అగ్రీ వర్శిటీ వీసీగా ఆంధ్రా రైస్ మ్యాన్ డాక్టర్ పాలడుగు!
x
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్యవిద్యాలయం వీసీగా బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ పాలడుగు సత్యనారాయణ

అగ్రీ వర్శిటీ వీసీగా 'ఆంధ్రా రైస్ మ్యాన్' డాక్టర్ పాలడుగు!

ఎవరీ రైస్ మ్యాన్? ఏమిటి ఆయన ఘనత?.. ఇక్కడ చదవండి


ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇన్ చార్జ్ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్ర రైస్ మ్యాన్ గా పేరొందిన డాక్టర్ పాలడగు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పని చేస్తున్నారు. 1983లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదివిన డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 40 కు పైగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రూపొందాయి.

'రైతు నేస్తం' అవార్డు అందుకుంటున్న డాక్టర్ సత్యనారాయణ

డాక్టర్ MS స్వామినాథన్ పురస్కారం తో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్న డాక్టర్ సత్యనారాయణ నియామకం పట్ల బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం కన్వీనర్ వలేటి గోపీచంద్ సహా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఆకలి రుచి తెలిసిన ‘రైస్ మ్యాన్’

దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆకలి తీర్చే అన్నం గింజను తన పరిశోధనలతో సుసంపన్నం చేసిన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన వేళ, ఆయన విజయాల వెనుక ఉన్న కఠిన శ్రమ, త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి.
నిరుపేద కుటుంబం నుంచి..
విజయవాడ నుంచి బందరు వెళ్లే దారిలో, సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న ఓగిరాల అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణ జన్మించారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనకు ఆకలి విలువ తెలుసు, అన్నార్థుల కష్టాలు తెలుసు. కోటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ఆయన, దొండపాడులో పదో తరగతి పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం విజయవాడ వెళ్లే ఆర్థిక స్తోమత లేక గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు.
వైద్యం వదిలి.. వ్యవసాయం వైపు!
ఆయన జీవితంలో ఓ కీలక మలుపు ఉంది. ఇంటర్ తర్వాత రెండోసారి మెడికల్ ఎంట్రన్స్ రాసినప్పుడు సత్యనారాయణకు సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ప్రభుత్వం నుంచి ఫీజు మినహాయింపు ఉన్నా, హాస్టల్ ఖర్చులకు, ఇతర అవసరాలకు కట్టే కొద్దిపాటి ఫీజు కూడా ఆ కుటుంబానికి భారమైంది. ఇంట్లో ఉన్నది అమ్మితే తప్ప ఆ డబ్బులు రాని పరిస్థితి. ఒక పక్క కొడుకుని డాక్టర్ చేయాలన్న తల్లిదండ్రుల కోరిక ఉన్నా మరోపక్క పేదరికం సృష్టించిన అడ్డంకులు ఆయన్ను వైద్యుణ్ణి కాకుండా చేశాయి.
ఆ క్షణంలో ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, వైద్య విద్యను వదులుకుని బాపట్ల వ్యవసాయ కళాశాలలో అడుగుపెట్టారు. ఆనాడు ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే నేడు ఆయన్ను ‘ఆంధ్రా రైస్ మ్యాన్’గా నిలబెట్టింది. ఒక డాక్టరైతే వందల మంది ప్రాణాలు కాపాడేవారేమో, కానీ ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆయన కోట్ల మంది ఆకలి తీర్చే దిశగా సాగారు.
బంజరు భూముల్లో బంగారు పంటలు
ప్రపంచ దేశాల బువ్వ గిన్నెలు నింపే పనిని భుజానికెత్తుకున్న సత్యనారాయణ సామాన్య రైతులకు అండగా నిలిచారు. తన మేధస్సుతో అధిక దిగుబడినిచ్చే 40 రకాల వంగడాలను సృష్టించారు. దేశంలో సుమారు 70 లక్షల హెక్టార్ల భూమిలో ఆయన అభివృద్ధి చేసిన వరి వంగడాలే సాగు అవుతున్నాయి. బంజరు భూముల్లో కూడా బంగారు పంటలు పండాలన్నదే ఆయన తపన.
గౌరవ ప్రదమైన హోదాలో..
29 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో 12 ఏళ్లు ప్రొఫెసర్‌గా, పరిశోధనా సంచాలకులుగా సేవలందించిన ఆయన, ఇప్పుడు ఏఎన్‌జీఆర్‌ఏయూ (ANGRAU) వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయం.
డబ్బు లేక డాక్టర్ కాలేకపోయానన్న బాధ కంటే, దేశానికి అన్నం పెట్టే శాస్త్రవేత్తను అయ్యానన్న తృప్తి ఆయన కళ్లల్లో కనిపిస్తుంది. ఆకలి రుచి తెలిసిన మనిషి కాబట్టే, ఆయన సృష్టించిన ప్రతి గింజ కోట్లాది మందికి కడుపు నింపుతోంది.
Read More
Next Story