
ఏపీ ఇంటర్ ఫలితాల్లో సరికొత్త రికార్డు..12 ఏళ్లలో ఇదే అత్యుత్తమం
ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, బుధవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. గత 12 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే, విద్యార్థులు ఈసారి అసాధారణ ప్రతిభ కనబరిచారని, విద్యా వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పులకు ఇది నిదర్శనమని మంత్రి కొనియాడారు.
రికార్డు స్థాయి ఉత్తీర్ణత .. ప్రభుత్వ కాలేజీల జోరు
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీపడి మరీ అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఇది గత 12 ఏళ్లలో అత్యధికం. అలాగే ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. విశేషమేమిటంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (GJC) పన్నెండేళ్ల రికార్డులను తిరగరాస్తూ ఫస్ట్ ఇయర్ లో 54%, సెకండ్ ఇయర్ లో 68% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటాయి.
అదరగొట్టిన అమ్మాయిలు.. జిల్లాల వారీగా ఫలితాలు
ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మరోసారి పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 85 శాతం, ప్రథమ సంవత్సరంలో 81 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచారు. జిల్లాల వారీగా చూస్తే, కృష్ణా జిల్లా 92 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా.. గుంటూరు (88%), ఎన్టీఆర్ జిల్లా (87%), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (82%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్రూపుల పరంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.
సప్లిమెంటరీ, రీకౌంటింగ్ షెడ్యూల్
ఫలితాల వెల్లడితో పాటు తదుపరి ప్రక్రియపై కూడా బోర్డు స్పష్టతనిచ్చింది. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో తప్పిన వారికోసం మే 21 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. మొదటి సంవత్సరం పాస్ అయిన వారు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశాన్ని కూడా బోర్డు కల్పించింది.
విద్యార్థులకు మంత్రి లోకేశ్ భరోసా
ఫలితాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు అస్సలు నిరాశ చెందవద్దు. ఇది ముగింపు కాదు, మీ విజయ ప్రస్థానంలో ఒక చిన్న అడ్డంకి మాత్రమే. మళ్ళీ కష్టపడి విజయం సాధించండి అని పిలుపునిచ్చారు. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు మానసిక బలాన్ని అందించి, వారి భవిష్యత్తు లక్ష్యాల వైపు ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ఫలితాలు చూసుకోవడం ఎలా?
విద్యార్థులు తమ ఫలితాల కోసం resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సాంకేతికతను జోడిస్తూ ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి నిమిషాల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
Results for the Intermediate Public Examinations are now out.
— Lokesh Nara (@naralokesh) April 15, 2026
Students can check their results online at https://t.co/UDtk11c781. Also, results can be accessed by sending a "Hi" message to the Mana Mitra WhatsApp number at 9552300009.
Glad to share that this year’s IPE results…
Next Story

