
గోధుమ పిండి
ఆంధ్రాలో గోధుమ పిండి రూ.20లకే..
కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే అందించే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టింది.
నిత్యావసరాల ధరలు మండుతున్న తరుణంలో ఆంధ్రప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ఒక్కో కిలోకు రూ.47.10 వరకు ఖర్చు చేస్తోంది. పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే గోధుమలు ఆరోగ్యానికి ఎంతో మేలు. ప్రజల ఆహారంలో వైవిధ్యం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నాదెండ్ల చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.
రాష్ట్రంలోని అన్ని 26 జిల్లా కేంద్రాలలో కిలో రూ.20కే గోధుమ పిండిని ముందుగా పంపిణీ చేస్తున్నారు. ఆ తరువాత ఇతర ప్రాంతాలకూ విస్తరింపజేస్తారు. ఒక్కో జిల్లా కేంద్రానికి 50 నుంచి వంద టన్నుల గోధుమ పిండిని సరఫరా చేస్తారు. ఉదాహరణ తిరుపతి పట్టణానికి 50 టన్నుల గోధుమ పిండిని కేటాయించారు. 102 చౌకధరల దుకాణాల ద్వారా సుమారు 62 వేల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ పంపిణీని త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర రూ.60–65 ఉండగా, రేషన్ షాపుల్లో రూ.20కే అందుబాటులోకి రావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది. దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై నెలవారీ ఖర్చు తగ్గుతుంది.
ఎవరికెవరికి లబ్ధి?
వైట్ రేషన్ కార్డు (BPL), అంత్యోదయ అన్నయోజన (AAY) కార్డు, NFSA కింద ఉన్న ప్రాధాన్య రేషన్ కార్డులకు గోధుమపిండిని ఇస్తున్నారు.
రేషన్ కార్డు లేనివారికి ఈ పథకం వర్తించదు.
మొత్తం రేషన్ కార్డులు: సుమారు 1.46 కోట్లు
లబ్ధిపొందే వ్యక్తులు: సుమారు 4.3 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ పరిధి: 26 జిల్లాలు
ప్రస్తుత దశలో పంపిణీ: జిల్లా కేంద్రాలు
ఒక్కో కుటుంబానికి: నెలకు కిలో గోధుమ పిండి (ప్రస్తుతం)
బియ్యంతో మాత్రమే నడిచిన రేషన్ వ్యవస్థను, ఆరోగ్యకరమైన ఆహార దిశగా మళ్లించే ప్రయత్నమే రూ.20 గోధుమ పిండి పథకం అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు..
Next Story

