
టెక్కలిలో పెళ్లికి వెళ్తూ నలుగురు పల్నాడు వాసుల దుర్మరణం
గండిగుండం రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లకు చెందిన పాలగాని రామాంజినేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, ఆయన కుమారుడు మందపాటి భవానీశంకర్, అలాగే నరసరావుపేటకు చెందిన డ్రైవర్ శ్రీను కలిసి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. ఆనందపురం సమీపంలోని గండిగుండ వద్ద ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారు ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పాలగాని రామాంజినేయులు (51), షేక్ మీరావలి (56), మందపాటి భవానీశంకర్ (11), డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మందపాటి చంద్రశేఖర్‌ను భీమిలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమూల్య నర్సింగ్ హోమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విశాఖ జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Next Story

