రేపు మీ మొబైల్ ఫోన్‌కు అలర్ట్ మెసేజ్.. ఎవరూ భయపడొద్దు
x

రేపు మీ మొబైల్ ఫోన్‌కు అలర్ట్ మెసేజ్.. ఎవరూ భయపడొద్దు

రాజధాని ప్రాంతంలో సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్ష అని క్లారిటీ ఇచ్చిన విపత్తు నిర్వహణ సంస్థ.


రేపు శనివారం (మే 2) ఉదయం మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా వింత శబ్దంతో మోగినా.. లేదా ఆపకుండా వైబ్రేషన్ వచ్చినా అస్సలు కంగారు పడకండి. అది మీ ఫోన్ సమస్య కాదు, దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడే సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ (Cell Broadcast Alert System) పరీక్ష. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) దేశ పౌరుల భద్రత కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, శనివారం ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్లకు ప్రయోగాత్మకంగా పరీక్షా సందేశాలను (Test Alerts) పంపనున్నారు. తుపాన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర ప్రక్రియలో భాగంగానే ఈ అలర్ట్స్ రానున్నాయి.

సమయం, ప్రక్రియ
శనివారం ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమయంలో రాజధాని ప్రాంతంలోని ప్రజల మొబైల్ ఫోన్లకు బిగ్గరగా శబ్దం (Beep Sound), వైబ్రేషన్‌తో కూడిన నోటిఫికేషన్ వస్తుంది. దీనితో పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రత్యేక సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇది కేవలం వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం కోసం చేస్తున్న ప్రక్రియ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
మీ ఫోన్‌కు వచ్చే సందేశం ఇదే
భారతదేశం, దాని పౌరులకు తక్షణ విపత్తు హెచ్చరిక సేవ కోసం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి సెల్ ప్రసారాన్ని ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు, సురక్షితమైన దేశం. ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజల నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. ఇది పరీక్ష సందేశం. ఈ సందేశం అందుకున్న తర్వాత మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన పని లేదు, లేదా ఎక్కడికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకీ పరీక్ష?
ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, తుపాన్లు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు లక్షలాది మందికి అతి తక్కువ సమయంలో సమాచారాన్ని చేరవేయడమే ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఈ సందేశాలు నేరుగా మొబైల్ టవర్ల ద్వారా ఫోన్లకు చేరుతాయి. రేపు జరగబోయే ఈ సాంకేతిక పరీక్ష ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, అలర్ట్ వేగాన్ని అధికారులు పరిశీలించనున్నారు. కావున, రేపు మొబైల్ ఫోన్లలో హెచ్చరిక శబ్దాలు వచ్చినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురికావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read More
Next Story