భారత్‌లో తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ క్యాప్టగాన్ పట్టివేత..
x

భారత్‌లో తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ క్యాప్టగాన్ పట్టివేత..

రూ.182 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు స్వాధీనం, ఒక విదేశీయుడి అరెస్ట్


Click the Play button to hear this message in audio format

భారతదేశంలో తొలిసారిగా ‘క్యాప్టగాన్’ అనే ప్రమాదకర మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.182 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అధికారికంగా ప్రకటించారు.

‘ఆపరేషన్ రేజ్‌పిల్’లో భారీ విజయం..

ఎన్‌సీబీ చేపట్టిన ‘ఆపరేషన్ రేజ్‌పిల్’లో భాగంగా ఈ భారీ డ్రగ్స్ రవాణాను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాలను మధ్యప్రాచ్య దేశాలకు తరలిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో ఒక విదేశీయుడిని కూడా అధికారులు అరెస్టు చేశారు.

అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో స్పందించారు. “మోదీ ప్రభుత్వం, మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దేశాన్ని డ్రగ్స్ రవాణా కేంద్రంగా ఉపయోగించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వం” అని స్పష్టం చేశారు.

క్యాప్టగాన్ అంటే ఏమిటి?

‘క్యాప్టగాన్’ అనేది ఒక రకమైన కృత్రిమ మాదకద్రవ్యం. దీన్ని మొదట 1960 దశకంలో కొన్ని వైద్య చికిత్సల కోసం తయారు చేశారు. ముఖ్యంగా నిద్ర సంబంధిత వ్యాధులు, శ్రద్ధ లోప సమస్యల నివారణకు ఈ మాదకద్రవ్యం వాడేవారు. అయితే, ఈ డ్రగ్‌కు ఎక్కువగా అలవాటు పడే ప్రమాదం ఉండటంతో చాలా దేశాలు దీనిపై నిషేధం విధించాయి. తర్వాత అక్రమ మాదక ద్రవ్య మాఫియాలు దీన్ని రహస్యంగా తయారు చేసి విక్రయించడం ప్రారంభించాయి.

ప్రస్తుతం తయారవుతున్న క్యాప్టగాన్‌లో ఏముంటుంది?

ప్రస్తుతం అక్రమంగా తయారవుతున్న క్యాప్టగాన్ మాత్రల్లో అసలు ఔషధ పదార్థం ఉండటం లేదు. వాటిలో ఆంఫెటమైన్, మెథాంఫెటమైన్, కెఫీన్ వంటి ప్రమాదకర రసాయనాల మిశ్రమం ఉంటోందని అధికారులు చెబుతున్నారు.

ఈ డ్రగ్ వాడితే ఏమవుతుంది?

ఎక్కువసేపు మెలకువగా ఉండటం, ఆకలి తగ్గిపోవడం, తాత్కాలికంగా ఉత్సాహం పెరగడం, దూకుడు స్వభావం పెరుగుతాయి.

ఎందుకు ‘జిహాదీ డ్రగ్’గా పిలుస్తారు?

తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రగ్ వినియోగం ఎక్కువగా ఉండటంతో దీనిని “జిహాదీ డ్రగ్”గా పిలుస్తున్నారు. ఈ మాదకద్రవ్య వ్యాపారంతో తీవ్రవాద సంస్థలు, అక్రమ రవాణా ముఠాలకు సంబంధం ఉన్నట్లు అంతర్జాతీయ దర్యాప్తుల్లో వెల్లడైంది.

డ్రగ్స్‌పై కేంద్రం కఠిన వైఖరి..

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్‌తో ముందుకు వెళ్తోందని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చే లేదా దేశం నుంచి బయటకు వెళ్లే ప్రతి గ్రాము మాదకద్రవ్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్‌సిబి అధికారులను కూడా ఆయన అభినందించారు.

Read More
Next Story