సీఈసీని తొలగించాలని ప్రతిపక్ష ఎంపీల డిమాండ్
x

సీఈసీని తొలగించాలని ప్రతిపక్ష ఎంపీల డిమాండ్

73 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు..


Click the Play button to hear this message in audio format

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను (Gyanesh Kumar)ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. 73 మంది ఎంపీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌కు నోటీసు అందజేశారు. 73 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులో సంతకాలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ (Jairam Ramesh), టీఎంసీ నాయకురాలు సాగరిక ఘోష్ (Sagarika Ghose) ఈ నోటీసును సెక్రటరీ జనరల్‌కు సమర్పించినట్లు సమాచారం.

“ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ రాజ్యసభలో 73 మంది ప్రతిపక్ష ఎంపీలు కొత్త తీర్మాన నోటీసును సమర్పించారు” అని జైరామ్ రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

సీఈసీపై ఉన్న ఆరోపణలేంటి?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో పక్షపాతం, రాజకీయ పార్టీలపై బహిరంగ వ్యాఖ్యలు, పాలనాపర లోపాలు, రాజ్యాంగ పరిమితులను దాటి చర్యలు తీసుకోవడం, మోదీ ప్రసంగంపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు సీఈసీపై గుర్రుగా ఉన్నాయి. ఏప్రిల్ 18న ప్రధాని మోదీ (Narendra Modi) జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం మోదీపై ఏ చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ వేగంగా స్పందించడాన్ని తప్పుబట్టాయి.

ఓటరు జాబితా, బదిలీలపై విమర్శలు..

పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లలో ఓటర్ల జాబితా సవరణలపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారీగా ఓటర్ల తొలగింపును “సామూహిక ఓటు హక్కు రద్దు”గా అభివర్ణించాయి. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ చేసి రాజ్యాంగ పరిమితులను అతిక్రమించారని ఆరోపించారు.

మద్దతు తెలిపిన పార్టీలు..

రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌కు ఇచ్చిన నోటీసులో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, వామపక్ష పార్టీలు, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ), ఆర్‌జేడీ, ఐయూఎంఎల్ వంటి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్లు సమాచారం.

గతంలో నోటీసు తిరస్కరణ..

గతంతో సీఈసీని తొలగించాలని ఇంతకుముందు ఇలాంటి నోటీసులు ఇచ్చినా.. వాటిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla), రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (C. P. Radhakrishnan) తిరస్కరించారు.

విచారణకు డిమాండ్..

సీఈసీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షం కోరింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.

తుది పరిణామం..

ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే, సీఈసీని పదవి నుంచి తొలగించే ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

Read More
Next Story