బల్తాల్ బేస్ క్యాంప్ కు చేరుకున్న అమర్ నాథ్ యాత్రికులు
x

బల్తాల్ బేస్ క్యాంప్ కు చేరుకున్న అమర్ నాథ్ యాత్రికులు

ప్రతికూల వాతావరణం కారణంగా ఆరు రోజులుగా నిలిచిపోయిన యాత్ర


Click the Play button to hear this message in audio format

ప్రతిష్టాత్మక అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరు రోజులుగా ఈ యాత్ర నిలిచిపోయింది. వార్షిక అమర్‌నాథ్ యాత్ర శనివారం జమ్మూ నుంచి తిరిగి ప్రారంభమైంది. 6,000 మందికి పైగా యాత్రికులతో కూడిన కొత్త బృందం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి కాశ్మీర్ లోయలోని బల్తాల్ బేస్ క్యాంప్ కు బయలుదేరిందని అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా, ముఖ్యంగా 3,880 మీటర్ల ఎత్తైన ఈ పవిత్ర గుహాలయానికి వెళ్లే రెండు మార్గాలైన అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సాంప్రదాయ పహల్గామ్ మార్గం, గందర్‌బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జూలై 19న యాత్రను నిలిపివేశారు.
1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో సహా 6,269 మంది యాత్రికులతో కూడిన 18వ బృందం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ 223 వాహనాల కాన్వాయ్‌లో తెల్లవారుజామున 2.40 గంటలకు బల్తాల్ బేస్ క్యాంప్ కు బయలుదేరిందని అధికారులు తెలిపారు.
పహల్గామ్ మార్గానికి ఎలాంటి కాన్వాయ్‌ను పంపలేదని వారు తెలిపారు. ఉధంపూర్-రాంబన్ మార్గం వెంబడి పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం, రాళ్లు పడటంతో మూడు రోజుల పాటు మూసివేసిన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాతావరణం మెరుగుపడి, తిరిగి రాకపోకలకు వీలుపడటంతో యాత్ర పునఃప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు.
లోయలో వార్షిక యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు, జూలై 2న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రక్షాబంధన్ పండుగతో పాటు ఆగస్టు 28న ఈ యాత్ర ముగియనుంది.
ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది యాత్రికులు ఈ గుహాలయాన్ని సందర్శించారు. వీరిలో సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. జమ్మూ బేస్ క్యాంప్‌ను ఎంచుకున్న యాత్రికులను విస్తృత భద్రతా ఏర్పాట్ల నడుమ ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో కాశ్మీర్‌కు తరలిస్తారు.


Read More
Next Story