రాష్ట్రంలో 7 వేల డ్రగ్స్ కేసులు: డీజీపీ
x

రాష్ట్రంలో 7 వేల డ్రగ్స్ కేసులు: డీజీపీ

ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం మంగళగిరిలో అత్యున్నత స్థాయి మాదకద్రవ్య వ్యతిరేక విభాగం ఈగల్ (Elite Anti-Narcotics Group for Law Enforcement) ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 7,000 డ్రగ్స్ కేసులు విచారణ దశలో ఉన్నాయని సంచలన గణాంకాలను వెల్లడించారు. ఈ కేసులను వేగంగా కొలిక్కి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా మరో 13 కొత్త ఎన్‌డీపీఎస్ (NDPS) కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

సాంకేతికతతో నిఘా .. ఈగల్ బలోపేతం
గత ఏడాదిన్నర కాలంగా ఈగల్ వింగ్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని డీజీపీ కొనియాడారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రతిష్టాత్మక విభాగాల తరహాలోనే ఈగల్ కూడా ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని తెలిపారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి త్వరలోనే ఈ విభాగంలో ఒక అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తీసుకురావడానికి డ్రోన్లు , శాటిలైట్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, దీనివల్ల ఉత్పత్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామని వివరించారు.
వినియోగదారులపై ఉక్కుపాదం .10 వేల టెస్టింగ్ కిట్లు
డ్రగ్స్ సరఫరా చేసే వారే కాకుండా, వాటిని వినియోగించే వారిపై కూడా పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు, వాటి కోసం పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుండి వాటిని దిగుమతి చేసుకుంటున్నారు అనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. దీనికోసం మొదటి దశలో 10,000 డ్రగ్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసినట్లు డీజీపీ వెల్లడించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా అంతరాష్ట్ర నెట్‌వర్క్‌లపై ఈగల్ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని చెప్పారు.
యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు
పోలీసు శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం నేరాలను అరికట్టడమే కాకుండా, యువత పెడదోవ పట్టకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశమని డీజీపీ తెలిపారు. డ్రగ్స్ కేసుల ట్రయల్ వేగవంతం చేయడం ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story