అమరావతి రైతులకు 98 శాతం ప్లాట్ల కేటాయింపు
x
అమరావతిలో పూర్తయిన నిర్మాణాలు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

అమరావతి రైతులకు 98 శాతం ప్లాట్ల కేటాయింపు

కేవలం 674 మందికి మాత్రమే పెండింగ్‌.. 89 శాతం రిజిస్ట్రేషన్ కూడా ముగిసినట్టు మంత్రి నారాయణ వెల్లడి


రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని, భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98 శాతం పూర్తయిందని మంత్రి పి. నారాయణ ప్రకటించారు. కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని, అది కూడా కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, అసైన్డ్ భూములు వంటి సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. కేటాయించిన ప్లాట్లలో 89.3 శాతం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టు మంత్రి స్పష్టం చేశారు.

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. దాదాపు పూర్తి అయిన 12 టవర్లలో ఎమ్మెల్యేల ఫ్లాట్లను వారం రోజుల్లో జీఏడీకి అప్పగించనున్నట్టు ప్రకటించారు. మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీల ఇళ్లను హ్యాండోవర్ చేస్తామని తెలిపారు. అలాగే అల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాలు, మంత్రుల బంగళాలు తుది దశకు చేరుకున్నాయని, ఈ నెలాఖరుకు కొన్ని ఇళ్లు, వచ్చే నెలాఖరుకు మిగిలిన భవనాలు ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి వెల్లడించారు.


రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

రైతులకు లాటరీ విధానంలో పారదర్శక కేటాయింపు

రాజధాని కోసం ఇప్పటివరకు 30,753 మంది రైతులు 35,017 ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. వీరిలో 30,079 మంది రైతులకు (97 శాతం) 34,527 ఎకరాలకు సంబంధించి 98.6 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. మొత్తం 70,824 ప్లాట్లు కేటాయించగా, 63,295 ప్లాట్లు (89.3 శాతం) రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 7,529 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.

ప్లాట్ల కేటాయింపు పూర్తిగా లాటరీ విధానంలో రైతుల సమక్షంలోనే జరిగిందని మంత్రి హామీ ఇచ్చారు. “ఏ గ్రామంలో భూములిస్తారో అదే గ్రామంలో ప్లాట్లు కేటాయించాం. అందుబాటులో లేకపోతే పక్క గ్రామాల్లో ఇచ్చాం. ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు” అని స్పష్టం చేశారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్నవారికి మాత్రమే పెండింగ్ ఉందని వివరించారు.


ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇంటీరియల్ డెకరేషన్ ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

ట్రంక్ రోడ్లు, ఇతర నిర్మాణాలు వేగంగా…

అమరావతిలో ట్రంక్ రోడ్లు, లే-అవుట్ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఐకానిక్ టవర్లను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు ముగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ హామీ ఇచ్చారు.

ల్యాండ్ పూలింగ్‌కు ఆహ్వానం

ల్యాండ్ పూలింగ్‌కు రైతులు ముందుకు రాని చోట్ల మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి వివరించారు. ఇప్పటికీ ఆ రైతులను ల్యాండ్ పూలింగ్‌కు రావాలని కోరుతున్నామని, కోర్టు ఏ నిర్ణయం ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

అమరావతి నిర్మాణం ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమవుతోందని మంత్రి నారాయణ అన్నారు. రైతులకు న్యాయం చేస్తూ, పారదర్శకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story