
నిరుద్యోగుల హక్కులకు భంగం: కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు ఆందోళన
కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం..
రాష్ట్రంలో పెరిగిపోతోన్న కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా సగటున దాదాపు 2వేల కారుణ్య నియామకాలు జరిగాయని, 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 20,801 నియామకాలు జరిగినట్లు గుర్తించింది. ఈ విధానం సాధారణ ప్రభుత్వ నియామకాల కంటే చాలా ఎక్కువని పేర్కొ్ంది.
నిరుద్యోగ యువతకు నష్టం..
కారుణ్య నియామకాల వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న యువత.. ఈ తరహా నియామకాల వల్ల నష్టపోతున్నారని పేర్కొంది.
“కారుణ్య నియామకం హక్కు కాదు. ఇది కేవలం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి మాత్రమే ఉద్దేశించిన మినహాయింపు,” అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎప్పుడు ఇవ్వాలి?
ఉద్యోగంలో ఉన్న సమయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం తీవ్ర పేదరికంలో ఉన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, అలా కాకుండ సాధారణ పరిస్థితుల్లో ఈ విధానంలో ఉద్యోగాలు ఇవ్వడం తగదని కోర్టు మందలించింది.
కేసు నేపథ్యం..
తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం పెన్నెపల్లికి చెందిన లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పెండలయ్య విధి నిర్వహణలో చనిపోయారు. ఆయన కూతురు సుజన కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్, కారుణ్య నియామకాలకు సంబంధించి మూడు నెలల్లోగా కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిశీలన, ఉద్యోగానికి బదులుగా ఎక్స్-గ్రేషియా చెల్లింపు, శాశ్వత ఉద్యోగానికి బదులుగా తాత్కాలిక లేదా అవుట్‌సోర్సింగ్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎక్స్-గ్రేషియా విధానం..
2017లో జారీ చేసిన జీవో 114 ప్రస్తుత పరిస్థితులకు సరిపోవడం లేదని కోర్టు అభిప్రాయపడింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలిన సేవా కాలాన్ని ఆధారంగా తీసుకుని ఎక్స్-గ్రేషియా నిర్ణయించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చినా, అది శాశ్వతం కాకుండా తాత్కాలిక లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉండాలని సూచించింది. శాశ్వత కారుణ్య నియామకాలు కేవలం అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, అదే దిశగా నియామక విధానాలు రూపొందించాలని జస్టిస్ న్యాపతి విజయ్ వ్యాఖ్యానించారు.

