ఏఐ క్రియేటివ్ ప్రతీకాత్మక చిత్రం ఇది

ఓ టీచరమ్మా, పసికూనను పొట్టనబెట్టుకున్నావెందుకమ్మా!

అభం శుభం తెలియని పసివాడిపై ప్రతాపం.. టీచర్‌ కొట్టడంతో తరగతి గదిలోనే కుప్పకూలిన చిన్నారి!


ఆరేళ్ల పిల్లాడికి హోం వర్క్ ఏమిటీ? అది చేయలేదని టీచర్ కొట్టడం ఏమిటీ? ఆ పిల్లాడు భయంతో చచ్చిపోవడం ఏమిటీ? ప్రస్తుతం మన విద్యావ్యవస్థ, బోధనా తీరుపై తలెత్తిన ప్రశ్నలు ఇవి.

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు స్కూలులో నిన్న ఓ దారుణం జరిగింది. హోంవర్క్‌ చేయలేదన్న కోపంతో టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందారు. విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్‌ గార్డెన్‌ స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించి, కొట్టిన తర్వాతే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాతనగరం ఏవీఎన్‌ కళాశాల డౌన్‌రోడ్డు సమీపంలో కృష్ణప్రసాద్, సాయిలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ప్రణయ్‌తేజ్‌ (6 ఏళ్లు) రీడింగ్‌రూమ్‌ సమీపంలోని లిటిల్‌ గార్డెన్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ఈ ఘటన విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల తీరు, ప్రభుత్వ పర్యవేక్షణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రీ-ప్రైమరీ స్థాయిలో హోంవర్క్ భారం ఎందుకు?

జాతీయ విద్యా విధానం (NEP), విద్యా హక్కు చట్టం మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక/పూర్వ ప్రాథమిక (Pre-primary) దశలోని పిల్లలపై హోంవర్క్ భారం ఉండకూడదు. అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలు ఆరేళ్ల పసిపిల్లలకు రాయడం, హోంవర్క్ పూర్తిచేయాలనే ఒత్తిడిని ఎందుకు రుద్దుతున్నాయి? అని ప్రశ్నించారు విద్యావేత్త డాక్టర్ అంజిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. అవి ఇలా ఉన్నాయి.
నిషేధ చట్టాలు ఎందుకు అమలు కావడం లేదు?
విద్యా హక్కు చట్టం (RTE Act, సెక్షన్ 17) ప్రకారం బడుల్లో పిల్లలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించడం చట్టరీత్యా నేరం. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు భౌతిక దాడులకు పాల్పడకుండా చూసే పటిష్ట నిఘా వ్యవస్థ పాఠశాలల్లో ఎందుకు లోపించింది?
ఉపాధ్యాయుల నియామకాలు, బాలల మనస్తత్వ శిక్షణ ఏదీ?
ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించే సమయంలో వారి అర్హతలతో పాటు బాలల మనస్తత్వ శాస్త్రం (Child Psychology), సహనం, కోప నియంత్రణ (Anger Management) వంటి అంశాలను పరీక్షిస్తున్నారా? పిల్లలను దండించకుండా అర్థం చేసుకునే బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందుతోందా?
తరగతి గదిలో చిన్నారి కుప్పకూలిన వెంటనే పాఠశాలలో ప్రాథమిక చికిత్స అందించేందుకు కనీస ఏర్పాట్లు ఉన్నాయా? అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్ లోపు సరైన వైద్య సహాయం అందించడంలో పాఠశాల యాజమాన్యాల కార్యాచరణ ఏమిటి?
విద్యాశాఖ తనిఖీలు, పర్యవేక్షణ లోపమా?
ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాల్సిన అధికార యంత్రాంగం కేవలం ఘటనలు జరిగినప్పుడే కమిటీల పేరుతో స్పందిస్తోందా? ముందస్తు తనిఖీలు, పర్యవేక్షణలు ఎందుకు నిరంతరం జరగడం లేదు?
ఏదైనా సంఘటన జరిగిన తర్వాత అధికారులు, మంత్రులు స్పందిస్తున్నారే తప్ప నిరంతరం చేయాల్సిన తనిఖీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థి మృతిపై పోలీసులకు ఫిర్యాదు
టౌన్‌కొత్తరోడ్డు వద్ద లిటిల్‌గార్డెన్‌ స్కూల్లో యూకేజీ చదువుతున్న తమ్మన ప్రణయ్‌తేజ్‌ మృతిపై విద్యా శాఖాధికారులు, అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహారాణిపేట ఇన్‌ఛార్జి ఎంఈవో-1 రవీంద్రబాబు బడిలో సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. ఉపాధ్యాయురాలు విద్యార్థి చెంపపై కొట్టిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి తండ్రి కృష్ణప్రసాద్‌ కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈమేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ పూడి వరప్రసాద్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా విద్యార్థి మృతిపై విచారణకు విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు విజయబాస్కర్, డీఈవో ఎన్‌.ప్రేమకుమార్, విశాఖ ఆర్డీవో దిలీప్‌చక్రవర్తితో ప్రభుత్వం కమిటీని నియమించింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ ప్రణయ్ తేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలను అరికట్టేలా చర్యలు చేపడతామన్నారు.
Read More
Next Story