కడప దస్తగిరి హత్య వెనుక చేతులు మారిన డబ్బు ఎంత?
x
నిందితుడు నిత్యానంద రెడ్డి (ఎడమ) దస్తగిరి (కుడి)

కడప దస్తగిరి హత్య వెనుక చేతులు మారిన డబ్బు ఎంత?

100 కోట్ల ఆస్తి వ్యవహారమే బెడిసికొట్టిందా? వైసీపీ నేత నిత్యానంద రెడ్డి పోలీసులకు ముట్టచెప్పింది ఎంత?


కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు కేవలం ఒక నేరంగానే కాకుండా, రాజకీయ, వ్యాపార విభేదాల కలయికగా కనిపిస్తోంది. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితులు దొరికిన తీరు, దీని వెనుక ఉన్న ఆర్థిక కోణాలపై ఇప్పుడు సమగ్ర శోధన సాగుతోంది. మరోపక్క టీడీపీ, నేతలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఈ హత్య వెనుక పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైసీపీ అధినేత జగన్ కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్టుగా టీడీపీ ఆరోపించగా వైసీపీ ఎమ్మెల్యే జూపూడి దీన్ని తీవ్రంగా ఖండించారు. హత్యకు గురైన దస్తగిరి, నిందితుడు నిత్యానంద రెడ్డి ఇద్దరూ వైసీపీ నేతలే కావడమే ఈ వివాదానికి కారణమైంది.

ఇవన్నీ ఎట్లా ఉన్నా పెద్ద దస్తగిరి హత్య చాలా ఖరీదైన మర్డర్ గానే పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కూడా వేటు పడింది.
హత్య వెనుక అసలు కారణం..
పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక విభేదాలని పోలీసుల రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికిన సుమారు ₹100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, 145 ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈ వివాదం ఎంత పెద్దదో సూచిస్తున్నాయి.

నిత్యానందరెడ్డి ప్రమేయం..

మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ హత్యకు స్కెచ్ వేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్థిరాస్తి లావాదేవీల్లో దస్తగిరితో వచ్చిన విభేదాల వల్లే అతన్ని అడ్డుతొలగించుకోవాలని నిత్యానందరెడ్డి భావించినట్లు తెలుస్తోంది. మారెమ్మ జాతరలో జరిగిన ఒక చిన్న గొడవను ఈ హత్యకు సాకుగా వాడుకున్నారు. దస్తగిరి కొడుకుపై జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని, కొడుకును చూసేందుకు రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన దస్తగిరిని నిందితులు పక్కా ప్లాన్‌తో మాటువేసి కిరాతకంగా చంపారు.

హత్య తర్వాత నిత్యానందరెడ్డి భరోసా?

హత్య చేసిన వెంటనే నిందితులు నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లడం, ఆయన వారికి డబ్బు, వాహనాలు సమకూర్చి "కేసు నేను చూసుకుంటా" అని భరోసా ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో నిందితులు పోలీసులకు దొరకడానికి ఒక ఫోన్ కాల్ కీలకంగా మారింది. ఒక పోలీసు ఉన్నతాధికారి దర్యాప్తు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా, ఒక అధికారికి ఫోన్ వచ్చింది. ఉన్నతాధికారి ఆదేశంతో స్పీకర్ ఆన్ చేయగా, అటువైపు నుంచి నిత్యానందరెడ్డి మాట్లాడుతున్నట్లు తేలింది.
కేసును పక్కదారి పట్టించి "గంజాయి బ్యాచ్" మీదకు నెట్టేందుకు నిత్యానందరెడ్డి పోలీసు అధికారులతో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించినట్లు దీని ద్వారా బయటపడింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకున్నారు.
ఈ హత్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, భూదందాలే ఈ హత్యకు కారణమని, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను వదిలిపెట్టబోమని ప్రభుత్వం చెబుతోంది.
వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ వాదన..
ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ ఆరోపిస్తోంది. వివేకా హత్య కేసును ఇక వాడుకోలేమని భావించే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు దస్తగిరి హత్యను వైసీపీకి అంటగట్టి జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. నిత్యానందరెడ్డి ఇంట్లో దొరికిన పత్రాలన్నీ కట్టుకథలని జూపూడి కొట్టిపారేశారు.
ప్రస్తుతానికి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేయగా, నిత్యానందరెడ్డి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న భూ పత్రాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పత్రాల విచారణ పూర్తయితే, ఈ హత్య వెనుక ఇంకా ఎంతమంది "పెద్దలు" ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. ఒక సామాన్య రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య వెనుక ఇంతటి భారీ ఆస్తి వివాదం, రాజకీయ కుట్ర దాగి ఉండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిత్యానందకీ పోలీసులకి లింక్ ఏమిటంటే...
నిత్యానందరెడ్డికి, పోలీసు అధికారులకు మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడటం ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు. ఆ లింక్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే..
సాధారణంగా నేరం జరిగినప్పుడు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులతో కేసు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. దస్తగిరి హత్య కేసుపై ఒక ఉన్నతాధికారి దర్యాప్తు బృందంతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఓ అధికారికి వచ్చిన ఫోన్ కాల్ ఈ అక్రమ లావాదేవీలను పట్టిచ్చింది. అది చూసిన ఉన్నతాధికారికి అనుమానం వచ్చి, ఫోన్‌ను 'స్పీకర్' ఆన్ చేసి మాట్లాడమని ఆదేశించారు. ఫోన్ అటువైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి సాక్షాత్తు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నిత్యానందరెడ్డి అని తేలింది.
కేసును పక్కదారి పట్టించే ఒప్పందం..
ఆ ఫోన్ కాల్ ద్వారా పోలీసులకు, నిత్యానందరెడ్డికి మధ్య ఉన్న లాలూచీ స్పష్టమైంది. ఈ హత్యను వైసీపీ నేతలు చేయించారని కాకుండా, ఏదో ఒక గంజాయి బ్యాచ్ లేదా స్థానిక రౌడీ మూకలు చేసినట్లుగా చిత్రీకరించాలని నిత్యానందరెడ్డి కోరినట్లు సమాచారం.

రూ. 50 లక్షల బేరం..

కేసును తప్పుదోవ పట్టించి, తమ పేర్లు బయటకు రాకుండా చూసేందుకు సదరు అధికారులకు సుమారు 50 లక్షల రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఉదంతంతో ఉన్నతాధికారులకు పోలీసు శాఖలోని 'బ్లాక్ షీప్స్' (నమ్మకద్రోహులు) గురించి క్లారిటీ వచ్చింది. నిత్యానందరెడ్డితో టచ్‌లో ఉంటూ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు అధికారులను వెంటనే బాధ్యతల నుంచి తప్పించి, వారిని వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో నేరస్థులకు, పోలీసుల్లోని ఒక వర్గానికి మధ్య ఉన్న అపవిత్ర బంధం అధికారికంగా ధృవీకరించారు.
హత్య జరిగిన తర్వాత నిందితులు (ఏ1, ఏ2) నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత ఆయన కొంతమంది పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉండటం వంటి అంశాలను వారి కాల్ డేటా రికార్డ్స్ (CDR) ఆధారంగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు.
Read More
Next Story