ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ
x
సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ

ఐఆర్, 12వ పీఆర్సీ, పెండింగ్ డీఏలు, అరియర్స్‌పై ఒత్తిడి.


విజయవాడలో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జేఏసీకి అనుబంధంగా ఉన్న వివిధ శాఖాపరమైన ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఆలస్యం చేయకుండా తక్షణం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించి, 12వ పే పరిష్కార కమిషన్ (పీఆర్సీ) నియమించాలని, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ అరియర్స్‌తో పాటు ఇతర ఆర్థిక సమస్యలు, సేవా సంబంధిత అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 7న జేఏసీ రాష్ట్ర కమిటి తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఐక్య ఉద్యమ కార్యాచరణతో పోరాటం చేపట్టాలని స్పష్టం చేశారు.


సమావేశంలో చేసిన తీర్మానాలు

ఈ నెల 25 నుంచి జూలై 10 వరకు అన్ని డిపార్ట్‌మెంట్ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేయాలి.

జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి, ఆర్‌డీఓలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలి.

డివిజన్‌లలోని ముఖ్య కార్యాలయాల వద్ద డిమాండ్లతో బ్యానర్లు ప్రదర్శించాలి.

రాష్ట్ర కార్యవర్గంలోని 13 మంది నాయకులను 13 ఉమ్మడి జిల్లాలకు బాధ్యులుగా నియమించాలి.

జూలై 12న శ్రీకాకుళం, జూలై 21న అనంతపురంలో ‘ఉద్యమ సన్నద్ధం’ సభలు నిర్వహించాలి. తదుపరి ఏలూరు, గుంటూరు నగరాల్లో కూడా సభలు జరుపుతామని తెలిపారు.

సభ్య సంఘాల సభ్యత్వ రుసుములు జూలై 15 లోగా చెల్లించాలి.

ప్రభుత్వం ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోతే టీవీ ఫణి పేర్రాజు, పలిశెట్టి దామోదర రావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (చైర్మన్), పలిశెట్టి దామోదర రావు (సెక్రటరీ జనరల్), టీవీ ఫణి పేర్రాజు (అసోసియేట్ చైర్మన్ & పోరాట కమిటీ చైర్మన్), తిమ్మసర్తి నాగేశ్వర రావు (కోశాధికారి) తెలిపారు.

Read More
Next Story