
అల వైభోగాపురంలా ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం!
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్్డ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు.
కొన్నేళ్ల క్రితం వరకు భోగాపురం ఓ చిన్న పల్లెటూరు. పేరుకు మండల కేంద్రమే అయినా అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడా ఊరు.. ఉరూ వాడా కాదు.. దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంది. శనివారంతో ఈ భోగాపురం దేశంలో ప్రఖ్యాత విమానాశ్రయాలున్న నగరాల సరసన చేరింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు గమ్యస్థానంగా మారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. పేరుకు తగ్గట్టే లక్షలాది మంది ప్రజల సమక్షంలో, అతిరథ మహారథుల సాక్షిగా జాతికి అంకితం చేశారు.
ఎయిర్‌పోర్టు టెర్మినల్ ను ప్రారంభిస్తున్న ప్రధాని
మూడేళ్ల గడువులో నిర్మించాల్సి ఉన్న ఈ భోగాపురం ఎయిర్‌పోర్టును మరో ఐదు నెలలు ముందే పూర్తి చేశారు. ఉత్తరాంధ్రలో.. ఉత్తరాంధ్రకే చెందిన జీఎమ్మార్ సంస్థ 2203 ఎకరాల్లో దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పలు ప్రత్యేకతలతో, మరో విమానాశ్రయంతో పోలిక లేకుండా దీనిని రూపొందించారు. రూ.5,641 కోట్ల వ్యయంతో అధునాత సదుపాయాలు, హంగులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనే అతి పెద్ద విమానాశ్రయంగా భోగాపురం ఎయిర్‌పోర్టు రూపుదిద్దుకుంది. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని భావిస్తున్న కూటమి ప్రభుత్వం అందుకనుగుణంగానే అత్యంత అట్టహాసంగానే ప్రారంభోత్సవం నిర్వహించింది. ఐదు వేల బస్సులు, మరో ఏడు వేల ఇతర వాహనాల్లో జనాన్ని తరలించింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇలా మూడు లక్షల మందిని భోగాపురానికి చేర్చింది. దీంతో ఆ ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయి కనిపించింది. దీంతో అక్కడ ఓ పెద్ద పండగ వాతావరణాన్ని తలపించింది. సభకు తరలించడానికి తూరుపు తెల్లారకుండానే వాహనాలను సిద్ధం చేశారు. వారికి అవసరమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, టీలు, మంచినీళ్లు వంటి వాటిని సమకూర్చారు.
ప్రధాని సభకు హాజరైన జనం
భోగాపురం ఎయిర్‌పోర్టుకు గిరిజన బాలికలు, మహిళల థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా 13,500 మందితో థింసా నృత్యం చేస్తూ ప్రధానికి స్వాగతం పలకడం విశేషం. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీపులో వీరి థింసా నృత్యానికి మంత్ర ముగ్గులైపోయారు. కార్యక్రమం అనంతరం మోదీ థింసా నృత్యంపై తన అనుభూతిని పంచుకున్నారు. థింసా నృత్యంతో తనకు గిరి బాలికలు స్వాగతం పలకడం తనకు మరచిపోలేని అనుభూతిని పంచిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ప్రధానికి బొబ్బలి వీణను మహుకరిస్తున్న సీఎం చంద్రబాబు
ప్రధానికి థింసా నృత్యంతో స్వాగతం పలుకుతున్న గిరిజన బాలికలు
11.05 గంటలకు టెర్మినల్ ప్రారంభం..
ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టును ఉదయం 11.05 గంటలకు టెర్మినల్‌ను ప్రారంభించారు. అనంతరం 11.37 గంటలకు ముకుళిత హస్తాలతో ప్రధాని ప్రధాన వేదికపైకి చేరుకుని అక్కడ నుంచి ఈ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పొందూరు జందానీతో తయారు చేసిన శాలువతో మోదీని సత్కరించారు. బొబ్బిలి వీణను బహుకరించారు. అనంతరం దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులోని వివిధ ప్రాంతాలను సందర్శించి ఎయిర్‌పోర్టు ప్రత్యేకతలు, తీరు తెన్నులను అధికారులను, జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో తిరుగుతూ థింసా, కూచిపూడి నృత్యాలను, 30 వేల మొక్కలతో వెల్కమ్ మోదీజీ, సీబీఎన్‌జీ పేరిట అక్షర రూపంలో ఏర్పాటు చేసిన లాన్‌ను తిలకించారు.
17 నుంచి విమాన సర్వీసులు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ వివరాలు..
ఆకుల చంద్రశేఖర్
` భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఒక కీలక ద్వారం వంటిది. జీఎమ్మార్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఎయిర్‌పోర్టు కొత్త పెట్టుబడులకు ఊతమిస్తుంది. అంతేకాదు..యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విశాఖపట్నం నుంచి దూర ప్రాంతాలకు ఉన్న అంతర్జాతీయ రవాణా సౌకర్యం ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇది సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్ వంటి వివిధ పరిశ్రమలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతగానో దోహదపడుతుంది; ఈ పరిశ్రమల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విమానాశ్రయ సదుపాయం వల్ల రాబోయే కొన్నేళ్లలో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది` అని `SARC` & Associates కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఆకుల చంద్రశేఖర్ `` ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ `` ప్రతినిధితో చెప్పారు.
ఎమ్మల్యే విష్ణుకుమార్‌రాజు
`` భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొనసాగించాలి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలకు డొమెస్టిక్ సర్వీసులను నడపాలి. అవసరమైతే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును జీఎమ్మార్ సంస్థ వసూలు చేసేందుకు కూడా విమాన ప్రయాణికులకు అభ్యంతరం లేదు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం విజయానికి భోగాపురం ఎయిర్‌పోర్టు నిదర్శనం. `` అని విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు అభిప్రాయపడ్డారు.

