జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ సంచలనం
x

జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ సంచలనం

ఐదు గ్రామాలు, ఒక మండలం దేశ స్థాయిలో టాప్..


కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు-2025’లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రం ఐదు జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడం రెండో సారి. మహిళా స్నేహపూర్వక పంచాయతీ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో రాష్ట్ర పంచాయతీలు దేశ స్థాయిలో టాప్-3లో నిలిచాయి. మొత్తం రూ.4.75 కోట్ల నగదు బహుమతి రాష్ట్రానికి లభించింది. గ్రామ స్థాయి అభివృద్ధి, పారదర్శకత, మహిళా సాధికారత, సమగ్ర స్థానిక సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (LSDGs) అమలులో రాష్ట్రం చూపిన సమర్థతను ఈ అవార్డులు ధృవీకరించాయి.

మహిళా స్నేహపూర్వక పంచాయతీలో దేశంలోనే నంబర్ వన్: బొక్కసంపాళెం (తిరుపతి జిల్లా)

శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ ‘మహిళా స్నేహపూర్వక పంచాయతీ’ విభాగంలో జాతీయ స్థాయిలో ‘ప్రథమ స్థానం’ సాధించి రూ.1 కోటి బహుమతి అందుకుంది. ఐదేళ్లుగా మహిళలపై నేరాలు సున్నా. బాలికల 100 శాతం విద్య, స్కూల్ డ్రాప్‌అవుట్ సున్నా, నవజాత శిశు మరణాలు సున్నా, 100 శాతం ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు, స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.4 కోట్ల కార్పస్, రోజుకు 500 లీటర్ల పాల ఉత్పత్తి, పంటల వైవిధ్యీకరణ, ఇవన్నీ ఈ గ్రామం సాధించిన మైలురాళ్లు. సర్పంచ్ కె రేఖ మాట్లాడుతూ “మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే మా లక్ష్యం. ఈ అవార్డు మా గ్రామ మహిళల శక్తిని దేశానికి చాటుతోంది” అని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు “ఆ శివయ్య దయతో మన గ్రామం పేరు ఢిల్లీలో ప్రకాశించింది. చాలా సంతోషంగా ఉంది” అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.

సుపరిపాలనలో దేశ టాప్: శృంగవరం (అనకాపల్లి జిల్లా)

నాథవరం మండలంలోని శృంగవరం గ్రామ పంచాయతీ ‘సుపరిపాలన (Good Governance)’ విభాగంలో ‘దేశంలోనే మొదటి స్థానం’ కైవసం చేసుకుంది. పారదర్శకత, డిజిటల్ సేవలు, ప్రజల పాలనలో నమ్మకత్వం, సమర్థవంతమైన పథకాల అమలు ద్వారా ఈ గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తులు “మా పంచాయతీ అధికారులు, సర్పంచ్ నాయకత్వంలో ప్రజల సమస్యలు తక్షణం పరిష్కరించడం ఇప్పుడు దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇది మా అందరి విజయం” అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పేదరిక నిర్మూలన, జీవనోపాధుల్లో రెండో స్థానం: చెమ్ముళ్లపల్లి (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఖాజీపేట మండలంలోని చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీ ‘పేదరిక నిర్మూలన & మెరుగైన జీవనోపాధి’ విభాగంలో జాతీయ ద్వితీయ స్థానం సాధించి రూ.75 లక్షలు అందుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి పథకాలు, వ్యవసాయం, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ల ద్వారా గ్రామంలో పేదరికం తగ్గడం ఈ విజయానికి కారణం. స్థానికులు “మా గ్రామంలో ఇప్పుడు ప్రతి కుటుంబం ఆదాయ మార్గాలు కలిగి ఉంది. ఈ అవార్డు మా కష్టాలకు గుర్తింపు” అని సంతోషం చెప్తున్నారు.

స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల్లో మూడో స్థానం: గుండమాల (ప్రకాశం జిల్లా)

కొత్తపట్నం మండలంలోని గుండమాల గ్రామ పంచాయతీ ‘స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు’ విభాగంలో తృతీయ స్థానం పొంది రూ.50 లక్షలు అందుకుంది. స్వర్ణ గ్రామం సెంటర్, రైతు సేవా కేంద్రం, డోర్‌స్టెప్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా సేవలు అందించడం ఈ గ్రామం విజయ రహస్యం. మత్స్యకార గ్రామమైన గుండమాలలో మౌలిక వసతులు, రోడ్లు, నీటి సరఫరా, ఆరోగ్యం అన్నీ సమగ్రంగా అభివృద్ధి చేశారు. గ్రామవాసులు “మా గ్రామం ఇప్పుడు స్వయం సమృద్ధి మార్గంలో నడుస్తోంది. ఈ అవార్డు మా కలలను బలపరిచింది” అని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మండల స్థాయిలో జాతీయ తృతీయ స్థానం: కుప్పం మండలం (చిత్తూరు జిల్లా)

‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం’లో కుప్పం మండలం దేశంలో మూడో స్థానం సాధించి రూ.1.50 కోట్లు అందుకుంది. అన్ని లోకల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో సమగ్ర పనితీరు ఈ మండలానికి గౌరవం తెచ్చింది.

అధికారులు, ప్రజల స్పందన

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు మాట్లాడుతూ “ఈ అవార్డులు రాష్ట్రం గ్రామీణ స్థాయిలో చూపిన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. సంక్షేమ పథకాలు, పారదర్శకత, ప్రజల సహకారం ఇందుకు కారణం” అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “21 నెలల పాలనలో గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, పారదర్శక పాలనలో సాధించిన ప్రగతి ఇది. గ్రామ స్వరాజ్యం లక్ష్యం సాకారమవుతోంది” అని అభినందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీ శాఖ ఈ విజయం సాధించిందని ప్రశంసలు అందుకుందని అన్నారు.

ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ భారతానికి కొత్త ఉత్సాహం నింపాయి. గ్రామస్తులు “మా కష్టాలు, మా సేవలు దేశం గుర్తించింది. ఇది మా గ్రామాల భవిష్యత్తుకు ప్రేరణ” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం ఇతర పంచాయతీలకు ప్రేరణగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story