ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖలో ఒక శకం ముగుస్తున్న వేళ భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేడు (ఏప్రిల్ 24, 2026) పదవీ విరమణ చేస్తున్న తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 72 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సీజే తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే ఈ స్థాయి స్థానచలనం కల్పించడం విశేషం. పదోన్నతులు పొందిన వారితో పాటు, మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ, మే 7వ తేదీ లోపు బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. పరిపాలనాపరమైన కొనసాగింపును నిర్ధారిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు చర్చనీయాంశంగా మారగా.. మరోవైపు ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనుండటం న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది.
మే 7 లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశం
సాధారణంగా మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని నిబంధనల ప్రకారం బదిలీ చేసినట్లు హైకోర్టు వెల్లడించింది. బదిలీ అయిన జడ్జీలందరూ మే 7వ తేదీ లోపు తమకు కేటాయించిన కొత్త పోస్టింగ్‌లలో బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. దీంతో పాటు ఒక కీలక ఆదేశాన్ని కూడా జారీ చేసింది. రిలీవ్ అయ్యే లోపు తాము ఇప్పటికే విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కేసులకు సంబంధించి తప్పనిసరిగా తీర్పులను వెలువరించాలని స్పష్టం చేసింది. దీనివల్ల న్యాయ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడవచ్చని హైకోర్టు భావిస్తోంది.
కీలక కోర్టులకు కొత్త న్యాయమూర్తులు
ఈ బదిలీల్లో భాగంగా రాష్ట్రంలోని పలు కీలక కోర్టులకు కొత్త జడ్జీలను నియమించారు. విజయవాడ రెండో అదనపు జిల్లా జడ్జిగా ఉన్న ఎ. సత్యానంద్‌ను ప్రకాశం జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పదోన్నతిపై పంపారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్. తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జిగా ఉన్న పి. భాస్కరరావు పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. అలాగే, గుంటూరు అదనపు జిల్లా జడ్జి జి. చక్రపాణిని విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ట్రిబ్యునళ్లకు కొత్త చైర్మన్లు
కోర్టులతో పాటు వివిధ ట్రిబ్యునళ్లకు కూడా కొత్త నాయకత్వాన్ని కేటాయించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా టి. రామచంద్రుడు, విజయవాడ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కె. రాధారత్నం బాధ్యతలు చేపట్టనున్నారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా జడ్జి జి. గీతను నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ చేశారు. విజయవాడ ఏసీబీ, విశాఖ సీబీఐ కోర్టులు రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినవి కావడంతో, కొత్త జడ్జీల నియామకం ద్వారా అక్కడ పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల విచారణ ఇకపై మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కీలక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం (2026 ఏప్రిల్ 24న) పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె రేపు (ఏప్రిల్ 25న) బాధ్యతలు స్వీకరించనున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఒకవైపు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వీడ్కోలు, మరోవైపు తొలి మహిళా సీజే రాకతో ఏపీ న్యాయశాఖలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అటు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విమరణ, ఇటు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ పదవీ బాధ్యతలు స్వీకరణ, దీనికి తోడు 72 మంది జిల్లా జడ్జీలను బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి.