
హనీ ట్రాప్ సంబంధాలపై ప్రశ్నిస్తే..జర్నలిస్టుతో కాళ్లు పట్టించుకుంటారా?
పత్రికా స్వేచ్ఛ దినోత్సవం వేళ అనంతపురంలో అరాచకం
ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛపై చర్చ జరుగుతున్న వేళ.. అనంతపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హనీ ట్రాప్ చీకటికోణంపై కథనం రాసిన జర్నలిస్టుపై ఓ కాలేజీ మహిళా కరస్పాండెంట్ దాడికి పాల్పడ్డారు. బలవంతంగా కాళ్లు పట్టించుకున్న ఘటన ఇది ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
అనంతపురం నగరంలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రకంపనలు పోలీసు శాఖకు కళంకం తెచ్చాయి. 'హనీ ట్రాప్' కేసులో నిందితురాలైన రంగమ్మతో, స్థానిక కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్‌కు ఉన్న సంబంధాలపై కథనం రాసిన దళిత జర్నలిస్టుపై అమానుషంగా దాడి జరిగింది. అనంతపురంలో జర్నలిస్టు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి మరీ దౌర్జన్యం చేయడమే కాకుండా, బలవంతంగా కాళ్లు పట్టించుకోవడంపై నిరసన వ్యక్తమైంది.
"హనీ ట్రాప్ వంటి నేరపూరిత వ్యవహారాలను వెలుగులోకి తెచ్చారు. ఆ జర్నలిస్టుపై దాడులకు తెగబడడం అరాచకానికి పరాకాష్ట" అని పిఎస్యు విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర వ్యాఖ్యానించారు. జర్నలిస్టుపై దాడికి దిగిన కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేశారు.
"జర్నలిస్టుపై దాడి చేయడం అమానవీయం. హనీట్రాప్ పై కథనం రాసిన జర్నలిస్టుతో కాళ్లు పట్టించుకుని, క్షమాపణ కోరడం దారుణం" అని ఎస్సీఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనంపై అభ్యంతరం ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మినహా దాడులు చేయడం క్షమించరానిదని హరి వ్యాఖ్యానించారు.
ఇంతకీ సంఘటన ఏమిటి?
అనంతపురం జిల్లాలో వలపు వల (హనీ ట్రాప్ ) విసిరే ముఠా తీవ్రంగా చెలరేగింది. ధనవంతులు, వ్యాపారులు, .ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా ఎంచుకున్నారు. యువతులతో ఫోన్లలో మాట్లాడించడం, ఆ తరువాత వారిని ఏకాంతంగా తమ ఇళ్లకు పిలిపించడం, వారిని నగ్నంగా మార్చి, వీడియోలు, ఫోటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేశారనేది ప్రధాన ఆరోపణ. బాధితులు కూడా పోలీసులు, రాజకీయ నేతలతో పంచాయతీలు చేయించి సెటిల్మెంట్లు చేయించునే వారు. ఈ ముఠాలో రంగమ్మ (చిన్న) ఉమాదేవి, మల్లీశ్వరి తో పాటు కొందరు మహిళలను గుర్తించారు. వారిని అరెస్టు చేయడంతో పాటు, ఆ ముఠాకు సహకారం అందించారనే ఆరోపణపై రాప్తాడు సీఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్, గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవ్లా నాయక్ ను సర్వీసు నుంచి తొలగించడంతో పాటు ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు జయరాం నాయక్, దేవేంద్రను సస్పెండ్ చేశారు.
మహిళా కరస్పాండెంట్ పాత్రపై..
హనీ ట్రాప్ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు రంగమ్మతో నగరంలోని ఓ కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆమె ధనవంతుల ఫోన్ నంబర్లు రంగమ్మకు ఇచ్చారనే వివరాలతో అనంతపురం నగరంలోని జర్నలిస్టు లక్ష్మీనారాయణ కథనం రాశారు. ఆ మహిళలిద్దరు కలిసి ఉన్న ఫోటో ప్రచురించారు. దీంతో మనీషా నాయర్ ఆగ్రహించి, జర్నలిస్టు ఇంటికి వెళ్లి, దాడి చేయడం, కాళ్లు పట్టించుకున్న ఘగన వీడియో వైరల్ గా మారింది.
Next Story

