
కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలి
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాత జిల్లాల్లో ఇస్తున్నట్లుగా హెచ్ఆర్ఏ 16 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి నాయకులు ఏపీ సీస్ ను కోరారు.
రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 16 శాతం ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) వెంటనే వర్తింపజేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డు (ఇహెచ్‌ఎస్)లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటు చేసిన అధికారిక కమిటీ సమావేశాన్ని తక్షణం నిర్వహించాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సచివాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు లేఖలు సమర్పించారు. 2023లో ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్న నేపథ్యంలో, ఇటీవల ఏర్పాటైన మదనపల్లి (అన్నమయ్య జిల్లా), మార్కాపురం (మార్కాపురం జిల్లా), రంపచోడవరం (పోలవరం జిల్లా) జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
నాయకులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త జిల్లా హెడ్‌క్వార్టర్లలో అద్దెలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 2023 మే 9న ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.69 ప్రకారం కొత్త జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాల్సి ఉందని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం రంపచోడవరంలో 10 శాతం, మార్కాపురం, మదనపల్లి జిల్లా కేంద్రాల్లో 12 శాతం మాత్రమే ఇస్తున్నందున, జనవరి 1, 2026 నుంచి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోనూ 16 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇహెచ్‌ఎస్ సమస్యలపై కమిటీ సమావేశం కావాలి
ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డు సమస్యలను పరిష్కరించేందుకు గత ముఖ్యమంత్రి హామీ మేరకు ఏర్పాటు చేసిన అధికారిక కమిటీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని కూడా జేఏసీ నాయకులు కోరారు. 2025 అక్టోబర్ 18న జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీల ప్రకారం, 60 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ శాఖ ద్వారా జీవో ఎంఎస్ నం.880తో కమిటీని నియమించారు. గత సి.ఎస్ కే. విజయానంద్ అధ్యక్షతన జనవరి 30, 2026న ఒక సమావేశం జరిగినప్పటికీ, తదుపరి సమావేశాలు జరగకపోవడంతో సమస్యలు కొనసాగుతున్నాయని వారు వివరించారు. ఫిబ్రవరి 5, 2026 నాటికి 60 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో, ప్రస్తుత సి.ఎస్ అధ్యక్షతన త్వరలో సమావేశం నిర్వహించి నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని, హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఆర్థిక శాఖ వెంటనే పరిశీలన చేస్తుందని, ఇహెచ్‌ఎస్ సమస్యలపై త్వరలో కమిటీ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం ఉద్యోగుల మనోవేదన తీర్చి, ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తుందని వారు ఆశా వ్యక్తం చేశారు.

