నా కూతుర్లు సంపుతారంట కాపాడండి సామీ..
x

నా కూతుర్లు సంపుతారంట కాపాడండి సామీ..

తిరుపతి జిల్లా కలెక్టర్ కు 84 ఏళ్ల వృద్ధురాలి ఫిర్యాదు..


ముసలి తల్లి ఆస్తిపై కూతుర్లు కన్నేశారు. వైద్యం కోసం మిగుల్చుకున్న ఆస్తి విక్రయించిన తల్లిని, కొనుగోలు చేసిన వారిని చంపుతామంటూ బెదిరిస్తున్నారు.

"కూతుర్లు, మనవడి నుంచి ప్రాణహాని ఏర్పడింది. నన్ను కాపాడండి సామి అని 84 ఏళ్ల వృద్ధ మహిళ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది. వైద్యం కోసం ఉన్న కొద్దిపాటి ఆస్తి కోసం తనను వేధిస్తున్నారు" అని ఆ వృద్ధ తల్లి ఫిర్యాదు చేసింది.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ​చెన్నప్పనాయుడుపేట గ్రామానికి చెందిన కడూరు మునెమ్మ (84)కు ఐదుగురు కుమార్తెలు. భర్త మరణానంతరం ఐదు ఎకరాల భూమిని ఐదుగురు కుమార్తెలకు పంచింది. ఒక ఎకరా భూమి తన పోషణ, వైద్య ఖర్చుల కోసం ఉంచుకుంది. నలుగురు కుమార్తెలు ఆమెను గాలికి వదిలేయగా, చిన్న కుమార్తె రామాయణం జ్యోతి మాత్రమే గత 30 ఏళ్లుగా తల్లి మునెమ్మ బాగోగులు చూస్తోంది.

ఆరోగ్యం కోసం..
తన జీవనం, ఆరోగ్యం కోసం తన వాటాగా ఉంచుకున్న ఎకరా భూమిని వైద్య ఖర్చుల కోసం ఆస్తి విక్రయించడానికి నా నలుగుర కూతుర్లు అడ్డుపడున్నారని మునెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
"​నడుము ఆపరేషన్ కోసం తన వాటాలోని 34 సెంట్ల భూమిని గతంలోనే అమ్ముకున్నాు. మిగిలిన 66 సెంట్లను 2013లో తనను సాకుతున్న మనవడు రామాయణం శేఖర్‌కు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చాను. ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆ పొలాన్ని ఏప్రిల్ 2026లో విక్రయించగా, అసలు సమస్య మొదలైంది" అని మునెమ్మ రెవెన్యూ అధికారులకు విన్నవించింది.
"పొలం అమ్మే హక్కు నీకు లేదు.. పొలంలోకి వస్తే చంపేస్తాం" అంటూ బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారని మునెమ్మ సోమవారం కలెక్టర్‌కు సమర్పించిన అర్జీలో ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తెలు ఆలం విజయమ్మ, చొక్కాని మల్లీశ్వరితో పాటు మనవడు ఆలం దొరబాబు, స్థానికుడు ఆరూరు సుబ్రహ్మణ్యం మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ​మునెమ్మ ఆరోపించింది. ముఖ్యంగా ఆరూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కులం పేరును అడ్డుపెట్టుకుని, చట్టపరంగా తనను ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరికి చెప్పుకున్నా లెక్కలేదంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం - 2007 ప్రకారం తన ఆస్తిపై తనకు పూర్తి హక్కు ఉందని, దానిని అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మునెమ్మ జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది. జీవిత చివరి దశలో ప్రశాంతంగా, మందులకు ఇబ్బంది లేకుండా బతకడానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె విన్నవించింది.​
Read More
Next Story