మునిరాజు.. వసూళ్లలో రారాజు!
x

మునిరాజు.. వసూళ్లలో రారాజు!

అసెంబ్లీ అధికారి అరెస్ట్ తో వెలుగుచూస్తున్న అక్రమాలెన్నో!


అతనో ప్రభుత్వ ఉద్యోగి.
పేరు బీకే మునిరాజా.
వయసు సుమారు 40 ఏళ్లు.
హోదా – ఏపీ అసెంబ్లీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్.
వసూళ్లలో మాత్రం “కింగ్” అనే టాక్.
ఇప్పుడు ఏకంగా లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. కోర్టు 15 రోజుల రిమాండ్ విధించడంతో జైలులో కటకటాలు లెక్కిస్తున్నాడు.

ఎవరీ ఈ మునిరాజా?

2018లో గ్రూప్-2 అధికారిగా ఎంపికైన మునిరాజా, ప్రస్తుతం అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో ఏఎస్‌వోగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు రెండేళ్ల పాటు విజయవాడలో తూనికలు-కొలతల శాఖలో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా డిప్యుటేషన్‌పై పనిచేశాడు. ఆ కాలంలోనే “వసూల్ రాజా”గా పేరు తెచ్చుకున్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన మునిరాజాపై గతంలో పలు కేసులు ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన కేసులో ఆరోపణలు అత్యంత తీవ్రంగానే ఉన్నాయి. ఒక ఒంటరి మహిళను మోసం చేసి సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణ ఉంది. పెళ్లి కాలేదని చెప్పి నమ్మించినట్లు ఫిర్యాదు ఉంది. ఆమెతో పాటు ఆమె మైనర్ కుమార్తెపైన కూడా లైంగిక వేధింపులు చేసినట్టు కేసు నమోదు అయింది. రెండేళ్లుగా ఆర్థిక, లైంగిక బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు కుల దూషణలు, బెదిరింపులు, ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ ఆరోపణలపై పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి అరెస్టు చేసినట్లు సమాచారం.

రాజకీయ పలుకుబడి?

మునిరాజాపై ఇది ఒక్క కేసే కాదని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నాలుగు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి పీఏ ద్వారా పలుకుబడి సంపాదించి, ఆ ప్రభావంతో ఇన్నాళ్లు తప్పించుకుంటూ వచ్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తూనికలు-కొలతల శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు వసూళ్లలో వాటాలు పై వరకు వెళ్లేవని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అక్రమార్జనతో వచ్చిన ధన బలం, అధికార హోదా ఆ అధికారికి కవచాలయ్యాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కుటుంబ వివరాలు ఇలా...

మునిరాజాకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన అధికారాన్ని, ఉన్నత పరిచయాలను ఉపయోగించి కుటుంబాన్నీ, బయటివారినీ మోసం చేశాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అరెస్ట్, రిమాండ్

ఫిబ్రవరి 17, 2026న విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ దాఖలు అయినప్పటికీ తక్షణ ఉపశమనం లభించలేదు. విచారణ కొనసాగుతోంది.
ఒక ప్రభుత్వ అధికారి అదీ అసెంబ్లీలో పని చేసే అధికారి- పోక్సో, అట్రాసిటీ కేసుల్లో అరెస్టవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వసూళ్లలో కింగ్ అన్న పేరు తెచ్చుకున్న మునిరాజా…
ఇప్పుడు జైలు గోడల మధ్య నలుగుతున్నాడు. అధికార హోదా, ధన బలం, రాజకీయ పరిచయాలు ఇవేవీ ఆయన్ను కాపాడలేకపోయాయి. చివరికి చట్టం ముందు అందరూ సమానమేనా? అన్న ప్రశ్నకు ఈ కేసు సమాధానం చెప్పే అవకాశం ఉంది.
పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.
Read More
Next Story