
Ravan (file)
రావణ్ కేసులో కొత్త ట్విస్ట్! పాత వీడియోల్లో కొత్త సంగతులు!
జగన్ పై సాక్షాత్తూ ఈ రావణే అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఒక వీడియో చేయడం గమనార్హం.
రావణ్ పై రాజద్రోహం ఆరోపణలు మోపటం సమంజసమా, కాదా అనే చర్చను పక్కన పెడితే, అతని ప్రశ్న యూట్యూబ్ ఛానెల్ లోని పాత వీడియోల ద్వారా కొన్ని విచిత్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అతనికి సపోర్టుగా పోరాడుతున్న వైసీపీ వర్గాలు, పాపులర్ తెలుగు యూట్యూబర్లు చూస్తే షాక్ అయ్యేటట్లుగా ఆ వీడియోలు ఉన్నాయి. ఒక వీడియోలో అయితే - పవన్ కళ్యాణ్ నాడు “చెప్పు తీసుకుని కొడతాను కొడకల్లారా” అని వైసీపీ నాయకులను తిట్టటం నూరుశాతం కరెక్ట్ అంటూ సాక్షాత్తూ ఈ రావణే బలంగా సమర్థించాడు.
‘కొడకల్లారా’ అని పవన్ తిట్టటం సబబేనన్న రావణ్
ప్రస్తుతం ఏపీలో రగులుతున్న రావణకాష్ఠంలో సమస్యకు మూలం ఎక్కడ మొదలయింది… ఏలూరు దళిత క్రైస్తవ శంఖారావం సభలో పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్ వంటివారిపై రావణ్ చేసిన అసభ్య పదజాలంతో. అయితే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒక సభలో “చెప్పు తీసుకుని కొడతాను కొడకల్లారా” అంటూ బూతులు తిట్టాడు కదా, పవన్ కు ఒక న్యాయం, ప్రశ్నించే వాడికి ఒక న్యాయమా అని వైసీపీ వర్గాలు, కొందరు పాపులర్ యూట్యూబర్లు రావణ్ కు సపోర్ట్ చేస్తూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అదే ఈ మొత్తం ఇష్యూలో bone of contention. అయితే, నాడు పవన్ కళ్యాణ్ - చెప్పు తీసుకుని కొడతాను కొడకల్లారా అని మాట్లాడిన ఆ సభలో అతను అలా తిట్టటాన్ని సమర్థిస్తూ, అతను అలా ఎందుకు తిట్టవలసి వచ్చిందో వివరిస్తూ 2022 అక్టోబర్ 22న సాక్షాత్తూ ఆ రావణే ఒక వీడియో చేశాడు. “ఎవరూ ఏమీ అనకుండానే, రెచ్చగొట్టకుండానే పవన్ అలా తిట్టాడా” అని జగన్ ను రావణ్ ఆ వీడియోలో ప్రశ్నించాడు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై పవన్ ఎప్పుడూ విమర్శలు చేయలేదని, అది అతని సంస్కారమని అన్నాడు. వ్యక్తిగత విమర్శలు చేశాడని మీరు చూపిస్తారా అంటూ జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. పవన్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేయటంతోనే అతను విసిగిపోయి అలా తిట్టాడు అని, పవన్ ది ఈ విషయంలో 100% కరెక్ట్ అని, జగన్ దే తప్పు అని రావణ్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు.
జగన్ పై రెచ్చిపోయిన రావణ్
2023 జూన్ 29న చేసిన మరో వీడియోలో పవన్ ఊగిపోతూ చేసే ఉపన్యాసాలపై వెటకారంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై రావణ్ ఒక రేంజిలో రెచ్చిపోయాడు. పవన్ అలా ఊగిపోతూ మాట్లాడటం అతని మ్యానరిజం అని, నువ్వు కూడా ముద్దులు పెట్టుకుంటూ, తల నిమురుతూ ఉంటావు కదా అని జగన్ ను అడిగాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రచారశైలిని కూడా వెటకారం చేశాడు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదు అని జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. షర్మిల రెండో పెళ్ళి, వివేకానందరెడ్డి రెండో పెళ్ళి గురించి అడుగుతూ, ఒక హీరోయిన్ పేరు ప్రస్తావించి ఆమె సంగతి ఏంటి అని కూడా రావణ్ ప్రశ్నించాడు. ఇవే కాకుండా జగన్ ను దారుణంగా విమర్శిస్తూ గతంలో చేసిన ఎన్నో వీడియోలు అతని ఛానెల్ లో ఉన్నాయి. అవి అన్నీ చూస్తే రావణ్ ను సమర్థించటం కాదు, అతనికి ఆ శాస్తి జరగాల్సిందే అని వైసీపీ నాయకులు కోరుకునేటట్లుగా ఉన్నాయి ఆ వీడియోలు.
జుగుప్సాకరమైన భాష..
ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఉపయోగించే భాష విషయంలో మాత్రం రావణ్ ది తప్పుడు మార్గమని చెప్పక తప్పదు. అతను వ్యక్తులపై విమర్శలు చేయటానికి పల్లెటూళ్ళలో పోరంబోకులు మాట్లాడే పరమ రోత, అసహ్యకర, అసభ్య పదజాలాన్ని విచ్చలవిడిగా మాట్లాడతాడు. ఆ వీడియోలు ఆడవారు ఏమాత్రం చూడలేని విధంగా ఉంటాయి.
రావణ్ నేపథ్యం, అతని ప్రాధాన్యతలు..
