
3 రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా, సేవలు యధాతథం
ఆదివారం రాత్రి 9:30 గంటలకు బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యూనియన్ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు UFBU ప్రకటించింది.
సెప్టెంబర్ 28 నుంచి అంటే ఇవాళ్టి (సోమవారం) నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. కోట్లాది మంది ఖాతాదారులకు ఇది భారీ ఊరట. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నేటి నుంచి తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను చివరి నిమిషంలో వాయిదా వేసింది.
ఆదివారం రాత్రి 9:30 గంటలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యూనియన్ నేతలు జరిపిన కీలక చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు UFBU ప్రకటించింది.
చర్చల్లో కుదిరిన ప్రధాన ఒప్పందాలు ఇవే:
'ఫైవ్-డే బ్యాంకింగ్'పై జాయింట్ కమిటీ: అన్ని శనివారాలను సెలవు దినాలుగా మార్చే ప్రతిపాదనను పరిశీలించేందుకు తక్షణమే IBA, UFBU ప్రతినిధులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడంతో పాటు, ఖాతాదారులు, సంబంధిత వాటాదారులందరితో చర్చించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించనుంది.
పీఎల్ఐ (PLI) స్కీమ్ సవరణ: స్కేల్ IV, ఆపై స్థాయి అధికారుల పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌లో మార్పులు తీసుకురావడంపై IBAతో త్వరలో చర్చలు ప్రారంభించనున్నారు. తద్వారా ఈ అధికారుల ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.
పెండింగ్ సమస్యల పరిష్కారం: మార్చి 8, 2024 నాటి సమావేశపు మినట్స్ లో పేర్కొన్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి.
అత్యున్నత స్థాయి కమిటీకి అంగీకారం:
"ఐదు రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌ను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు ఐబీఏ అంగీకరించిందని" ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆర్. శేఖరన్ మీడియాకు వివరించారు. ఈ హై-లెవల్ కమిటీలో UFBU ప్రతినిధులు కూడా ఉంటారని, వాటాదారులందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే డిమాండ్‌పై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఐబీఏ సానుకూలంగా స్పందించడం, తమ డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హామీలు లభించడంతో ఆందోళనలను, సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు UFBU ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి యథాతథంగా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతున్నాయి.
Next Story

