాయి. విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తాం. ఈ సీజనులోనే పోలవరం నీళ్లు అనకాపల్లికి తెస్తాం. పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటును పరిశీలిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌..
దేశంలోనే తొలి గ్రీన్‌ ఫీల్ట్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్సెలార్‌ మిట్టల్‌కు నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేటలో పునాదిరాయి పడింది. దీనికి అనుబంధంగా పోర్టు ఆధారిత స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటవుతోంది. ఇలాంటిది ఇప్పటివరకు దేశంలో మరెక్కడా లేదు. అంతేకాదు.. ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్‌ను వినియోగించే తొలి డిజిటల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఇది. రెండు దశల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రెటెడ్‌ స్టీల్‌ప్లాంటు ఏడాదికి దేశ ఉక్కు రంగంలో రూ.1.36 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్‌తో లక్ష మందికి పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఉద్యోగావకాశాలొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 17.8 మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌.. 8.2 మిలియన్‌ టన్నుల కెపాసిటీ తొలి దశలో ఉక్కును ఉత్పత్తి చేస్తుంది.
చంద్రబాబుకు మైలేజీ తెస్తుందా?
వాస్తవానికి ఈ ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచీ అమిత ప్రేమనే చూపుతున్నారు. ఈ ప్లాంట్‌కు ఆగమేఘాలపై అనుమతుల దగ్గర నుంచి భూసేకరణ వరకూ శరవేగంగా జరిగేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకంటే ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే దీనిపైనే మక్కువ ఎక్కువ కనబరుస్తున్నట్టు ఇప్పటికే ప్రజా సంఘాలు, విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ ప్లాంట్‌ ప్రారంభమైతే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ ప్రాంత వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. అదే జరిగితే సీఎం చంద్రబాబుకు రాజకీయంగా మైలేజి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రైతులు, స్థానికుల ఆందోళనలతో..
ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మొదట్లో స్థానికులతో పాటు భూములిచ్చే రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తమకు తగినంత పరిహారం ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఎకరానికి రూ.18 లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇచ్చారు. ఈ స్టీల్‌ ప్లాంటు కోసం తమ్మయ్యపేట, తుమ్మలపేట, మూలపర్ర, పాటిమీద, బోయపాడు, చందనాడ గ్రామాల వారు నిర్వాసితుయ్యారు. వీరికి 5 సెంట్లు జాగా, ఇంటికి రూ. 9.80 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణ సామగ్రి తక్కువ ధరకు ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదు. అయితే వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండానే స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన పూర్తి చేసేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఆర్సెలార్‌ మిట్టల్‌ ఇండియా చైర్మన్‌ ఆదిత్య మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈఏఎస్‌ శర్మ, భారత ఇంధన శాఖ మాజీ కార్యదర్శి

విశాఖ ఉక్కుపై నిర్లక్ష్యం బాధాకరంః ఈఏఎస్‌ శర్మ..
ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎన్నో విధాలుగా నిర్లక్ష్యం చూపిస్తూ, రెండో వైపు ప్రైవేటు కంపెనీ అయిన అర్సెలార్‌ మిట్టల్‌ కంపెనీ విషయంలో అత్యంత వ్యామోహంతో, రాయితీలతో భూములను నీటిని తనదైన పోర్టును ఇతర సౌకర్యాలను కలిగించడం చాలా బాధాకరం. ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమం కారణంగా నిర్మించబడ్డ విశాఖ ఉక్కు రాజ్యాంగ విలువలకు లోబడి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు రిజర్వేషన్‌ కలిగిస్తున్నది. రాజ్యాంగంలో డైరెక్టివ్‌ ప్రిన్సిపల్స్‌కు అనుగుణంగా స్థానిక అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిగా పనిచేస్తున్నది. కేంద్రం విశాఖ స్టీల్‌కు సొంత ఇనుప గనిని కేటాయించి ఉంటే ఎప్పుడో లాభాలు గడించి, స్టీల్‌ ఉత్పత్తి రంగంలో ముందడుగు వేసి ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్సెలార్‌ మిట్టల్‌ వంటి ప్రైవేటు కంపెనీలకే లాభాలు చేకూర్చే ఉద్దేశంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కావలసిన సహాయం అందించలేదు’ అని భారత ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ పేర్కొన్నారు.
Read More
Next Story