
చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు: అయ్యన్నపాత్రుడి కొత్త ఆలోచన
ఈ ప్రతిపాదనను ఆయన తన పార్టీ ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెడతారామే చూడాలి.
పార్లమెంటు మహిళా రిజర్వేషన్ల గురించి చర్చిస్తున్నపుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరొక కొత్త రిజర్వేషన్ డిమాండ్ చేశారు. యువకులకు పార్లమెంటులో సీట్లలో 33 శాతం రిజర్వేషన్లు ఉందడాలని అన్నారు. ఇంతవరకు ఇలాంటి డిమాండ్ ఎవరూ చేయలేదు. మహిళలకు రిజర్వేషన్లు, బిసిలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బిసి కోటా ఉండాలి... ఇలా అడిగారు తప్ప యువకులకు కోటా ఉండాలని ఎవరూ కోరలేదు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి త్వరలో రాబోతున్న మహిళా రిజర్వేషన్ల తరహాలోనే, చట్టసభల్లో యువతకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) పశ్చిమ ప్రాంత సదస్సులో 'దేశాభివృద్ధిలో యువ శాసనకర్తల పాత్ర' అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదన చేశారు.
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో 40 ఏళ్ల లోపు వారికి కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించారు.
సగటు భారతీయుడి వయసు 32 ఏళ్లు కాగా, లోక్సభ సభ్యుల సగటు వయసు 56, ఏపీ శాసనసభ్యుల సగటు వయసు 53 ఏళ్లుగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సగటు పౌరుడికి, ప్రజాప్రతినిధులకు మధ్య వయసులో 20 ఏళ్ల వ్యత్యాసం ఉండటంపై అందరూ ఆలోచించాలని అన్నారు.
18వ లోక్సభలో 40 ఏళ్ల లోపు యువత కేవలం 11 శాతం మాత్రమే ఉండగా, ఏపీ అసెంబ్లీలో ఇది 7 శాతానికే పరిమితమైందని వివరించారు.
చట్టసభల్లో కొందరు శాసనసభ్యుల ప్రవర్తన కారణంగా యువత రాజకీయాలను ఏవగించుకుంటున్నారని, ప్రజాప్రతినిధుల పనితీరు ఆదర్శప్రాయంగా ఉంటేనే రాజకీయాల పట్ల యువతకు గౌరవం కలుగుతుందని స్పీకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశలో రాజకీయాలకు దాదాపు తెరపడటం, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రాకపోవడం దీనికి ఒక కారణమన్నారు. 1982లో ఎన్టీ రామారావు యువతకు అవకాశాలు కల్పించడం వల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యేను కాగలిగానని, అవకాశం కల్పిస్తే యువత తప్పక రాణిస్తుందని ఆయన గుర్తు చేసుకున్నారు.
విభిన్నంగా ఆలోచించే యువతను చట్టసభల్లోకి తీసుకువస్తేనే కొత్త ఆలోచనలతో మెరుగైన భవిష్యత్తుకు పునాదులు పడతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనను ఆయన తన పార్టీ ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెడతారామే చూడాలి.
Next Story

