ఆణిముత్యాలను అందిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం
x
శతాబ్ది వేడుకల వేదికపై ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు

ఆణిముత్యాలను అందిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో శత వసంతోత్సవ వేడుక కన్నుల పండువుగా జరిగింది.


ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులను, ఆణిముత్యాలను అందజేస్తోందని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. అనేక మంది మంది మహానుభావులను ఈ విశ్వవిద్యాలయం తయారు చేస్తోందని కొనియాడారు. సోమవారం సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన ఇంకా ఏమన్నారంటే..

రూ.100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేస్తున్న దృశ్యం

ఒక యూనివర్సిటీ వందేళ్లు ఉన్నత ప్రమాణాలతో మనుగడ సాగించడం చాలా గొప్ప విషయం. ఈ విశ్వవిద్యాలయం జాతికి ఎందరో మహానుభావులను అందించింది. ఇందులో అధ్యాపకుల కృషి ఎంతో ఉంది. ఇక్కడి ఫ్యాకల్టీ కూడా అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన వారు, అధ్యాపకులు దేశ, విదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్‌ సీవీ రామన్‌ వంటి వారు మచ్చుకు కొందరు. వీరితో పాటు మరెందరో తమ ప్రతిభతో దేశానికి, ఏయూకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. ఏయూను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చాన్సలర్, వైస్‌ చాన్సలర్లు పాటు పడాలి. ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏమీ లేదు. సచిన్‌ 99 సెంచరీలు వేగంగా చేసినా వందో సెంచరీకి చాలా సమయం తీసుకుంది. చివరకు సాధించారు. అందుకే విద్యార్థులు, యువత అసహనం మాని అంతిమ లక్ష్యం కోసం ఓపికతో వేచి ఉండాలి. ఈ జాతికి భవిష్యత్‌ స్టార్లు మీరు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. రాజధాని అమరావతి కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రగతి ఎంతో మెరుగ్గా ఉంది. ఏపీ ప్రభుత్వ సానుకూల విధానాల వల్ల పెట్టుబడిదార్లు ముందుకు వస్తున్నారు. విశాఖపట్నం కూడా ఐటీ, టూరిజం, గ్లోబల్‌ డిజిటల్‌ రంగంలో దూసుకెళ్తోంది. విశాఖ ఆతిథ్యరంగంతో పాటు పవర్‌ పుల్‌ టెక్నాలజీ హబ్‌గానూ మారుతోంది’ అని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

ప్రసంగిస్తున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌

దేశానికే గర్వకారణం ఏయూః చంద్రబాబు

అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికే గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ‘58 దేశాల విద్యార్థులు ఏయూలో చదువుతున్నారంటే ఎంతో గర్వంగా ఉంది. ఏయూ అభివృద్ధి అన్‌స్టాపబుల్‌. ఎవరూ ఆపలేరు. ఏయూ ఒక బ్రాండ్‌. దేశంలోని 53 యూనివర్సిటీలకు ఏయూ దిక్సూచి. స్వాతంత్రానికి ముందే ఈ విశ్వవిద్యాలయం వచ్చింది. ఎందరో కృషి ఫలితంగా ఏయూ ఏర్పడింది. వారందిరినీ గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఈ యూనివర్సిటీ రాజకీయ నేతలను, ఉద్దండులను, విద్యావేత్తలను, పారిశ్రామికవేత్తలను, నిష్ణాతులను, మేధావులను అందిస్తోంది. ఏయూను చూసి నాకు అసూయ కలుగుతుంది. ఇక్కడ ఎందుకు చదువుకోలేక పోయానా? అని. మళ్లీ ఇక్కడ చదువుకుంటే బాగుండుననిపిస్తోంది నాకు.

మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

నావి 26 ఏళ్ల వయసు ఆలోచనలు..
నా వయసు 76 ఏళ్లు. కానీ నేను 26 వయసుండే వాడిలా ఆలోచనలు చేస్తున్నాను. రోజులు మారాయి. సాధారణ వ్యక్తులు అసాధారణ ప్రతిభ చూపుతున్నారు.
విద్యార్థులు స్టార్టప్‌లపై దృష్టి పెట్టండి. సమాజాన్ని ప్రభావితం చేసి ఆవిష్కరణలు చేయండి. మీరు (విద్యార్థులు) ఉద్యోగం చేయడం కాదు.. పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. పిల్లలకు తల్లిదండ్రులిచ్చే ఆస్తి చదువే.
ఏయూకి రూ.500 కోట్లు ఇస్తున్నా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించాలని మంత్రి లోకేష్‌ కోరారు. కానీ నేను రూ.500 కోట్లు ఇస్తున్నా. ఇంకా ప్రతి ఏయూ విద్యార్థి ఒక్క రూపాయి చొప్పున, ఏయూ పూర్వ విద్య్రాఉ్థలు కలిసి మరో రూ.500 కోట్లు సమకూర్చండి. వీసీకి ఆ టార్గెట్‌ ఇస్తున్నా. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. నేను, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి ముందుకొచ్చాం. తెలుగు జాతి పూర్వవైభవానికి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారు. 2047 నాటి ప్రపంచంలో నెంబర్‌ వన్‌ తెలుగు జాతి ఉండాలన్నది మా సంకల్పం. అది విశాఖ నుంచే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

రూ.100 ప్రత్యేక నాణెం

మన మూలాలను మరిచిపోకూడదు..
విద్యార్థులు, నేటి యువత మన మూలాలను మరచిపోకూడదని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘ కన్నతల్లిని, మాతృభూమిని, మాతృభాషను, గురువును, చదువునిచ్చిన సంస్థను మరచి పోకూడదు. విద్యార్థులు మారుతున్న కాలానికనుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పరిశోధనలపై శ్రద్ధ పెరగాలి. కొత్త అన్వేషణలు, ప్రకృతితో మమేకం కావాలి. యువత క్రమశిక్షణతో కూడిన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇంగ్లిష్‌ సహా ఇతర భాషలనూ నేర్చుకోండి. వాటిలో ప్రావీణ్యం సంపాదించుకోండి. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు’ అని ఉద్భోదించారాయన.
మహానుభావులకు వందనాలు..
ఏయూ శతాబ్ది వేడుకల్లో ఏపీ గవర్నర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొని క్తుప్తంగా ప్రసంగించారు. ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు, అభివృద్ధికి, ఎందరో మహానుభావులు కృషి చేశారు. బొబ్బలి, విజయనగరం, పిఠాపురం, జైపూర్‌ మహారాజులతో పాటు మరెందరో భూములు, విరాళాలు సమకూర్చారు. వారందరికీ వందనాలు’ అని పేర్కొన్నారు. ఏయూ పూర్వ అధ్యాపకుడు, ఒడిశా గవర్నర్‌ కె.హరిబాబు మాట్లాడుతూ ‘ఏయూ పూర్వ విద్యార్థులు అనేక రంగాల్లో విశిష్ట సేవలతో ప్రపంచ ఖ్యాతి గాంచారు. ఈ విశ్వవిద్యాలయం ఒక రాష్ట్రపతిని, ఒక ఉప రాష్ట్రపతిని అందించింది. జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రి, పల్లంరాజు, ఇంకా ఎందరో రాజకీయాల్లో రాణించారు. ఇక్కడ చదివిన వారు దేశంలో 50 మంది వీసీలయ్యారు’ అని వివరించారు.

శతాబ్ది వేడుకలకు హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు

ఏయూలో చచువుకుని ఉంటే బాగుండేదిః లోకేష్‌
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివిన తాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుని ఉంటే ఎంతో బాగుండేదనుకుంటానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. ఇక్కడ విద్యా ప్రమాణాలను చూసి ఆ భావన కలుగుతోందన్నారు. ’ఏయూ ఒక పేరు మాత్రమే కాదు.. వందేళ్ల చరిత్ర. అనేక రికార్డులను సాధించింది. ఏయూ ఆవిర్భావం వెనక ఎందరో కష్టం, కృషి ఉంది. ఎందరో దాతలు, వీసీలు ఏయూ అభివృద్ధికి పాటుపడ్డారు. ఏయూలో చదివిన వారు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు. ఏయూ వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. కరికులం మార్చుకోవలసిన అవసరం ఉంది. విద్యార్థులు చదువే కాదు.. ఫీల్డ్‌కి వెళ్లాలి. ఆ దిశగా మార్పు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి ఏయూకి రూ.250 కోట్ల నిధులు కేటాయించి రీసెర్చికి ప్రోత్సహించండి’ అని కోరారు. ఏయూ శతాబ్ది వేడుకల్లో కేంద్రమంత్రులు కె. రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, జీఎమ్మార్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఏయూ వైస్‌ ఛాన్సలర్‌ రాజశేఖర్, సినీ కథా రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 నాణేన్ని కార్యక్రమంలో విడుదల చేశారు.
Read More
Next Story