
చెట్టు తర్వాత మ్యాన్‌హోల్.. ముంబైలో మళ్లీ పౌర నిర్లక్ష్యం
చెట్టు కూలి బాలుడు మృతి చెందిన కొద్ది రోజులకే.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ముంబైలో మరోసారి పౌర నిర్లక్ష్యం ప్రాణం తీసింది. చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన కొద్ది రోజులకే, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి 55 ఏళ్ల అస్లాం ఇషాక్ షేక్ మృతి చెందారు. ఈ ఘటన గురువారం భారీ వర్షాల సమయంలో చందివాలి ప్రాంతంలో జరిగింది.
మురుగునీటి పైపులైన్‌కు రక్షణ గ్రిల్ అమర్చేందుకు కాంట్రాక్టు కార్మికులు మ్యాన్‌హోల్ మూత తొలగించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు హెచ్చరించినా, బాధితుడు అదుపుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయినట్లు బీఎంసీ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.
ఈ ఘటనపై బీఎంసీ నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. బాధ్యుడిగా భావించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేసింది. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది.
ఇక ముంబైలోని అన్ని మ్యాన్‌హోల్‌లను ఎనిమిది రోజుల్లో తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన మహారాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రస్తావనకు వచ్చింది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిని అత్యంత తీవ్రమైన ఘటనగా పేర్కొంటూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రమాదం కాదని, అధికారుల నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ముంబైలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో నగర వర్షాకాల భద్రతపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