ప్రాథమికంగా అతను హిందూ మత వ్యతిరేకి అని, టీడీపీ సానుభూతిపరుడు అని అతని యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను చూస్తే అనిపించకమానదు. అతని నేపథ్యాన్నిబట్టి దానిని కూడా అర్థం చేసుకోవచ్చు. అతని అసలు పేరు జోసెఫ్ బచ్చలికూర, తండ్రి డేనియల్ ది మాదిగ సామాజికవర్గం, తల్లిది కమ్మ సామాజికవర్గం. అతని కులాభిమానం విషయానికొస్తే, 2025 అక్టోబర్ 25న చేసిన ఒక వీడియోలో- నెల్లూరుజిల్లాలో ఒక కాపు సామాజికవర్గం వ్యక్తి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును కమ్మ సామాజికవర్గ వ్యక్తి కారు ఎక్కించి చంపిన ఘటనపై రావణ్ వ్యాఖ్యలు అతని కులాభిమానాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. కమ్మలు సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నారని వాపోతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. “చంద్రబాబునాయుడుగారూ, మీకు పార్టీకి నిధులు సమకూర్చటానికి, ర్యాలీలు నిర్వహించటానికి, ఎన్ఆర్ఐల నిధులకోసం కమ్మవారు కావాలిగానీ, కమ్మవారిని ఆదుకోవటానికి మాత్రం మీరు ముందుకురారా” అని రావణ్ ప్రశ్నించాడు. ఆ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఒక వ్యక్తిని ఈ వీడియోలో అతను తిట్టిన తిట్లు అత్యంత దారుణంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో కాపుల పాత్ర ఏమీ లేదు అని, నోటాతో పోటీ పడే, 5 శాతం ఓట్లు ఉన్న జనసేనవలన టీడీపీకి లబ్ది ఏమీ చేకూరలేదు అని అతను అన్నాడు. అసలు పవన్ షూటింగులు చేసుకున్నాడుగానీ, ఏనాడు జగన్ పై పోరాడాడు అని ప్రశ్నించాడు. అతనిదే గళం అనే మరో వీడియోలో చేసిన ఒక వీడియోలో - నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కృష్ణుడి వేషంలో పెట్టటానికి అడ్డుపడిన రామచంద్ర యాదవ్ పై, దానవీరశూరకర్ణ సినిమాలో కర్ణుడిని హీరోగా చూపటాన్ని విమర్శించిన అనంత శ్రీరామ్ పై రావణ్ నిప్పులు చెరిగాడు. అనంత శ్రీరామ్ ను అతని వైకల్యాన్ని ఎత్తి చూపుతూ దారుణంగా తిట్టాడు. వీరందరిపై కమ్మవారు ఎవరూ గొంతువిప్పటంలేదంటూ బాధపడ్డాడు.
అసభ్యకర భాషకు కొందరికి మినహాయింపు?
అయితే అతను ఈ మధ్య కొద్ది కొద్దిగా టీడీపీని విమర్శించాడుగానీ, దానికి కారణం ఒకటి కనపడుతోంది. అతని ప్రధాన టార్గెట్ పవన్ కళ్యాణ్, చిరంజీవి. వీళ్ళిద్దరి పేర్లు ఎత్తితే ఒంటికాలుపైన లేచి నిప్పులు చెరుగుతాడు. చిరంజీవికి వ్యతిరేకంగా అయితే ఏకంగా ఒక సిరీస్ వీడియోలు చేశాడు. చిరు, పవన్ లపై అతనికి ఉన్న కసిని తీర్చుకోవటంకోసం వైసీపీ నేతలతో, జడ శ్రావణ్ కుమార్, మాజీ ఐఏఎస్ విజయకుమార్ వంటి దళితనేతలు, పవన్ వ్యతిరేకులతో చేతులు కలిపాడు. ఈ వీడియోల ద్వారా వైసీపీ అభిమానుల నుంచి ఛానల్ కు వ్యూస్ పెరగటంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా అతనికి ఒకవైపు పవన్ పై కసి తీర్చుకోవటం, ఛానల్ కు ఆదాయం పెంచుకోవటం వంటి రెండు పరమార్థాలూ నెరవేరాయి. ఈ క్రమంలో వైసీపీ వర్గాల కంటి తుడుపుకోసం ఇటీవలి కాలంలో టీడీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ కొన్ని వీడియోలు చేశాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ విమర్శలలో, తన సహజధోరణిలో మిగిలినవాళ్ళను తిట్టినట్లు అసభ్యపదజాలంతో కాకుండా కేవలం తమలపాకుతో ఒకటి ఇచ్చాను అన్నట్లుగా సుతిమెత్తగా, సున్నితంగా మాత్రమే మాట్లాడటం గమనించవచ్చు. చంద్రబాబు, బాలకృష్ణల గురించి వీడియోలలో ప్రస్తావించవలసివస్తే, ‘చంద్రబాబునాయుడుగారు’, ‘బాలయ్యబాబు’ అని సంబోధిస్తుంటాడు.
మొత్తంమీద రావణ్ ఛానల్ లో వీడియోలను చూస్తే అతనికి ఒక బలమైన భావజాలం, సిద్ధాంతాలు, సామాజికస్పృహ ఉన్నట్లు కనిపించటంలేదు. యూట్యూబులో ఈమధ్య నడుస్తున్న ఒక ట్రెండ్ ను ఆయన అనుసరిస్తున్నట్లుగా కూడా స్పష్టమవుతోంది. వ్యూయర్ షిప్పే లక్ష్యంగా ఆయన వీడియోలు చేస్తున్నట్టు అర్థమవుతుంది.
గమనిక-(ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితవే)
Next Story

