
రోబో అర్జున్ వద్ద నిందితులతో ఆర్పీఎఫ్ సిబ్బంది
పాత దొంగలను పట్టించిన ఏఐ రోబో!
విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఏఐ రోబో కరడుగట్టిన పాత నేరస్తులను గుర్తించి పట్టించి ఔరా అనిపించుకుంది.
ఆ ఏఐ రోబో పేరు ఏఎస్సీ అర్జున్. విశాఖలోనే పుట్టింది. దేశంలోనే తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్లో సేవలందించడానికి ఇటీవలే (జనవరి 22న) అడుగు పెట్టింది. మొదట్లో అంతా ఈ రోబోను చూసి ఏం చేస్తుందిలే! అనుకున్నారు. కానీ పట్టుమని పది రోజులైనా కాకుండానే తానేమిటో నిరూపించింది. ఇంతకీ ఆ ఇంటిలిజెంట్ రోబో ఏం చేసిందో తెలుసా?
విశాఖ రైల్వే స్టేషనల్లో ఏర్పాటైన రోబో ఏఎస్సీ అర్జున్
అర్జున్ రోబో ఏం చేస్తుందంటే?
ప్రయాణికుల రక్షణ, భద్ర, సేవల నిర్వహణ కోసం వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో హ్యూమనాయిడ్ రోబోను ఏర్పాటు చేశారు. దీనికి ఏఎస్సీ అర్జున్ అనే పేరు పెట్టారు. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)తో అనుసంధానించారు. ఇది రియల్ టైమ్ పర్యవేక్షణ సామర్థ్యంతో పాటు ప్రయాణికులకు సహాయం అందిస్తుంది. ముఖ గుర్తింపు ద్వారా అక్రమ చొరబాట్లను గుర్తించడంతో పాటు ఏఐ ఆధారిత గుంపుల నిర్వహణ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో ప్రజా ప్రకటనలు, ప్లాట్‌ఫాం గస్తీ, సమగ్ర డ్యాష్ బోర్డు ద్వారా పరిస్థితుల అవగాహన, అగ్ని, పొగను ముందుగానే గుర్తించడం వంటి పనులు చేస్తుంది.
నిందితులను గుర్తించి తనలో నిక్షిప్తం చేసిన రోబో
తొలిసారిగా కేడీలను పట్టించింది..
ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఉండే అర్జున్ రోబో తొలిసారిగా తన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించి అందరినీ అబ్బురపరచింది. సోమవారం రాత్రి (ఈనెల 2న) 8.10 గంటల సమయంలో నిఘా, గస్తీలో ఉన్న అర్జున్ రోబో ఒక అనుమానితుడి ముఖాన్ని తన డేటా బేస్‌లోని నేరస్తుల చిత్రాలతో పోల్చి చూసింది. మ్యాచ్ కాగానే వెంటనే విశాఖపట్నం ఆర్పీఫ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్‌కు అలెర్ట్ పంపింది. ఈ అలర్ట్‌ను అందుకున్న సీసీటీవీ హెడ్ కానిస్టేబుల్ బీఎస్ నారాయణ లైవ్ ఫీడ్‌ను పరిశీలించి, తక్షణమే డ్యూటీలో ఉన్న ఎస్ఐ వి.కీర్తిరెడ్డి, వాల్తేరు డివిజన్ క్రైం ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ బృందాన్ని అప్రమత్తం చేశారు. ఆ బృందం సమన్వయంతో తనిఖీలు చేపట్టి అడపా శివ (39), అతని అనుచరుడు జి.బంగారును పట్టుకున్నారు. వీరిని జీఆర్పీకి అప్పగించి విచారణ చేపట్టారు.
వీరిద్దరూ కరడుగట్టిన డెకాయిట్లు..
వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. వీరిద్దరూ రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కరడుగట్టిన పాత నేరస్తులుగా తేల్చారు. వీరిపై గత కొన్నేళ్లుగా దొంగతనం, దోపిడీ, డెకాయిట్, దాడి, ఆయుధ చట్టం కింద అనేక తీవ్రమైన కేసులున్నాయి. నిందితులు అనుమతి లేకుండా స్టేషన్లో ప్రవేశించినట్టు, ఎంట్రీ పాయింట్ వద్దనే ఏఐ టెక్నాలజీ ద్వారా దొరికి పోయినట్టు గుర్తించారు. వీరిపై భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం చర్యలు తీసుకున్నారు. అనంతరం రాయగడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా మాట్లాడుతూ ‘రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో నేరస్తులను గుర్తించడంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందో ఈ ఘటన నిరూపించింది. రైలో రోబో కాప్ ఏఎస్సీ అర్జున్ ద్వారా ప్రయాణికుల భద్రతను మరింత మెరుగు పరుస్తున్నాం. అర్జున్ రోబో పనితీరు అమోఘం’ అని పేర్కొన్నారు.
Next Story

