విజయ్ కి మద్దతు, అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?
x

విజయ్ కి మద్దతు, అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?

విజయ్ కి లైన్ క్లియర్ అయింది. వీసీకే, ఐయూఎంల్ మద్దతు పలికాయి. 120 సీట్ల మద్దతు సంపాయించింది. అన్నాడీఎంకే సీనియర్ నేత ఇంట్లో సమావేశమైన అసమ్మతి వర్గీయులు..


తమిళనాట రాజకీయాలు అంతకంతకూ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. ఇప్పుడే వీసీకే మద్దతు ప్రకటిస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో విజయ్ పట్టాభిషేకానికి ఆటంకాలు తొలగిపోయాయి.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే చీఫ్ నెట్టింట పెట్టిన పోస్టు పరిస్థితిని మరింత రసవత్తరంగా మార్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పార్టీకి అభినందనలు చెబుతూ పళనిస్వామి నెట్టింట పోస్టు పెట్టారు.

‘ఇటీవల ముగిసిన 17వ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నేతలు విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పార్టీకి నా శుభాకాంక్షలు’ అని పళనిస్వామి పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరు మాత్రం తన పోస్టులో ఎక్కడా పేర్కొనలేదు. దీంతో, తమిళనాడులో తదుపరి ఏం జరుగుతుందో అన్న చర్చ పతాకస్థాయికి చేరుకుంది.
సరిగ్గా ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకేకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు తాము విజయ్ కి మద్దతు పలుకుతున్నట్టు బాహాటంగా ప్రకటించారు. అన్నా డీఎంకే (AIADMK) పార్టీలో భారీ తిరుగుబాటు మొదలైనట్లు సమాచారం. సీనియర్ నేత సీవీ షణ్ముగం పార్టీని చీల్చే యోచనలో ఉన్నారని, సుమారు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నారని తెలుస్తోంది. వీరిలో కొందరు విజయ్ నేతృత్వంలోని TVK కి మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పుదుచ్చేరి రిసార్ట్ నుండి ఎమ్మెల్యేలు తిరిగి వచ్చిన తర్వాత్త, చెన్నైలోని షణ్ముగం కార్యాలయంలో ఎస్.పి. వేలుమణి, ఎం.ఆర్. విజయభాస్కర్, నత్తం విశ్వనాథన్, సి. విజయభాస్కర్ వంటి సీనియర్ నేతలు కీలక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది
ఇది పళనిస్వామి నాయకత్వానికి సవాల్ విసిరినట్టయింది. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశాన్ని పళిని స్వామి తన ఇంట్లో ఏర్పాటు చేశారు. దీనికి పలువురు గైర్హాజరయినట్టు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టిన నేపథ్యంలో, ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలు ఆయన వైపు చూస్తున్నారనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో ఎన్నికల నాటికి ఇటువంటి వలసలు జరిగే అవకాశం ఉండవచ్చు.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు విజయ్‌కు ఉందన్న భావం ప్రతిపక్షంలో ఉందనేందుకు పళనిస్వామి పోస్టు ఒక సంకేతమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, డీఎంకే వ్యతిరేక పార్టీలు, టీవీకే మధ్య తెరవెనుక మరిన్ని చర్చలు జరుగుతున్నాయనేందుకూ ఇదో సంకేతమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత సందిగ్ధ స్థితి సంక్షోభం స్థాయికి చేరకూడదనే అభిప్రాయం పార్టీల్లో కనిపిస్తోందని అంటున్నారు. అయితే, తమ నాయకుడే సీఎం అవుతారంటూ అంతకుముందు ఒక అన్నాడీఎంకే ఎంపీ కామెంట్ చేయడం పరిస్థితిని మరింత ఉత్కంఠ భరితంగా మార్చింది.
Read More
Next Story