
ఢిల్లీ జంతర్ మంతర్ కి ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తోందీ?
దాతలపై నిఘా సంస్థల దృష్టి..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ కి ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తోందీ? ఎవరు ఆర్డరు చేస్తున్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా ఆహారం పంపిస్తున్న దాతలు ఎవరు?
ప్రస్తుతం ఈ ప్రశ్న నిఘా వర్గాలను వేధిస్తోందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది.
జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో సాగుతున్న విద్యార్థుల నిరసనలకు దేశం నలుమూలల నుంచి వస్తున్న ఆహార సహాయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. నిరసనకారులకు పెద్ద ఎత్తున ఆహారం, తాగునీరు, ఇతర అవసరాల వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని ఎవరు ఆర్డర్ చేస్తున్నారు? ఈ సహాయానికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు సమాచారం.
దేశం నలుమూలల నుంచి ఫుడ్ ఆర్డర్లు
జంతర్ మంతర్ వద్ద విధులు నిర్వహిస్తున్న స్విగ్గీ డెలివరీ భాగస్వామి అజయ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక్కరోజులోనే అక్కడికి ఐదుసార్లు ఆహారం డెలివరీ చేశాడు. ఆయనకు వచ్చిన ఒక ఆర్డర్‌లో "Love from Kerala" అనే సందేశం కనిపించింది. అంటే కేరళలో ఉన్న ఓ వ్యక్తి, ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు ఆహారం పంపించాడు. (ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఆధారంగా)
అలాగే జొమాటో డెలివరీ భాగస్వామి సందీప్ తెలిపిన ప్రకారం, ముంబై, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమోసాలు, బర్గర్లు, మోమోలు, రైస్, ప్యాటీస్ వంటి అనేక రకాల ఆహార పదార్థాలు ఆర్డర్ అవుతున్నాయి.
"ఆకలితో ఉన్న ఎవరికైనా ఇవ్వండి"
ఈ ఆర్డర్లలో ప్రత్యేక వ్యక్తి పేరు ఉండటం లేదు. "ఆకలితో ఉన్న ఏ నిరసనకారుడికైనా ఈ ఆహారం అందించండి" అనే సూచనలు మాత్రమే డెలివరీ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉంటున్నాయని డెలివరీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో డెలివరీ ఏజెంట్లు బ్యారికేడ్ల వద్ద ఉన్న వాలంటీర్లకు ఆహారం అప్పగిస్తుండగా, వారు లోపల ఉన్న నిరసనకారులకు పంపిణీ చేస్తున్నారు.
వాలంటీర్ల సేవలు
ఆహారంతో పాటు నీటి బాటిళ్లు, ORS ప్యాకెట్లు, బిస్కెట్లు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. గురుగ్రామ్‌కు చెందిన తన్వి అనే మహిళ సెలవు తీసుకుని నిరసనల్లో పాల్గొంటూ ఆహారం పంపిణీ, మెడికల్ క్యాంపులో సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
మరో వాలంటీర్ నీత్ పాల్ సింగ్ మాట్లాడుతూ, రెండు రోజులుగా సరిగా తినక బలహీనంగా ఉన్న ఒక నిరసనకారుడికి వెంటనే నీరు, ఆహారం అందించినట్లు చెప్పారు.
ఎన్‌జీవోల సహకారం
ఢిల్లీలోని సచ్‌కండ్ ఫౌండేషన్ రోజుకు మూడుసార్లు సుమారు 2,000 మందికి సరిపడా ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. 60 మందికి పైగా వాలంటీర్లు షిఫ్ట్‌ల వారీగా సేవలు అందిస్తున్నారు. ఆహారంతో పాటు టార్చ్‌లు, దోమతెరలు, ఎనర్జీ డ్రింక్స్, గొడుగులు, రెయిన్‌కోట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
అదే సమయంలో పలు విద్యార్థి సంఘాలు కూడా తమ టెంట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాను సమన్వయం చేస్తున్నాయి.
నిఘా వర్గాల దృష్టి
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల రూపంలో నిరసనకారులకు నిరంతరం సహాయం అందుతుండటంతో, ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తోంది? ఎవరు సమన్వయం చేస్తున్నారు? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే అంశాలపై భద్రతా, నిఘా సంస్థలు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు ఈ సహాయం అక్రమమని లేదా చట్టవిరుద్ధమని ఏ అధికారిక సంస్థ ప్రకటించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, వ్యక్తిగత దాతలు మానవతా దృక్పథంతో ఆహారం, నీరు వంటి అవసరాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు నిధుల మూలాలపై ఖచ్చితమైన నిర్ధారణకు అవకాశం లేదని పరిశీలకులు సూచిస్తున్నారు.
Next Story

