
కాన్పూర్‌లో ఘోరం: కవల కూతుర్లను హత్య చేసిన తండ్రి
నిందితుడి మానస్థిక స్థితి సరిగా లేకపోవడం, కుటుంబంలో విభేదాల వల్లేనని పోలీసుల విచారణలో వెల్లడి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్పూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 11 ఏళ్ల కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసి, అనంతరం తానే పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటన నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిద్వాయ్ నగర్‌లో ఉన్న త్రిమూర్తి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న శశి రంజన్ మిశ్రా (48) అనే వ్యక్తి తన ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఉదయం సుమారు 4:30 గంటలకు అత్యవసర సేవల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. తొలుత పోలీసులు, ఆ తర్వాత కాసేపటికి ఫోరెన్సిక్ నిపుణులు మిశ్రా ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు బాలికల మృతదేహాలు ఇంటి లోపలే లభించాయి. వారి గొంతులపై లోతైన కోత గాయాలు ఉన్నట్లు గుర్తించారు. వారు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు మానసిక స్థితి సరిగా లేదని, కుటుంబంలో కొంతకాలంగా విభేదాలున్నాయని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్ తెలిపారు. ‘నా ప్రవర్తనపై ఆయన అనుమానం పెట్టుకున్నారు. తన డిప్రెషన్ కారణంగా ఇంట్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాడు. నా కదలికలను గమనిస్తూ, కుటుంబ సభ్యులతో అనుమానంతో ప్రవర్తించేవాడు’ అని నిందితుడి భార్య రేష్మా పేర్కొన్నారు.
శనివారం రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేసిన తర్వాత, పిల్లలను పడుకోబెట్టారు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు నిందితుడు మేల్కొని, ఒక బాలికను బాత్రూంకి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం కొంతసేపటికే గదిలో లైట్లు ఆర్పివేశాడు. దాదాపు రెండు గంటల తర్వాత, మిశ్రా అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి తన కూతుళ్లను చంపినట్లు తెలిపాడు. పోలీసులు చేరుకునేసరికి ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
శశి రంజన్ మిశ్రా, రేష్మా 2014లో వివాహం చేసుకున్నారు. వారికి కవల కుమార్తెలతో పాటు ఒక ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు హత్యకు గల ఖచ్చితమైన కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సంబంధాలు, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత అనుమానాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి చూపించింది.

