Nandyal | ప్రజా భిక్షాటన సమస్యలపై ప్రభుత్వానికి హెచ్చరిక కోసమే...
ప్రభుత్వ కార్యాలయాలు కాపాడుకునేేందుకు చేసిన నిరసన. నంద్యాల అఖిలపక్షఐక్యవేదిక నేతల స్పష్టీకరణ
“ప్రజల ఆస్తులు ప్రజలకే చెందాలి” అనే నినాదంతో నాలుగు నెలలుగా నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) ప్రాంగణం నుంచి తాత్కాలిక కలెక్టరేట్ తరలించాలని, నూనెపల్లె మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించిన రెండెకరాల భూమి లీజును రద్దు చేయాలని ఐక్యవేదిక ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో కలెక్టర్‌కు పిటిషన్లు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి చెప్పారు. ఆశించిన స్పందన రాకపోవడం వల్లే ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి పెంచేందుకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్‌లో ప్రజా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన చెప్పారు.
"గ్రీవెన్స్ డేలో వినతిపత్రం మినహా ఆ నగదు తీసుకునేందుకు కలెక్టర్ తిరస్కరించారు" అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి చెప్పారు.
"ప్రజలను ప్రభుత్వాన్ని ఇలా అవమానిస్తారా?" అని కూడా నంద్యాల కలెక్టర్ అభ్యంతరం చెప్పారని కూడా బొజ్జా మీడియాకు చెప్పారు.
RARS పరిరక్షణపై కలెక్టర్‌తో చర్చ
ప్రజా భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తాన్ని స్వీకరించే సందర్భంలో, కలెక్టరేట్ కార్యాలయాన్ని ఖాళీ చేసి ఎండలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించాలా? అని కలెక్టర్ అఖిలపక్ష నాయకులను ప్రశ్నించినట్లు నాయకులు తెలిపారు.
దీనికి స్పందిస్తూ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఇతర రైతు సంఘాలు, నాయకులు గత ఐదేళ్లుగా RARS పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తున్న విషయాన్ని కలెక్టర్ గారికి వివరించారు. న్యాయస్థానం అనుమతి తాత్కాలిక కలెక్టరేట్ అవసరాల కోసం కొన్ని గదుల వినియోగానికే పరిమితమైందని వారు పేర్కొన్నారు.
2014 ఆగస్టు 15న అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాను జాతీయ విత్తన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన RARSను మరింత అభివృద్ధి చేయాల్సిన సమయంలో, అక్కడి భవనాలు, భూములు ఇతర పరిపాలనా అవసరాలకు వినియోగించడం ఆ హామీ లక్ష్యానికి అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు.
"ఈ అంశాలన్నీ తనకు తెలుసునని, అఖిలపక్ష ఐక్యవేదిక సమర్పించిన పిటిషన్‌ను ఉన్నతాధికారులకు పంపిస్తాను" అని కలెక్టర్ తెలిపినట్లు నాయకులు వెల్లడించారు.
మార్కెట్ యార్డులు ఎవరి కోసం?
రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, గోదాములు నిర్మించడం, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై రుణ సదుపాయాలు కల్పించడం వంటి చర్యల ప్రాధాన్యతను అఖిలపక్ష నాయకులు వివరించారు.
మార్కెట్ యార్డుల్లో రైతులకు విశ్రాంతి గదులు, క్యాంటీన్లు, నిల్వ సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా, వాటిని అభివృద్ధి చేయకుండా నూనెపల్లె మార్కెట్ యార్డులో రెండెకరాల భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడం సమంజసం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేటాయింపును రద్దు చేసి, మార్కెట్ యార్డు భూములను రైతుల ఆదాయం, వ్యవసాయ మార్కెటింగ్ అభివృద్ధికి ఉపయోగించాలని కలెక్టర్‌ను కోరారు.
ప్రజా భిక్షాటన ప్రజలను అవమానించడానికి కాదు.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి!
ప్రజా భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తాన్ని స్వీకరించడానికి కలెక్టర్ అంగీకరించలేదని, ఈ కార్యక్రమం ప్రభుత్వం, ప్రజలను అవమానపరిచినట్లుగా ఉందని కలెక్టర్ వ్యాఖ్యానించినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు.
దీనిపై స్పందించిన నాయకులు, ప్రజా సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ప్రజల ఆకాంక్షలను తెలియజేయడానికి ఈ ప్రతీకాత్మక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.
ప్రభుత్వం, ప్రజలను అవమానించడం తమ ఉద్దేశం కాదని, ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన విధానాలను సరిదిద్దుకోవాలని కోరుతూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలను అవమానించిన చర్యగా చూడకూడదని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపడం ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాల బాధ్యత అని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన విజిల్‌బ్లోయర్ తరహా ప్రయత్నంగా చూడాలని నాయకులు కోరారు.
రెండు సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ
RARS నుంచి తాత్కాలిక కలెక్టరేట్ తరలింపు, నూనెపల్లె మార్కెట్ యార్డు భూమి కేటాయింపు రద్దు అనే రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు.
ఈ రెండు సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి, క్రిష్టియన్JAC నాయకులు జానయ్య, CPI నాయకులు చౌడప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహనరావు, SDPI నాయకులు ఏజెస్ హుస్సేన్, మజీద్ ఖాన్, వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు బోయ పులి కొండన్న,ప్రొఫెసర్ శివరామిరెడ్డి, మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు షణ్ముఖరావు, CPI నాయకులు బాబా ఫక్రుద్దీన్, సోమన్న, పిడిఎఫ్ యు నాయకులు రాఅంబాబు, సమితి కార్యవర్గ సభ్యులు యర్రం శంకర్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, పట్నం రాముడు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Next Story

