‘‘మెటా అధిపతి క్షమాపణ చెప్పకపోతే చర్యలు తప్పవు’’
x
మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్

‘‘మెటా అధిపతి క్షమాపణ చెప్పకపోతే చర్యలు తప్పవు’’

సమాచార సాంకేతిక పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక


ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక వీడియోను ఫేస్‌బుక్ తాత్కాలికంగా తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భారత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచార సాంకేతిక పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే హెచ్చరించారు.

అంతేకాకుండా, జూలై 23న ప్రధానమంత్రి పోస్ట్ చేసిన వీడియోను తొలగించడానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ మెటాను ఆదేశించింది. నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోకపోతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద మెటాకు లభిస్తున్న "సేఫ్ హార్బర్" రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ రక్షణ తొలగితే, వినియోగదారుల కంటెంట్‌కు సంబంధించి మెటాపై నేరుగా చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది.

ఈ ఘటనను నిషికాంత్ దూబే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి అధికారిక పోస్టునే ఈ విధంగా తొలగిస్తే, సాధారణ ప్రజల పోస్టుల భద్రతపై ఏ విధమైన నమ్మకం ఉంటుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. దీనిని కేవలం సాంకేతిక లోపంగా పరిగణించలేమని, ఇది వ్యవస్థలో తీవ్రమైన వైఫల్యం లేదా ప్రధానమంత్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

జూలై 23న ప్రధానమంత్రి విద్యార్థులను ఉద్దేశించి పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ సెల్ఫీ వీడియోను ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదే వీడియో ఫేస్‌బుక్‌లో కొంతసేపు కనిపించకుండా పోయింది. అనంతరం సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని మెటా వివరణ ఇచ్చి, వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన మెటా ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు. అయితే, ఐటీ మంత్రిత్వ శాఖ వారి వివరణతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని సంస్థకు సూచించింది.

ఆగస్టు 3న జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మెటా ప్రతినిధులను మూడు గంటలకు పైగా ఎంపీలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీడియోను రాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, దాదాపు ఐదు గంటల పాటు తొలగించిన విషయాన్ని మెటా అంగీకరించిందని నిషికాంత్ దూబే వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని, తగిన చర్యలు తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని కమిటీ మరోసారి స్పష్టం చేసింది


Read More
Next Story