
దంచికొట్టిన వాన... తిరుమలలో గొడుగుకింద శ్రీవారి పల్లకీసేవ
తిరుమల మాల్వాడిగుండం నుంచి జాలువారుతున్న జలపాతం..
తిరుపతిలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. తిరుమల గిరుల్లో కూడా కురిసిన వర్షం వల్ల శేషాచలం కొండల నుంచి జలపాతాల సవ్వడి ప్రారంభమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారి పల్లకీ సేవ కూడా గొడుగు నీడలో నిర్వహించారు.
అల్పపీడన ప్రభావం కారణంగా సూపర్ ఎల్ నినో ప్రభావం నుంచి సోమవారం కురిసిన వర్షంతో కాస్త ఊరటకల్పించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఊరేగుతున్నారు. అదే సమయంలో వర్షం కుండపోతగా కురిసింది. దీంతో ఘటాటోపం (గొడుగు నీడ)లో పల్లకీసేవను నిర్వహించారు.
శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉన్న యాత్రికులు కూడా గొడుగులు పట్టుకుని స్వామివారి ఉత్సవాన్ని చూసేందుకు వర్షంలో తడుస్తూనే ఉన్నారు.
తిరుపతిలో రోడ్లు జలమయం
తిరుపతిలో మధ్యాహ్నం నుంచి ఉక్కపోతతో జనం ఇబ్బందిపడ్డారు. సాయంత్రం కమ్ముకున్న మేఘాలతో కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షం నీరు పొంగిపొర్లింది. దీంతో అనేక ప్రాంతాల్లో వాహన రాకపోకలుకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా అలిపిరి నుంచి కపిలతీర్థం వరకు శేషాచలం కొండల నుంచి జాలువారిన వర్షం నీటితో దిగువన ఉన్న వీధులు, రోడ్లు నీటితో నిండిపోయాయి. దీనివల్ల వాహనరాకపోకలకు ఇబ్బందిగా మారింది.
జలపాతం కనువిందు...
శేషాచలం కొండల్లో శనివారం రాత్రి నుంచి దఫదఫాలుగా వర్షం కురుస్తోంది. దీంతో నీరు లేక ఇంకిపోయిన అడవుల్లో నీరు చేేరింది. కొండకోనల నుంచి వర్షం నీరు ప్రవహించడం ప్రారంభమైంది. కపిలతీర్థం సర్కిల్ లో నిలబడితే ఎదురుగా శేషాచలం కొండల నుంచి జాలువారుతున్న మాల్వాడిగుండి వద్ద సన్నటిధారగా జలపాతం ప్రారంభమైంది. ఈ రాత్రికి కూడా వర్షం కురిస్తే, ఈ జలపాతం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరింత ఆకర్షణగా మారనుంది. సోమవారం రాత్రి నుంచి ఇక్కడ జలపాతం కొండలపై నుంచి దుమకడం కనువిందుగా మారింది.

