నవ్యాంధ్ర న్యాయ చరిత్రలో నూతన అధ్యాయం
x

నవ్యాంధ్ర న్యాయ చరిత్రలో నూతన అధ్యాయం

ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్.


ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక అరుదైన, గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దశాబ్దాల హైకోర్టు ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా.. తొలిసారిగా ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించబోతున్నారు. జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో, నవ్యాంధ్ర న్యాయ గమనం సరికొత్త మలుపు తిరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనుండగా, ఏప్రిల్ 25న జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సాక్షిగా రాజ్‌భవన్‌లో జరగబోయే ఈ ప్రమాణ స్వీకారం.. రాష్ట్ర న్యాయవ్యవస్థలో మహిళా శక్తికి పట్టాభిషేకం చేయబోతోంది.

చండీగఢ్ నుంచి అమరావతి వరకు
చండీగఢ్‌లో జన్మించిన జస్టిస్ లిసా గిల్, అక్కడి కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే ఆమె, ప్రభుత్వ మహిళా కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందారు. ఆపై న్యాయశాస్త్రంపై ఉన్న ఆసక్తితో పంజాబ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి, న్యాయకోవిదురాలిగా గుర్తింపు పొందారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆమె, పంజాబ్..హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన కేసుల్లో అపారమైన అనుభవం గడించారు. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె న్యాయవాద ప్రస్థానం, ఆమెకు చట్టంపై తిరుగులేని పట్టును సాధించిపెట్టింది.
సుదీర్ఘ అనుభవం..కీలక బాధ్యతలు
న్యాయవాదిగా ఉన్న కాలంలో ఆమె చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు పలు ప్రభుత్వ రంగ బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించి తన సమర్థతను చాటుకున్నారు. ఈ క్రమంలోనే 2014, మార్చి 31న ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు పదేళ్ల పాటు అక్కడ సేవలందించిన అనంతరం, ఈ ఏడాది మార్చి 13న బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు విచ్చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె, ఇప్పుడు అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిరోహించబోతున్నారు.
సత్తా చాటిన మహిళా శక్తి
జస్టిస్ లిసా గిల్ నియామకం కేవలం ఒక పదవీ బాధ్యత మాత్రమే కాదు. అది మహిళా లోకానికే గర్వకారణం. సుప్రీంకోర్టు కొలీజియం ముందస్తుగా చేసిన సిఫారసుల మేరకు, అత్యంత అనుభవం కలిగిన న్యాయమూర్తిగా ఆమెను ఈ పదవి వరించింది. పది సంవత్సరాలకు పైగా న్యాయమూర్తిగా ఆమె అందించిన నిష్పాక్షికమైన సేవలు ఏపీ న్యాయవ్యవస్థకు మరింత బలాన్ని ఇవ్వనున్నాయి. చారిత్రక నవ్యాంధ్ర నిర్మాణంలో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తొలి మహిళా సారథిగా ఆమె తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే తీర్పులు రాబోయే తరాలకు దిక్సూచిగా మారనున్నాయి.
ఏప్రిల్ 25న చారిత్రక ప్రమాణ స్వీకారం
నవ్యాంధ్ర రాజకీయ, న్యాయ పరిపాలనలో ఏప్రిల్ 25 ఒక చారిత్రక దినంగా నిలిచిపోనుంది. ఆ రోజున రాజ్‌భవన్‌లో జరగనున్న అత్యున్నత స్థాయి కార్యక్రమంలో, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సమక్షంలో జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆమె బాధ్యతలు చేపట్టనుండట గమనార్హం. ఒక మహిళా న్యాయమూర్తి చేతికి న్యాయస్థానపు చుక్కాని దక్కడం, మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో, ఏపీ హైకోర్టుకు మొదటిసారిగా ఒక మహిళా సీజే సారథ్యం వహించడం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని, స్ఫూర్తిని నింపుతోంది.
Read More
Next Story