నేపాల్ జలప్రళయంలో పార్వతీపురం ఫ్యామిలీ గల్లంతు
x
నేపాల్ జలప్రళయంలో గల్లంతు అయిన పార్వతీపురం కుటుంబం

నేపాల్ జలప్రళయంలో పార్వతీపురం ఫ్యామిలీ గల్లంతు

విధి వక్రీకరించడమంటే ఇదేనేమో.. లండన్ లో ఉంటున్న పార్వతీపురం వాసులు నలుగురు మానససరోవర్ చూడడానికి వెళ్లి గల్లంతు అయ్యారు.


నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు ఓ ప్రవాసాంధ్ర కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. పార్వతీపురం పట్టణంలోని పండా వీధికి చెందిన సుభాష్‌ చంద్ర సాహూ కుటుంబానికి చెందిన నలుగురు నేపాల్‌ వరదల్లో గల్లంతయ్యారు.
సుభాష్‌ చంద్ర సాహూకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సంతోష్‌ కుమార్‌ సాహూ (47) గత 20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడ్డారు. ఆయన భార్య సురభి (43), కుమారుడు స్పందన్‌ (18), కుమార్తె సైనా సాహూ (13)తో కలిసి లండన్‌లోనే నివసిస్తున్నారు.
ఇటీవల కుటుంబ సమేతంగా లండన్‌ నుంచి నేపాల్‌ మీదుగా మానసరోవర్‌ యాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా ఓ వంతెనపై వాహనంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం ముంచెత్తింది. ఈ ప్రవాహంలో వారి వాహనం కొట్టుకుపోయి, నలుగురూ గల్లంతైనట్లు సమాచారం.
ఈ విషయాన్ని నేపాల్‌ గైడ్‌ ద్వారా సంతోష్‌ బంధువులకు తెలియజేశారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
సంతోష్‌ తల్లిదండ్రులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని తమ రెండో కుమారుడు మురళీ సాహూ వద్ద ఉంటున్నారు. యాత్రకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ఊహించని ప్రకృతి విపత్తులో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నేపాల్‌ వరదల విషాద వార్త పార్వతీపురంలోని సాహూ కుటుంబ బంధుమిత్రుల్లోనూ తీవ్ర ఆందోళనకు కారణమైంది. గల్లంతైన నలుగురి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
Read More
Next Story