క‌న్న కొడుక్కి ఖైదీ క‌న్నీటి వీడ్కోలు!
x
కొడుకు శ‌వాన్ని మోసుకెళ్తున్న తండ్రి (ఖైదీ) రాజు

క‌న్న కొడుక్కి ఖైదీ క‌న్నీటి వీడ్కోలు!

జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ఓ రిమాండ్‌ ఖైదీ కుమారుడి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌డానికి అనుమ‌తించి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు అన‌కాప‌ల్లి జిల్లా పోలీసులు.

ఖాకీలంటే చాలామందిలో ప్ర‌తికూల ధృక్ప‌థ‌మే ఉంటుంది. వారిలో చాలామందికి జాలి, ద‌య అనేవి అంత‌గా ఉండ‌వ‌నే భావ‌నే ఉంటుంది. కానీ పోలీసుల్లోనూ మాన‌వ‌త్వం ఉన్న వారుంటార‌ని అప్పుడ‌ప్పుడు నిరూప‌ణ అవుతుంటుంది. అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు అన‌కాప‌ల్లి జిల్లాలో జ‌రిగింది.పేగు బంధానికిచ్చిన విలువతో ఇప్పుడంద‌రి నోటా శెభాష్ అనిపించుకుంటున్నారు అన‌కాప‌ల్లి జిల్లా పోలీసులు. క‌ర్క‌శ‌కుల‌కు సైతం క‌న్నీరు తెప్పించారు.


కుమారుడి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిసు్త‌న్న రాజు

ఆ క‌న్నీటి క‌థ ఏమిటంటే?
అన‌కాప‌ల్లి వి.మాడుగుల మండ‌లం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు అలియాస్ మ‌హాల‌క్ష్మినాయుడు ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న గంజాయి అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్ట‌యి విశాఖ‌ప‌ట్నం సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం మే 31న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాంలో అత‌ని పెద్ద కుమారుడు సాయి కిర‌ణ్ (17) దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. మూడేళ్ల క్రిత‌మే రాజు చిన్న కుమారుడు జితేంద్ర కూడా అనారోగ్యంతో మృత్యువాత ప‌డ్డాడు. ఇప్పుడు అతని పెద్ద కొడుకు కూడా మ‌ర‌ణించ‌డంతో రాజు కుటుంబ స‌భ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇద్ద‌రు చేతికందివ‌చ్చే కొడుకులిద్ద‌రూ మ‌ర‌ణించ‌డం, కుటుంబ పెద్ద జైలులో మ‌గ్గిపోవ‌డం రాజు భార్య ల‌క్ష్మి ప‌రిస్థితి జంపెన గ్రామ‌స్తుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింది.
మాన‌వ‌త్వం చూపిన పోలీసులు..
క‌న్న కొడుకుని క‌డ‌సారి చూడ‌డానికి తండ్రిని తీసుకురావాల‌ని జంపెన గ్రామ‌పెద్ద‌లు, ఖైదీ రాజు కుటుంబీకులు నిర్ణ‌యించారు. దీంతో వీరంతా వి.మాడుగుల ఎస్ఐ నారాయ‌ణ‌రావు, కె.కోట‌పాడు సీఐ కృష్ణ‌ల‌ను క‌లిశారు. ఈ విష‌యాన్ని వారు అన‌కాప‌ల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అద‌న‌పు ఎస్పీ ఎల్‌.మోహ‌న్‌రావుల‌ దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంట‌నే స్పందించిన ఎస్పీ ప‌రిస్థితిని ఉన్న‌తాధికారులకు నివేదించారు. ఎస్పీ చొర‌వ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం (నిన్న‌) అత్వ‌స‌రంగా జీవో జారీ చేస్తూ ఖైదీ పెచ్చేటి రాజుకు ఒక రోజు కారాగారం నుంచి ఒక రోజు విడుద‌ల‌కు అనుమ‌తించింది.
కొడుక్కి ఖైదీ తండ్రి అంతిమ సంస్కారాలు..
ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులతో విశాఖ సెంట్ర‌ల్ జైలులో ఉన్న ఖైదీ రాజును ఎస్కార్ట్‌తో బుధ‌వారం ఉద‌యం పోలీసులు జంపెన గ్రామానికి తీసుకొచ్చారు. కుమారుడి మృత‌దేహాన్ని చూసి తండ్రి రాజు కుప్ప‌కూలిపోయాడు. విగ‌త జీవుడైన కుమారుడు, ఖైదీగా వ‌చ్చిన తండ్రిని చూసిన కుటుంబీకులు, జంపెన గ్రామ‌స్తులు ఒక్క‌సారిగా ఘొల్లుమ‌న్నారు. ఆ హృద‌య విదార‌క దృశ్యాన్ని చూసిన వారంతా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇలాంటి దుస్థితి ఎవ‌రికీ రాకూడ‌దంటూ అక్క‌డి వారంతా క‌న్నీటి సంద్ర‌మ‌య్యారు. అనంత‌రం తండ్రి రాజు మ‌ర‌ణించిన త‌న కుమారుడు సాయి కిర‌ణ్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని అంతిమ సంస్కారాలు నిర్వ‌హించాడు. ఊరంతా సాయికిర‌ణ్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. అంత్య‌క్రియ‌లు ముగిశాక పోలీసులు ఖైదీ రాజును మ‌ళ్లీ విశాఖ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. కుటుంబ స‌భ్యులు, జంపెన గ్రామ‌స్తులు బ‌రువెక్కిన గుండెల‌తో రాజును ఊరి పొలిమేర వ‌ర‌కు సాగ‌నంపారు.
పోలీసుల ప్ర‌శంస‌ల వెల్లువ‌..
క‌ష్ట‌కాలంలో ఉన్న ఓ కుటుంబానికి అండ‌గా నిలిచిన అన‌కాప‌ల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఇత‌ర పోలీసు అధికారుల‌ను బాధిత కుటుంబ స‌భ్యుల‌తో పాటు జంపెన గ్రామ‌స్తులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారే కాదు.. పోలీసుల మాన‌వ‌త్వాన్ని ఆ ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు కూడా కొనియాడారు. పోలీసులు చ‌ట్టాల‌ను అతిక్ర‌మించిన వారిని శిక్షించ‌డ‌మే కాదు.. గుండె కోత‌కు గురైన కుటుంబానికి అండ‌గా నిలిచారంటూ అన‌కాప‌ల్లి పోలీసులు అంద‌రి మ‌న్న‌న‌ల‌ను, ప్ర‌సంశ‌ల‌ను అందుకుంటున్నారు.
Read More
Next Story