అమెరికాలో గుండెపోటుకు గురైన ఈ తెలుగు టెకీ ఎవరంటే...
x

అమెరికాలో గుండెపోటుకు గురైన ఈ తెలుగు టెకీ ఎవరంటే...

ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు టెక్కీ అనూహ్యంగా తనువు చాలించారు.


ఉన్నత చదువులతో మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు టెక్కీ అనూహ్యంగా తనువు చాలించారు. ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌ (Sanford)లో నివసిస్తున్న సురేష్ కుమార్ (41) గుండెపోటుతో కన్నుమూశారు. ఏప్రిల్ 27వ తేదీ తెల్లవారుజామున సురేష్‌కు ఛాతీలో స్వల్పంగా మంటగా అనిపించింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, దురదృష్టవశాత్తు ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు ఆయనను పరీక్షించి గుండెపోటుగా ధ్రువీకరించారు. గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
సురేష్ కుమార్ హెచ్-1బీ (H-1B) వీసాపై అమెరికాలో ఉంటూ ఒక ప్రముఖ ఎంఎన్‌సీ (MNC) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన భార్య హెచ్4 (H4) వీసాపై (డిపెండెంట్) అక్కడ ఉంటున్నారు. సురేష్ పెద్ద కుమారుడు ప్రత్యేక అవసరాలు గల (Specially abled) బాబు కావడంతో, ఆ కుటుంబం ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయి తీరని ఇబ్బందుల్లో పడింది. చిన్న కుమారుడి వయస్సు కేవలం 3 ఏళ్లు మాత్రమే.
అమెరికాలో మరణించిన సురేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా పరిధి) వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందినవారు.
ఆయన తండ్రి సాంబశివరావు కూడా గతంలోనే మరణించారు. సురేష్ తన కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు.
సురేష్ హఠాన్మరణంతో ఆయన కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్కడి తెలుగు సంఘాలు, స్నేహితులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Read More
Next Story