
గవర్నర్ ను కలిసిన ఏపీసీసీ ప్రతినిధి బృందం
విద్యార్థులపై దాడి, రాహుల్ గాంధీ అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ…
పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు చేసిన క్రూర లాఠీచార్జీని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, ఇతర నాయకుల అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) ప్రతినిధి బృందం గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షుడు (పరిపాలన ఇన్‌చార్జ్) కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ శాంతియుత నిరసన హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులపై బలప్రయోగం చేయడం రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర దాడి అని అన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 60 వేల మంది నీట్ అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు.
ఈనెల 22న విజయవాడలోని ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ దాడిలో ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ సహా పలువురు నాయకులు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
విద్యార్థులు, శాంతియుత నిరసనకారులపై నమోదైన కేసులు ఉపసంహరించాలని, పరీక్షల అవకతవకలు, లీకేజీలపై న్యాయమైన విచారణ జరిపించాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలు, శాంతియుత నిరసన హక్కును కాపాడాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌ను ప్రతినిధి బృందం కోరింది.
ఈ ప్రతినిధి బృందంలో మాజీ ఎమ్మెల్యే, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఏపీవైసీ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్, అసెంబ్లీ కోఆర్డినేటర్ మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు.

